Zinc Rich Foods | మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అనేక రకాల విటమిన్లు, మినరల్స్ అవసరం అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే సదరు పోషకాలు మనకు పోషణను అందివ్వడంతోపాటు మనకు కలిగే వ్యాధులను సైతం నయం చేస్తాయి. అయితే ఒక్కో పోషక పదార్థం మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. అవి అనేక విధులను నిర్వహిస్తాయి. ఈ క్రమంలోనే మన శరీర రోగ నిరోధక శక్తి పెరిగేందుకు కూడా పోషకాలు అవసరం. వాటిల్లో జింక్ మొదటి స్థానంలో నిలుస్తుంది. మన శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంలో జింక్ ఎంతగానో సహాయం చేస్తుంది. జింక్ వల్ల గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి. మన శరీరం జింక్‌ను నిల్వ చేసుకోలేదు. కనుక దీన్ని రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక జింక్ మనకు ఏయే ఆహారాల్లో లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
గుమ్మడికాయ విత్తనాలను జింక్‌కు అత్యుత్తమ వనరుగా చెప్పవచ్చు. వీటిని రోజూ మీరు తినే ఆహారాలపై చల్లి తినవచ్చు. లేదా స్నాక్స్ రూపంలోనూ తినవచ్చు. రోజూ గుప్పెడు మోతాదులో ఈ విత్తనాలను తింటే జింక్ సమృద్ధిగా లభిస్తుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. పురుషుల్లో ప్రోస్టేట్ గ్రంథి ఆరోగ్యంగా ఉంటుంది. ఈ విత్తనాలను తినడం వల్ల మెగ్నిషియం సమృద్ధిగా లభిస్తుంది. దీంతో కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. రాత్రి పూట కాలి పిక్కలు పట్టుకుపోకుండా చూడవచ్చు. అలాగే నిద్ర కూడా చక్కగా పడుతుంది. గుమ్మడికాయ విత్తనాలను తింటే ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
శనగలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా జింక్‌ను పొందవచ్చు. వీటిని సలాడ్స్, కూరలు వంటి వాటిల్లో కలిపి తినవచ్చు. శనగలను తినడం వల్ల కేవలం జింక్ మాత్రమే కాకుండా ఫైబర్, ప్రోటీన్లు, ఇతర అవసరమైన పోషకాలు లభిస్తాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. పాలకూరను ఆహారంలో భాగం చేసుకుంటున్నా కూడా జింక్‌ను పొందవచ్చు. పాలకూరను తింటే ఐరన్, మెగ్నిషియం లభిస్తాయి. పాలకూరను స్మూతీలు, సలాడ్స్ వంటి వాటిలో కలిపి తినవచ్చు. తరచూ పాలకూరను తింటే జింక్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
పప్పు దినుసులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా జింక్‌ను పొందవచ్చు. జింక్‌లో ఫైబర్, ప్రోటీన్లు, ఇతర విటమిన్లు ఉంటాయి. పప్పు దినుసులను సూప్‌లు, చారు, సలాడ్స్‌లో ఆహారంగా చేర్చుకోవచ్చు. పప్పు దినుసులను తింటే శరీర రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. దీంతో కణాలు నిర్మాణమవుతాయి. ఆరోగ్యంగా ఉండవచ్చు. జీడిపప్పు అంటే చాలా మందికి ఇష్టమే. అయితే ఇందులోనూ జింక్ అధికంగానే ఉంటుంది. రోజూ గుప్పెడు జీడిపప్పును తింటే మన శరీరానికి కావల్సిన జింక్‌లో చాలా వరకు లభిస్తుంది. జీడిపప్పును నీటిలో నానబెట్టి లేదా పెనంపై వేయించి తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. పోషణను అందిస్తుంది.