Zinc Deficiency Symptoms | మన శరీరానికి కావల్సిన పోషకాల్లో జింక్ కూడా ఒకటి. జింక్ వల్ల మన శరీర రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. కణాలు నిర్మాణమవుతాయి. ప్రోటీన్లు, డీఎన్ఏ నిర్మాణం వంటి వాటికి దాదాపుగా 300 వరకు ఎంజైమ్‌లు అవసరం అవుతాయి. ఈ ఎంజైమ్‌లను పనిచేసేలా చేయడం కోసం మనం రోజూ జింక్ ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. మనం తినే ఆహారంలో జింక్ ఉండేలా చూసుకోవాలి. మన శరీరం జింక్‌ను నిల్వ చేసుకోదు. కనుక రోజూ జింక్ ఉండే ఆహారాలను తినాల్సి ఉంటుంది. ప్రతి రోజు మనకు పరిమిత మోతాదులో జింక్ అవసరం అవుతుంది.
పురుషులకు రోజుకు 11 మిల్లీగ్రాముల జింక్ అవసరం. అదే మహిళలకు అయతే 8 మిల్లీగ్రాములు సరిపోతుంది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు రోజుకు 12 మిల్లీగ్రాముల జింక్ కావల్సి ఉంటుంది. జింక్ లోపిస్తే శరీరం పలు సంకేతాలను, లక్షణాలను తెలియజేస్తుంది. దీంతో జింక్ లోపం వచ్చిందని నిర్దారించుకోవచ్చు. ఇక ఆ సంకేతాలు ఏమిటంటే..
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు, గాయాలైనప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేసేందుకు జింక్ ఉపయోగపడుతుంది. జింక్ లోపం ఏర్పడితే గాయాలు తగిలినప్పుడు అవి త్వరగా నయం కావు. అలాగే ముఖంపై మొటిమలు కూడా వస్తుంటాయి. జింక్ లోపం వల్ల జీర్ణశక్తి తగ్గుతుంది. దీంతో ఆకలి ఉండదు. ఆహారం తినాలనిపించదు. దీని వల్ల సడెన్‌గా బరువు తగ్గిపోతారు. జింక్ లోపం వల్ల జుట్టు రాలిపోతుంది. జుట్టు చిట్లడం, జుట్టు పలుచబడడం, కాంతిని కోల్పోవడం వంటి లక్షణాలు అన్నీ జింక్ లోపాన్ని సూచిస్తాయి.
జింక్ తగ్గితే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో తరచూ జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తరచూ మీకు జలుబు, దగ్గు వస్తున్నా, ఇన్ఫెక్షన్లు అవుతున్నా, మీలో జింక్ లోపం ఉందని అర్థం చేసుకోవాలి. జింక్ తగినంత అందితే జలుబు దానంతట అదే తగ్గిపోతుంది. ఇక కంటి చూపుకు కూడా జింక్ అవసరం. శరీరానికి తగినంత జింక్ లభించకపోతే చూపు మందగిస్తుంది. మసకగా అనిపిస్తుంది. జింక్, విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరిచేందుకు ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి శరీరంలో జింక్ లోపిస్తే చూపు మసకబారుతుంది.
జింక్ లోపం వల్ల గందరగోళంగా ఉంటుంది. మనస్సంతా ప్రశాంతంగా ఉండదు. ఆందోళనగా ఉంటారు. అలాగే సంతానోత్పత్తిపై కూడా ప్రభావం చూపుతుంది. కనుక ఈ లక్షణాలు ఉంటే జింక్ లోపం ఉందని అర్థం చేసుకోవాలి. జింక్ మనకు ఎక్కువగా శనగలు, తృణ ధాన్యాలు, సీ ఫుడ్, పుచ్చకాయ విత్తనాలు, గుమ్మడికాయ విత్తనాలు, వాల్ నట్స్, ఓట్స్, జీడిపప్పు, పెరుగు, డార్క్ చాక్లెట్లు తదితర ఆహారాల్లో ఉంటుంది. డాక్టర్ సలహా మేరకు జింక్ సప్లిమెంట్లను కూడా వాడుకోవచ్చు. దీంతో జింక్ లోపం నుంచి బయట పడతారు.