Empty Stomach | రోజూ ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలా మంది రకరకాల పానీయాలను, ఆహారాలను తీసుకుంటారు. కొందరు పరగడుపునే వీటిని తీసుకుంటుంటారు. కొందరు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడానికి ముందు తింటారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం మనం తినే ఆహారం ఎన్నో పోషకాలను కలిగి ఉండాలి. అలాగే జీర్ణ వ్యవస్థకు లేదా ఇతర అవయవాలకు హాని చేయనిది అయి ఉండాలి. అప్పుడే ఉదయం మనం తినే ఆహారాల వల్ల మనకు మేలు జరుగుతుంది. అయితే చాలా మంది ఉదయం పోషకాహారం తినడం లేదు. ఇంట్లో లేదా బయట అందుబాటులో ఏ ఆహారం ఉంటే దాన్ని తింటున్నారు. దీని వల్ల రోగాల బారిన పడుతున్నారు. అయితే కొన్ని రకాల ఆహారాలు లేదా పానీయాలను ఉదయం పరగడుపున తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. ఇక ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
యాసిడ్లు అధికంగా ఉండే ఆహారాలను ఉదయం పరగడుపున ఎట్టి పరిస్థితిలోనూ తీసుకోకూడదు. ఇవి జీర్ణాశయ గోడలపై ఉండే పొరను దెబ్బతీస్తాయి. దీంతో పొట్టలో అసౌకర్యం ఏర్పడుతుంది. కడుపులో మంట వస్తుంది. దీర్ఘకాలంలో ఇది అల్సర్‌కు దారి తీస్తుంది. అప్పుడు సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. కనుక యాసిడ్లు ఎక్కువగా ఉండే ఆహారాలను పరగడుపునే తీసుకోకూడదు. నారింజ, ద్రాక్ష, టమాటాలు పొట్టలో అసిడిటీని పెంచుతాయి. కనుక పరగడుపున వీటిని తినకూడదు. అలాగే టీ, కాఫీ వంటి పానీయాలను కూడా ఉదయం పరగడుపున తాగరాదు. ఇవి కూడా జీర్ణాశయంలో యాసిడ్ల ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో అసిడిటీ వచ్చి ఇబ్బంది పడతారు. అలాగే కొందరు సోడా లేదా ఫిజ్ వంటి పానీయాలను సైతం ఉదయం పరగడుపున తాగుతారు. ఇవి కూడా జీర్ణ వ్యవస్థపై నెగెటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి. కడుపు ఉబ్బరం, పొట్టలో అసౌకర్యానికి కారణం అవుతాయి. కనుక వీటిని కూడా తాగకూడదు.
కొందరు ఉదయం పరగడుపునే కారం అతిగా ఉండే ఆహారాలను తింటారు. కారంలో క్యాప్సెయిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది పరగడుపునే మన పొట్టలో చేరితే తీవ్ర జీర్ణ సంబంధ సమస్యలను కలగజేస్తుంది. క్యాప్సెయిసిన్ వల్ల జీర్ణాశయ గోడలపై ఉండే పొర దెబ్బ తింటుంది. కడుపులో మంట సంభవిస్తుంది. అజీర్తి ఏర్పడుతుంది. కొందరికి కడుపు నొప్పి కూడా వస్తుంది. కారంగా ఉండే ఆహారాలు జీర్ణాశయంలో యాసిడ్లను అధికంగా ఉత్పత్తి చేస్తాయి. దీని వల్ల అసిడిటీ వస్తుంది. దీర్ఘకాలంలో ఇది అల్సర్లకు దారి తీస్తుంది. కనుక పరగడుపునే కారంగా ఉన్న ఆహారాలను సైతం తినకూడదు.
కొందరు ఉదయం తీపి అధికంగా ఉండే ఆహారాలను తింటుంటారు. ఇది కూడా మంచిది కాదు. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించి ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. కానీ వీటి వల్ల నెగెటివ్ ప్రభావం పడుతుంది. శరీరంలో షుగర్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి. దీని వల్ల క్లోమగ్రంథి ఇన్సులిన్‌ను అధికంగా ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. దీని కారణంగా దీర్ఘకాలంలో క్లోమగ్రంథిపై భారం పడి అది పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంటుంది. ఇది డయాబెటిస్‌కు దారి తీస్తుంది. కాబట్టి పరగడుపునే తీపి ఆహారాలను తినడం కూడా మానేయాలి. అయితే పరగడుపున పచ్చి కూరగాయలను సలాడ్‌లా చేసుకుని తినవచ్చు. కానీ వీటిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక త్వరగా జీర్ణం కాదు, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి వారు కూడా ఉదయం పచ్చి కూరగాయలను తినకపోవడమే మంచిది. ఇలా ఉదయం పరగడుపున తినే ఆహారాల విషయంలో జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది.