Health tips : ప్రతి ఏడాది జనం భారీ సంఖ్యలో డెంగ్యూ బారిన పడుతున్నారు. డెంగ్యూ దోమల సంతతి పెరగడానికి నిలువ నీరు కారణమవుతున్నది. ఒకవేళ మీరు డెంగ్యూ బారినపడితే తిరిగి కోలుకునే వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. మీరు ఎంత త్వరగా డెంగ్యూ నుంచి కోలుకుంటారనేది మీరు తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి డెంగ్యూ బారీ నుంచి సత్వరమే బయటపడేసే కొన్ని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. కొబ్బరి నీళ్లు
డెంగ్యూ బారిన పడితే శరీరం బాగా డీ హైడ్రేషన్‌కు గురవుతుంది. ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి కొబ్బరి నీళ్లు బాగా తోడ్పడుతాయి. కాబట్టి డెంగ్యూ రోగులకు వైద్యులు కొబ్బరి నీళ్లు తాగాలని సూచిస్తుంటారు.
2. పొప్పడి ఆకుల రసం
పొప్పడి ఆకుల రసం కూడా డెంగ్యూ చికిత్సలో బాగా పనిచేస్తుంది. డెంగ్యూ రోగి పొప్పడి ఆకుల రసం తీసుకోవడం వల్ల ప్లేట్లెట్ కౌంట్ మెరుగుపడుతుంది. అదేవిధంగా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మంచి ఫలితం రావాలంటే డెంగ్యూ పేషెంట్ పొప్పడి ఆకుల రసాన్ని నీటితో కలిపి రోజుకు రెండుమూడు సార్లు తీసుకోవాలి.
3. మేక పాలు
మేక పాలలో సెలెనియం పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో సెలెనియం కీలకపాత్ర పోషిస్తుంది. శరీరంలో వైరస్లు వృద్ధి చెందకుండా కూడా సెలెనియం తోడ్పడుతుంది. కాబట్టి డెంగ్యూ పేషెంట్లు త్వరగా కోలుకోవడానికి మేక పాలు తీసుకోవడం చాలా ముఖ్యం.
4. కివీ ఫ్రూట్
డెంగ్యూ పేషెంట్ కివీ పండును ఆహారంలో తీసుకోవడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది శరీరంలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతేగాక ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది.
5. వేప ఆకులు
వేప ఆకులలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇవి వైరస్ల వృద్ధిని, వ్యాప్తిని అరికట్టడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. డెంగ్యూ చికిత్సలో ప్రకృతి సిద్ధమైన ఔషధంగా వేప ఆకులు పనిచేస్తాయి. రోజూ ఉదయాన్నే లేత వేపాకులు తినడం ద్వారా ప్రయోజనం ఉంటుంది.