Heart Health | ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఆ సంకేతాలను మనకు శరీరం చూపిస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ముందు కూడా మన గుండె ప్రమాద సంకేతాలను చూపిస్తుంది. అయితే ఈ సంకేతాలు, హెచ్చరికలు రాత్రి సమయంలో ఎక్కువగా కనిపిస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. పగటిపూట మనం చేసే పనుల కారణంగా మనం ఆ లక్షణాలను గుర్తించలేం. కానీ రాత్రి సమయంలో శరీరం నిశ్చలంగా ఉంటుంది. గుండె ఒత్తిడిని మనం గుర్తించగలిగే వీలు ఉంటుంది. దీంతో మనం ముందస్తు హెచ్చరికలను, సంకేతాలను అర్థం చేసుకోవచ్చు. శరీరం విశ్రాంతి తీసుకున్నప్పుడు చిన్న చిన్న లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. అయితే పగటిపూట కదలికలు, పనులు మనల్ని తేలికపాటి అసౌకర్యం నుండి దూరం చేస్తాయి. కనుక మనం ఈ సంకేతాలను అర్థం చేసుకోలేం. రాత్రి సమయంలో ఉండే నిశ్శబ్దం, నిశ్చలత గుండె సంకేతాలను మనం సులభంగా అర్థం చేసుకునేలా చేస్తుంది.
అంతేకాకుండా రాత్రిపూట రక్తప్రసరణలో మార్పు వస్తుంది. మనం నిటారుగా పడుకోవడం వల్ల రక్తం మన శరీరం అంతటా భిన్నంగా కదులుతుంది. దీంతో గుండె, ఊపిరితిత్తుల మీద ఒత్తిడి ఇంకా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఛాతిలో అసౌకర్యం, ఊపిరి ఆడనట్టుగా ఉండడం వంటి లక్షణాలను మనం గమనించవచ్చు. అదే విధంగా రాత్రిపూట రక్తపోటు, గుండె లయను నియంత్రించే హార్మోన్ల స్థాయిలు మారతాయి. ఒత్తిడి హార్మోన్ తగ్గుతుంది. ఇతర హార్మోన్లు కూడా హెచ్చుతగ్గులకు గురవుతాయి. ఇది గుండె పనిభారాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది కొంతమందిలో దడ, ఒత్తిడి వంటి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఈ హార్మోన్ల మార్పులు రాత్రి సమయంలో ఎక్కువగా ఉంటాయి కనుక ఈ సంకేతాలను మనం పగటిపూట కంటే రాత్రి పూట ఎక్కువగా గమనించవచ్చు.
అలాగే రాత్రి సమయంలో మనకు ఎటువంటి అంతరాయం ఉండదు. మనస్సు నిశ్శబ్దంగా మారినప్పుడు పగటిపూట విస్మరించిన గుండె సంకేతాలను మనం సులభంగా గుర్తించవచ్చు. తేలికపాటి అసౌకర్యం, క్రమరహిత స్పందనలు ఎక్కువగా అనిపించవచ్చు. ఇక శరీరం అప్రమత్త స్థితిలోకి మారడం వల్ల అకస్మాత్తుగా మేల్కొనడం వల్ల శారీరక అనుభూతులు పెరుగుతాయి. దీంతో నిద్ర నుండి మేల్కొన్న సమయంలో హృదయ స్పందనల రేటు పెరుగుతుంది. ఇది గుండె ఒత్తిడిని మరింత తీవ్రతరం చేస్తుంది. అందుకే చాలా మంది అర్థరాత్రి మేల్కొన్న తర్వాత దడ, అసౌకర్యం వంటి లక్షణాలను గమనిస్తారు. ఈ విధంగా రాత్రిపూట తరచూ దడ, ఛాతిలో అసౌకర్యం, ఒత్తిడి, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలను గమనించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది.