Health Tips | ఆరోగ్యంగా ఉండాలంటే మనం రోజూ వ్యాయామం చేయడంతోపాటు పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. వేళకు నిద్ర పోవాలి. భోజనం పూర్తి చేయాలి. ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవాలి. దీంతో ఎలాంటి రోగాలు రాకుండా 100 ఏళ్లు జీవించవచ్చు. అయితే ఒక సర్వే చెబుతున్న ప్రకారం నూటికి 70 శాతం మంది చాలా అనారోగ్యకరమైన అలవాట్లను కలిగి ఉన్నారట. వీటి కారణంగానే చాలా మంది రోగాల బారిన పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. చాలా మంది నిత్యం అనేక తప్పులను చేస్తుంటారు. అయితే మనం చేసే ఈ చిన్న తప్పులే రేపు పెద్ద రోగాలను తెచ్చి పెడతాయని సైంటిస్టులు అంటున్నారు. ఈ అలవాట్లను, తప్పులను చేయడం మానుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చని, ఎలాంటి రోగాలు రావని వారు అంటున్నారు.
మనిషి అన్నాక పొరపాట్లు చేయడం సహజం. తిట్టడమూ సహజమే. అయితే మనం ఎవరి మీద అయినా ఏ కారణం చేత అయినా కోపం తెచుకున్నా, లేదా వారిని తిట్టినా అది అక్కడితో వదిలేయాలి. దాని గురించి పదే పదే ఆలోచించకూడదు. ఇతరులు మన పట్ల ఆ విధంగా ప్రవర్తించినా కూడా దాన్ని అంతటితో వదిలేయాలి. తీవ్రంగా ఆలోచించరాదు. ఇలా చేస్తే ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయట. సగం రోగాలకు ఇవే కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల దీర్ఘకాలంలో శరీరంపై నెగెటివ్ ప్రభావం పడుతుందట. హైబీపీ రావడం, గుండె జబ్బుల బారిన పడడం, శరీర రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా మారడం వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. కాబట్టి ఏ విషయంలో అయినా సరే కోపం వచ్చినా, తిట్టినా వెంటనే దాన్ని అక్కడితో మర్చిపోవాలి. మనస్సులో ఎలాంటి నెగెటివ్ ఆలోచనలను పెట్టుకోకూడదు. దీంతో ఆరోగ్యంగా జీవించవచ్చు.
చాలా మంది పని ఒత్తిడిలో పడి ఆఫీస్లో డెస్క్ వద్దనే లంచ్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆహారాన్ని ఎక్కువగా తినే ప్రమాదం ఉంటుందట. అలాగే డెస్క్ వద్ద ఎలాంటి పరిస్థితిలోనూ ఇతర ఏ ఆహారాలను కూడా తినకూడదట. దీంతో ఎంత తింటున్నాం అని చూసుకోకుండా అతిగా తినేస్తారట. ఇది అనేక జబ్బులకు కారణమవుతుందని 2022లో కొందరు సైంటిస్టులు చేసిన అధ్యయనంలో తేలింది. కనుక మీరు ఏదైనా ఆహారం తినాలన్నా, పానీయం తాగాలన్నా డెస్క్ నుంచి దూరంగా వెళ్లండి. కాసేపు సమయం కేటాయించండి. దీంతో తీసుకునే ఆహారంపై నియంత్రణ ఉంటుంది. అలాగే ఒత్తిడి, ఆందోళన నుంచి కాసేపు మనశ్శాంతి లభిస్తుంది. దీంతో ఆరోగ్యంగా ఉంటారు.
చాలా మంది ఒంటరిగా జీవిస్తుంటారు. లేదా ఒంటరిగా పనిచేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మెదడుపై హానికర ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఆందోళన, డిప్రెషన్, ఒత్తిడి వస్తాయని అంటున్నారు. కనుక ఏ పని చేసినా నలుగురితో కలిసి చేస్తే ఎంతో హ్యాపీగా ఉంటారని, ఇది ఆరోగ్యంపై పాజిటివ్ ప్రభావం చూపిస్తుందని, రోగాలు రాకుండా రక్షించుకోవచ్చని అంటున్నారు. అలాగే గంటల తరబడి కూర్చుని పనిచేయడం కూడా మంచిది కాదని, దీంతో బరువు అధికంగా పెరిగిపోవడంతోపాటు టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. కనీసం గంటకు ఒకసారి అయినా సరే 5 నుంచి 10 నిమిషాలు చేసే పనికి విరామం ఇవ్వాలని, దీంతో ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకుని ఆరోగ్యంగా జీవించవచ్చని అంటున్నారు. కాబట్టి నిత్య జీవితంలో చేసే ఈ పొరపాట్లను చేయకుండా ఉంటే ఎలాంటి రోగాలు రాకుండా చూసుకోవచ్చు.