ఒకప్పుడు చందమామను చూపిస్తూ.. గోరుముద్దలు తినిపించేది అమ్మ! పిల్లాడు ఆరోగ్యంగా పెరిగేవాడు. ఇప్పుడు.. సెల్ఫోన్ చేతికిచ్చి, ముద్దలు తినిపిస్తుంది. నాన్నేమో.. ట్యాబ్ చూపిస్తూ లాల పోస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎదుగుతున్న చిన్నారులను.. పసితనంలోనే అనేక రుగ్మతలు చుట్టుముడుతున్నాయి. పెరుగుతున్న సాంకేతికత కొన్నిరకాల వ్యాధులకు కారణం అవుతున్నది. అందులో ఒకటి ఆటిజం. సెల్ఫోన్లు, ట్యాబ్ల వాడకం పెరిగేకొద్దీ ఆటిజం సమస్య హెచ్చుతున్నది.
మన దేశంలో ప్రతి 80మంది చిన్నారుల్లో ఒకరికి ఆటిజం సమస్య ఉండవచ్చనేది ఒక అంచనా. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని ఆటిజంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా ఏప్రిల్ 2న ‘వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే’ నిర్వహిస్తున్నది. అసలు ఈ ఆటిజం అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, రావడానికి గల కారణాలేంటి? దాని లక్షణాలు, ఆటిజం వల్ల పిల్లల్లో ఎలాంటి అనారోగ్యం ఏర్పడుతుంది? ఈ సమస్యను ఎలా గుర్తించాలి, నిర్ధారణ పద్దతులు, చికిత్సా విధానం తదితర అంశాలను నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
Autism | ఆటిజం అనేది బయటికి కనిపించే ఒక రకమైన మానసిక వ్యాధి లక్షణం. చాలా ఆటిజం కేసుల్లో మాటలు మొదట్లో వస్తాయి. కానీ రెండేండ్లు వచ్చేసరికి మాటలు ఆగిపోతాయి. దీనినే ‘రిగ్రెషన్’ అంటారు. చాలామంది పిల్లల్లో మొదటి రెండేండ్లలోపే ఇది జరుగుతుంది. ఆటిజం సమస్య ఉన్న చిన్నారుల్లో నాలుగైదు ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి.
1. భావ వ్యక్తీకరణ లేకపోవడం. అది భాష పరంగా గానీ, హావభావాలు వ్యక్తపరచడంలో గానీ సమస్య ఉంటుంది. అంటే వాళ్లు సరిగ్గా మాట్లాడలేరు.
2. ఇతరుల భావాలను గ్రహించలేరు. అంతేకాదు వారి భావోద్వేగాలను వ్యక్తపర్చలేరు.
3. సామాజిక బాంధవ్యాలు తెలియదు. అంటే ఇతరులతో కలిసి ఆడుకోవడం, కలివిడిగా ఉండటానికి
ఇష్టపడరు. ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు.
4. చేసిన పనినే మళ్లీ మళ్లీ చేస్తుంటారు.
5. ఈ చిన్నారుల్లో మానసిక పరిణతి తక్కువగా ఉంటుంది.
ఈ లక్షణాలన్నీ ఆటిజం పిల్లల్లో ప్రాథమికంగా కనిపిస్తుంటాయి. ఈ సమస్యలతో సతమతమవుతున్న వారిని ఆటిజం బాధితులుగా పరిగణిస్తారు.
గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. పిల్లల పెంపకంలో పెద్దల పాత్ర అధికంగా ఉండేది. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, మేనమామ, అత్తయ్య, చిన్నాన్న, పిన్ని… ఇలా ఎవరో ఒకరు పిల్లలతో సమయం గడిపేవారు. అప్పట్లో సెల్ఫోన్లు, ట్యాబ్ల ఊసే లేదు. మనుషుల మధ్య కమ్యూనికేషన్ ఎక్కువగా ఉండేది.
నిరంతరం వారి మధ్య ఉండటం వల్ల పిల్లల్లో భాషా వికాసం బాగా ఉండేది. హావభావాల వ్యక్తీకరణతోపాటు మానసిక పురోగతిలోనూ వయసుకు తగ్గ పరిణతి కనిపించేది. కానీ, ఇప్పుడు ఉమ్మడి కుటుంబాల ఉనికి గణనీయంగా తగ్గిపోయింది.
నూటికి 90 శాతం న్యూక్లియర్ ఫ్యామిలీలే ఉంటున్నాయి. దీనికితోడు తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం వల్ల పిల్లలు అధిక సమయం ఒంటరిగా గడపాల్సి వస్తున్నది. మనుషులతో కన్నా డిజిటల్ కమ్యూనికేషన్ ఎక్కువైంది. ఏడాది వయసున్న పిల్లలు కూడా సెల్ఫోన్, ట్యాబ్తో ఆడుకోవడం కనిపిస్తున్నది. ఇలాంటి పరిస్థితులు సైతం ఆటిజానికి దారితీసే అవకాశాలు లేకపోలేదు.
పత్యేక లక్షణాలు కనిపించిన వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించాలి. ఆటిజాన్ని నిర్ధారించేందుకు ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి వైద్య పరిజ్ఞానం గానీ, రోగ నిర్ధారణ పద్ధతులు గానీ అందుబాటులో లేవు. కేవలం అనుభవజ్ఞులైన సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు మాత్రమే సమస్యను కొన్ని రకాల పరీక్షల ద్వారా నిర్ధారించగలరు.
ఆటిజానికి సంబంధించిన లక్షణాలను ఎంత త్వరగా గుర్తించి, సరైన థెరపీలను అందించగలిగితే అంత మంచిది. 6 నెలల్లోనే 50 శాతం సమస్యను నివారించవచ్చు. కనీసం 3 సంవత్సరాల్లోపు సమస్యను గుర్తించి చికిత్స అందిస్తేనే ఫలితం ఉంటుంది. ఈ 3 సంవత్సరాల గోల్డెన్ టైమ్ దాటిపోతే ఎలాంటి చికిత్సలు అందించినా ఫలితం ఆశించిన మేరకు ఉండకపోవచ్చు. ఆటిజం బాధిత చిన్నారులకు ప్రధానంగా మూడు రకాల థెరపీలతో చికిత్స అందిస్తారు.
అందులో 1.ఆక్యుపేషనల్ థెరపీ 2. బిహేవియర్ థెరపీ 3. స్పీచ్ థెరపీ
1.ఆక్యుపేషనల్ థెరపీ: పిల్లల్లో ప్రారంభ దశలో జ్ఞానేంద్రియాలు అసంబద్ధంగా ఉన్నట్లు గుర్తిస్తే, ఆక్యుపేషనల్ థెరపీ అందించవచ్చు. దీని వల్ల ఐదు జ్ఞానేంద్రియాలు నియంత్రణలోకి వచ్చి, సమస్య దాదాపుగా పరిష్కారమవుతుంది.
2.బిహేవియర్ థెరపీ: బిహేవియర్ థెరపీతో పిల్లల అసాధారణ ప్రవర్తనకు సంబంధించిన సమస్యలు పరిష్కరించవచ్చు.
3. స్పీచ్ థెరపీ: ఆటిజం పిల్లల విషయంలో స్పీచ్ థెరపీ చాలా ముఖ్యమైంది. మొదటి రెండు థెరపీలు… అంటే ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియర్ థెరపీల తర్వాతే స్పీచ్ థెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది.
– మహేశ్వర్రావు బండారి
– డాక్టర్ సోమశేఖర నారగంటి చైల్డ్ సైకాలజిస్ట్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, హైదరాబాద్