Nutmeg | జాజికాయ గురించి అందరికీ తెలిసిందే. ఇది మన వంట ఇంటి మసాలా దినుసుల్లో ఒకటిగా ఉంది. దీన్ని అనేక వంటల తయారీలో ఉపయోగిస్తారు. దీంతో వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే ఆయుర్వేద ప్రకారం జాజికాయ అనేక లాభాలను అందిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్, సెడేటివ్ గుణాలు ఉంటాయి. అందువల్ల అనేక వ్యాధులకు ఇది ఔషధంగా పనిచేస్తుంది. అయితే జాజికాయను చాలా స్వల్ప మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే శరీరం విష తుల్యంగా మారుతుంది. భ్రాంతి, వికారం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే జాజికాయను స్వల్ప మోతాదులో తీసుకుంటే ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
నిద్రలేమి సమస్య ఉన్నవారికి జాజికాయ అద్బుతమైన ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో మైరిస్టిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది సెడేటివ్‌గా పనిచేస్తుంది. నాడీ మండల వ్యవస్థను ప్రశాంతంగా ఉండేలా మారుస్తుంది. కొద్దిగా జాజికాయ పొడిని తీసుకోవాలి. పావు టీస్పూన్ మోతాదులో లేదా అందులో సగం మోతాదులో ఈ పొడిని తీసుకుని దాన్ని ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కలిపి తాగాలి. రాత్రి నిద్రించేందుకు 30 నిమిషాల ముందు ఇలా తాగాల్సి ఉంటుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు తగ్గుతాయి. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. జీర్ణ సమస్యలకు కూడా జాజికాయ అద్భుతంగానే పనిచేస్తుంది. పావు టీస్పూన్ మోతాదులో జాజికాయ పొడిని తీసుకుని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో వేసి కలపాలి. ఇందులోనే ఒక టీస్పూన్ తేనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు ఒక్కసారి తాగాలి. ఇలా చేస్తుంటే జీర్ణ వ్యవస్థలో ఉండే గ్యాస్ మొత్తం బయటకు పోతుంది. జీర్ణాశయ ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. దీంతో తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అజీర్తి తగ్గుతుంది.
నొప్పులను తగ్గించడంలోనూ జాజికాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, అనాల్జెసిక్ గుణాలు ఉంటాయి. కొద్దిగా జాజికాయ పొడిని తీసుకుని కొబ్బరినూనె లేదా నువ్వుల నూనెలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కాస్త వేడి చేయాలి. అనంతరం దీన్ని నొప్పి ఉన్న ప్రదేశంలో రాసి కట్టు కట్టాలి. రాత్రి పూట ఇలా చేయాలి. దీంతో కీళ్ల నొప్పులు, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. తలనొప్పి ఉన్నవారు జాజికాయ పొడిని గోరు వెచ్చని నీటిలో కలిపి మెత్తని పేస్ట్‌లా చేసి దాన్ని నుదుటిపై రాయాలి. కాసేపు అయ్యాక కడిగేయాలి. ఇలా చేస్తుంటే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
కొద్దిగా జాజికాయ పొడిని తీసుకుని అందులో తేనె, అల్లం రసం వేసి కలిపి రోజుకు 2 సార్లు తీసుకోవాలి. ఇలా చేస్తుంటే ముక్కు దిబ్బడ, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే గోరు వెచ్చని పాలలో కాస్త జాజికాయ పొడిని కలిపి కూడా తాగవచ్చు. ఇలా చేస్తున్నా కూడా దగ్గు, జలుబు, ఇతర శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. జాజికాయ పొడిలో కొద్దిగా రోజ్ వాటర్ వేసి కలిపి మెత్తని పేస్ట్ లా మార్చాలి. దీన్ని మొటిమలపై రాసి 15 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. రోజూ ఇలా చేస్తుంటే మొటిమలు పోతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. ముఖంపై ఉండే నల్లని మచ్చలతోపాటు కళ్ల కింద ఉండే డార్క్ సర్కిల్స్‌కు కూడా ఈ చిట్కా పనిచేస్తుంది. అలాగే జాజికాయ పొడి, తేనె, నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని రాస్తుంటే ముఖంపై ఉండే మృత చర్మ కణాలు తొలగిపోతాయి. ముఖానికి సహజసిద్ధమైన నిగారింపు వస్తుంది. ఇలా జాజికాయను ఉపయోగించి అందాన్ని కూడా మెరుగు పరుచుకోవచ్చు. ఈ విధంగా జాజికాయ మనకు అనేక విధాలుగా పనిచేస్తుంది.