Head Lice | తలలో పేలు ఏర్పడడం అనేది సహజంగానే చాలా మందికి జరుగుతుంది. స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. జుట్టును ఎక్కువగా పెంచుకునే పురుషులు కూడా ఈ సమస్యతో అప్పుడప్పుడు బాధపడుతుంటారు. అయితే అసలు పేలు ఎందుకు వస్తాయన్ని విషయాన్ని అటుంచితే ఈ సమస్య వస్తే మాత్రం తీవ్రంగా ఇబ్బంది ఉంటుంది. తలలో దురద కూడా వస్తుంది. అయితే పలు సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తే తలలో పేల సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. ఈ చిట్కాలకు వాడే పదార్థాలు మనకు సహజసిద్ధంగా లభించేవే. కనుక జుట్టుపై ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూపించవు. తలలో పేలను పోగొట్టే ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రి పూట తలకు కాస్త మయోనైస్‌ను రాసి తలకు ఒక షవర్ క్యాప్ ను పెట్టి సీల్ చేయాలి. లేదా పగటి పూట అయితే కనీసం 8 గంటల పాటు ఉంచాలి. తరువాత తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తరువాత జుట్టు పూర్తిగా ఆరకముందే తడి జుట్టు మీదనే దువ్వాలి. ఇలా చేస్తుంటే పేలు పోతాయి. ఆలివ్ ఆయిల్‌తోనూ పేలను సమర్థవంతంగా తరిమికొట్టవచ్చు. ఆలివ్ ఆయిల్‌ను కొద్దిగా తీసుకుని జుట్టు కుదుళ్లకు తగిలేలా బాగా మర్దనా చేయాలి. సుమారుగా 8 గంటల పాటు అలాగే ఉండాలి. లేదా రాత్రి పూట నూనెను రాసి షవర్ క్యాప్ పెట్టేయాలి. మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. తడి జుట్టు మీదనే దువ్వాలి. ఇలా చేస్తున్నా కూడా పేలు పూర్తిగా పోతాయి.
పెట్రోలియం జెల్లీతోనూ పేలను తొలగించుకోవచ్చు. ఇందుకు గాను పెట్రోలియం జెల్లీని కొద్దిగా తీసుకుని జుట్టు కుదుళ్లకు పట్టేలా బాగా మర్దనా చేయాలి. 8 గంటల తరువాత తలస్నానం చేయాలి. లేదా రాత్రి పూట దీన్ని రాసి తలకు షవర్ క్యాప్ పెట్టాలి. మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. తడి జుట్టు మీద దువ్వాలి. పేలను తొలగించడంలో పెట్రోలియం జెల్లీ కూడా పనిచేస్తుంది. కొబ్బరినూనెను కూడా ఇలాగే ఉపయోగించవచ్చు. కానీ కొబ్బరినూనెను కాస్త వేడి చేసి రాస్తే మంచిది. కొబ్బరినూనెలో ఉండే యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ గుణాలు తలలో ఉండే ఇన్ఫెక్షన్లు, పేలను తగ్గిస్తాయి. కొబ్బరినూనెను రాసిన తరువాత 8 గంటలు ఆగి తలస్నానం చేయాలి. లేదా రాత్రి పూట అయినా రాయాలి. కొబ్బరినూనెను రాయడం వల్ల చుండ్రు నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది.
మార్కెట్లో మనకు పలు రకాల ఎసెన్షియల్ ఆయిల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని కూడా జుట్టుకు రాయవచ్చు. కానీ వీటిని స్వల్ప మొత్తంలో తీసుకుని వేరే ఏదైనా ఆయిల్లో కలిపి రాయాలి. టీ ట్రీ ఆయిల్, వేప నూనె, అనిస్ ఆయిల్, పెప్పర్ మింట్, లావెండర్, క్లోవ్ అయిల్స్.. ఇలా రకరకాల ఎసెన్షియల్ ఆయిల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని కొబ్బరినూనె లేదా బాదంనూనెలో కలిపి రాయాలి. తరువాత కాసేపు ఆగి తలస్నానం చేయాలి. పేలను తొలగించడంలో ఈ నూనెను కూడా బాగానే పనిచేస్తాయి. అయితే పేలు పోయిన తరువాత దువ్వెనను బాగా శుభ్రం చేయాలి. పేలు ఉన్నవారి తలకు జుట్టును ఆనించకూడదు. బయటకు వెళ్లినప్పుడు శిరోజాలను సంరక్షించేలా క్యాప్ వంటివి ధరించాలి. ఈ చిట్కాలను, జాగ్రత్తలను పాటిస్తే పేలు మళ్లీ రావు.