Acidity Home Remedies | సాధారణంగా చాలా మంది అప్పుడప్పుడు అసిడిటీ సమస్యతో బాధపడుతుంటారు. ఇది వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. కారం, మసాలాలు ఉన్న ఆహారాలను అధికంగా తినడం, వేళ తప్పించి భోజనం చేయడం, టీ, కాఫీలను అతిగా తాగడం, భోజనం ఎక్కువగా తీసుకోవడం వంటి అనేక కారణాల వల్ల అసిడిటీ వస్తుంది. దీంతో ఏం చేయాలో తోచదు. మెడికల్ షాపుకు వెళ్లి మందులను కొని తెచ్చి వేసుకుంటారు. అయితే దీర్ఘకాలంలో ఇలా చేయడం మంచిది కాదు. దీంతో పలు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇక కొందరికి రోజంతా అసిడిటీ ఉండదు. కానీ ఉదయం పూట మాత్రం అసిడిటీ ఉంటుంది. ఇలాంటి వారు కింద చెప్పిన పలు చిట్కాలను పాటించడం వల్ల అసిడిటీ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. దీంతో ఎంతగానో రిలీఫ్ లభిస్తుంది.
అసిడిటీ సమస్యను తగ్గించడంలో నిమ్మరసం ఎంతగానో పనిచేస్తుంది. అయితే నిమ్మరసం కూడా యాసిడ్‌ను కలిగి ఉంటుంది కదా.. అని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి నిమ్మరసాన్ని మనం తాగితే అది మన శరీరంలో చేరాక ఆమ్లత్వాన్ని కోల్పోతుంది. దీంతో మనకు మేలు జరుగుతుంది. కనుక అసిడిటీ సమస్య ఉన్నవారు నిరభ్యంతరంగా నిమ్మరసం తాగవచ్చు. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కాస్త నిమ్మరసం కలిపి తాగితే అసిడిటీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే అజీర్ణం కూడా తగ్గుతుంది. ఇక ఉదయాన్నే పరగడుపునే 30 ఎంఎల్ మోతాదులో కలబంద రసాన్ని సేవిస్తున్నా కూడా జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు. జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరచడంలో కలబంద ఎంతగానో పనిచేస్తుంది. కలబంద రసాన్ని సేవిస్తుంటే అసిడిటీ నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది. దీంతోపాటు గ్యాస్, కడుపు ఉబ్బరం కూడా తగ్గుతాయి.
ఉదయం అసిడిటీ ఎక్కువగా ఉంటే దాన్ని తగ్గించేందుకు సోంపు గింజలు కూడా ఎంతగానో పనిచేస్తాయి. సోంపు గింజలను తీసుకుని నోట్లో వేసుకుని నమిలి తింటుంటే అసిడిటీ తగ్గుతుంది. లేదా సోంపు గింజలను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగుతుండవచ్చు. దీంతో కూడా జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇక జీర్ణ సమస్యలను తగ్గించడంలో అల్లం కూడా అద్భుతంగానే పనిచేస్తుంది. రోజుకు రెండు సార్లు భోజనానికి ముందు అల్లం రసాన్ని ఒక టీస్పూన్ మోతాదులో సేవించాలి. అల్లం రసం కడుపులో మంటను తగ్గిస్తుంది. పొట్టను ప్రశాంతంగా ఉండేలా చూస్తుంది. పొట్టలో ఉండే అసౌకర్యాన్ని కూడా తగ్గిస్తుంది.
వేడి పాలను తాగితే పొట్టలో ఆమ్లత్వం పెరుగుతుంది. కానీ చల్లని పాలను తాగితే పొట్టలో ఆమ్లత్వం తగ్గుతుంది. దీంతో అసిడిటీ నుంచి బయట పడవచ్చు. కనుక కడుపులో మంటగా ఉన్నప్పుడు వేడి పాలను కాకుండా చల్లని పాలను తాగితే మేలు జరుగుతుంది. కడుపులో రోజంతా మంటగా ఉండేవారు కొబ్బరినీళ్లను తాగుతుండాలి. దీంతో చక్కని ఉపశమనం లభిస్తుంది. అలాగే తులసి ఆకులను నేరుగా అలాగే తింటున్నా కూడా కడుపులో మంట నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇలా పలు చిట్కాలను పాటించడం వల్ల కడుపులో మంటను తగ్గించుకోవచ్చు. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.