Vinegar | వెనిగర్.. వంటల్లో ఉపయోగించే దీని గురించి మీరు ఎక్కువగా వినే ఉంటారు. వెనిగర్‌ను ఒక ఆమ్ల ద్రావకంగా చెప్పవచ్చు. ఇథనాల్‌ని ఫర్మెంటేషన్ చేసి దీన్ని తయారు చేస్తారు. ఇందులో ఎసిటిక్ యాసిడ్ లేదా ఇథనోయిక్ యాసిడ్ ఉంటుంది. వెనిగర్ పీహెచ్ విలువ 2.4 నుంచి 3.4 మధ్య ఉంటుంది. కనుక దీన్ని దృఢమైన ఆమ్లంగా చెప్పవచ్చు. టేబుల్ వెనిగర్‌లో 4 నుంచి 8 శాతం, పికిల్ వెనిగర్‌లో 18 శాతం వరకు ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. విదేశీయులు ఊరగాయలను వెనిగర్‌తో తయారు చేస్తారు. వెనిగర్‌లో అసిటిక్ యాసిడ్‌తోపాటు టార్టారిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ ఉంటాయి. 100 గ్రాముల వెనిగర్ 18 క్యాలరీల శక్తిని అందిస్తుంది. వెనిగర్లోనూ చాలా రకాలు ఉంటాయి. అయితే సాధారణ వెనిగర్‌ను ఎక్కువ శాతం మంది ఉపయోగిస్తారు. ఇందులో ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
వెనిగర్‌ను రాయడం వల్ల ఎండ కారణంగా కందిపోయిన చర్మం తిరిగి సాధారణ రూపాన్ని పొందుతుంది. వేడి, మంట, దురద తగ్గిపోతాయి. చల్లదనం కోసం వెనిగర్ ను ఉపయోగిస్తారు. గాయాలు లేదా పుండ్లకు కూడా దీన్ని వాడుతారు. దీంతో అవి త్వరగా మానుతాయి. వెనిగర్‌ను తరచూ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌తోపాటు ట్రై గ్లిజరైడ్స్ తగ్గుతాయి. బీపీని తగ్గించే గుణం వెనిగర్‌కు ఉంది. రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూస్తుంది. రోజూ ఆహారంతో కొద్దిగా వెనిగర్‌ను సేవిస్తుంటే డయాబెటిస్ రోగుల్లో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. వెనిగర్‌ను తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీంతో అధికంగా ఆహారం తీసుకోకుండా జాగ్రత్త పడవచ్చు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
పొట్టలో నులి పురుగుల సమస్య ఉన్నవారు వెనిగర్ ను తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. చర్మ ఇన్ఫెక్షన్లను తగ్గించేందుకు కూడా వెనిగర్ పనిచేస్తుంది. ఇన్ఫెక్షన్లపై వెనిగర్‌ను రాస్తుంటే త్వరగా నయమవుతాయి. వెనిగర్‌ను తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవచ్చు. ముఖ్యంగా స్త్రీలలో గర్భాశయ క్యాన్సర్ రాకుండా నివారించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. వెనిగర్ ఆమ్లత్వాన్ని కలిగి ఉండే మాట వాస్తవమే అయినప్పటికీ కడుపు ఉబ్బరాన్ని ఇది తగ్గిస్తుంది. కాస్త మోతాదులో సేవిస్తే గ్యాస్ నుంచి ఉపశమనం పొందవచ్చు. వెనిగర్‌లో కొవ్వును కరిగించే గుణాలు ఉంటాయి. తరచూ దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలోని కొవ్వు కరిగిపోతుందని జపాన్‌కు చెందిన సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది.
వెనిగర్‌లో ఉండే అసిటిక్ యాసిడ్ రక్తపోటు, షుగర్‌ను తగ్గిస్తుంది. పురాతన కాలంలో కొందరు వెనిగర్‌ను ఔషధంగా ఉపయోగించేవారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇలా వెనిగర్‌ను వాడడం వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయి. అయితే వెనిగర్ లేనివారు అందుకు బదులుగా నిమ్మరసం కూడా వాడవచ్చు. ఇందులోనూ వెనిగర్‌ను పోలిన గుణాలు ఉంటాయి. మీరు తినే ఆహారాలపై కాస్త వెనిగర్ లేదా నిమ్మరసం చల్లి తింటే ఆహార పదార్థాల రుచి పెరగడమే కాదు, ఔషధ విలువలు కూడా మెరుగు పడతాయి. దీంతో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అయితే అసిడిటీ, అల్సర్ వంటి సమస్యలు ఉన్నవారు వెనిగర్‌ను ఉపయోగించకూడదు.