Womens Health | వేసవి కాలం ప్రారంభమైన తర్వాత జీర్ణ సమస్యలు, నిద్రలేమి, హాట్ ఫ్లష్లతో ఇబ్బంది పడుతున్నారా? ప్రీ మెనోపాజ్, మెనోపాజ్ లేదా పోస్ట్‌మెనోపాజ్ దశలో ఉన్న మహిళల కోసం కొన్ని సులభమైన చిట్కాలను వైద్యులు సూచిస్తున్నారు. ఇవి వాతావరణ మార్పులకు అనుకూలంగా ఉండటంతో పాటు శరీరానికి, జీర్ణవ్యవస్థకు, ఖర్చుకు కూడా సులభంగా ఉంటాయని వారు చెబుతున్నారు.
మొదటి చిట్కాగా, ఉదయం 12 గంటలలోపు లేదా అంతకంటే ముందే ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లు తాగాలని సూచిస్తున్నారు. అందులో కొద్దిగా సబ్జా గింజలు కలిపితే మరింత మంచిదని వారు చెబుతున్నారు. ఇవి సహజ కూలెంట్‌లా పనిచేసి శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా, హైడ్రేషన్‌ను మెరుగుపరుస్తాయి, జీర్ణక్రియకు సహాయపడతాయి. రెండో చిట్కాగా మధ్యాహ్న భోజనంతో పాటు పెరుగు తీసుకోవాలని సూచిస్తున్నారు. తాజాగా వేయించిన జీలకర్ర పొడి కలిపిన పెరుగు లేదా చాస్ (మజ్జిగ) తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తూ జీర్ణవ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతుంది. అలాగే మధ్యాహ్నం వచ్చే అలసటను తగ్గించి ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. మూడో చిట్కాగా సాయంత్రం భోజనంతో లేదా భోజనం తర్వాత అరటి పండు తీసుకోవాలని సూచిస్తున్నారు. అరటిపండులో ఉండే ఎలక్ట్రోలైట్స్ శరీరానికి ఉపయోగపడతాయి. ఇది జీర్ణవ్యవస్థను సాంత్వనపరచి, మలాన్ని సులభంగా బయటకు రావడానికి సహాయపడుతుంది. దీంతో కడుపు తేలికగా అనిపిస్తుంది.
ఇక ప్రీ మెనోపాజ్, మెనోపాజ్, పోస్ట్‌మెనోపాజ్ దశల్లో ఉన్న మహిళల్లో వాతావరణ మార్పుల కారణంగా జీర్ణక్రియ కొంత మందగిస్తుంది. ఈ సమయంలో గ్యాస్ సమస్యలు ఎక్కువగా రావడం సహజమని వైద్యులు చెబుతున్నారు. అయితే మహిళలు గ్యాస్ విడుదల చేయడానికి సంకోచిస్తారని అలా అస్సలు చేయకూడదని, గ్యాస్‌ను సహజంగా విడుదల చేయాలని, గ్యాస్ విడుదల చేయడం తప్పు కాదని దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు పేర్కొంటున్నారు. అలాగే సులభమైన చిట్కాలను పాటిస్తే జీర్ణక్రియ సాఫీగా సాగి హాట్ ఫ్లష్‌లు తగ్గి, మంచి నిద్ర, ఆరోగ్యం లభిస్తాయని, వేసవి వేడి శరీరంపై ప్రభావం చూపనివ్వకుండా ఈ మూడు చిట్కాలు శరీరాన్ని చల్లగా ఉంచుతాయని వైద్యులు తెలియజేస్తున్నారు.