Strength Training | చాలా మంది మహిళలు వ్యాయామం విషయంలో ప్రధానంగా కార్డియోపై ఎక్కువగా దృష్టి పెడతారు. త్వరగా బరువు తగ్గాలంటే కార్డియో మంచిదని, వెయిట్ ట్రైనింగ్ చేస్తే శరీరం స్థూలంగా కనిపిస్తుందని ఒక సాధారణ అపోహ చాలా మందిలో ఉంది. కానీ వాస్తవానికి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ (Strength Training) మహిళలకు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. ఇది కేవలం కొవ్వు తగ్గించడమే కాకుండా శరీరాన్ని లోపల నుంచి బలపరుస్తుంది. ఆరోగ్యం, ఫిట్నెస్ విషయానికి వస్తే కార్డియో కంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కు ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. వయస్సు 20 నుంచి 60 ఏళ్లు, ఎంతైనా సరే.. మహిళలకు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ తప్పనిసరి. జిమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇది శరీరాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వల్ల మహిళలకు కలిగే ప్రయోజనాల గురించి కూడా వారు తెలియజేస్తున్నారు. మహిళలకు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎందుకు ముఖ్యమైనది, దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ద్వారా కండరాలుపెరుగుతాయి. దీని వల్ల బేసల్ మెటాబాలిక్ రేట్ (BMR) పెరుగుతుంది. అంటే విశ్రాంతిలో ఉన్నప్పటికీ ఎక్కువ కాలరీలు ఖర్చవుతాయి. కార్డియో కేవలం వ్యాయామ సమయంలో మాత్రమే కాలరీలు బర్న్ చేస్తుంది. అలాగే మహిళల్లో వయస్సు పెరిగే కొద్దీ, ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత ఆస్టియోపొరోసిస్ ప్రమాదం పెరుగుతుంది. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎముకల సాంద్రతను పెంచి ఎముకల ప్రమాదాలను తగ్గిస్తుంది. రోజువారీ పనుల నుండి సరుకులు ఎత్తడం, పిల్లలతో ఆడడం వంటి పనులన్నింటికీ శక్తి అవసరం పడుతుంది. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వల్ల ఈ పనులన్నింటినీ సులభంగా చేయగలుగుతారు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ హార్మోన్ల స్థాయిలపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది ఎండార్ఫిన్స్ పెంచి, కార్టిసోల్ ను నియంత్రిస్తుంది. దీని వల్ల మానసిక స్థితి మెరుగుపడి, ఒత్తిడి తగ్గుతుంది. అలాగే బలమైన కండరాలు కీళ్లకు మద్దతును ఇస్తాయి. దీని వల్ల గాయాల ప్రమాదం తగ్గుతుంది ,సమతుల్యత మెరుగుపడుతుంది.
అలాగే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. దీని వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం సుమారు 30% వరకు తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా 35 సంవత్సరాల తర్వాత మహిళల్లో శారీరక సామర్థ్యం తగ్గడం ప్రారంభమవుతుంది. కానీ రెగ్యులర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వల్ల శరీర బలం, స్వతంత్రత ఎక్కువ కాలం నిలుస్తాయి. మహిళలకు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇలా అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా బరువులు ఎత్తడం వల్ల మహిళలు లావుగా కనిపించరని కూడా వారు చెబుతున్నారు. ఇది ఒక అపోహ మాత్రమే. మహిళల్లో టెస్టోస్టెరోన్ హార్మోన్ స్థాయి తక్కువగా ఉంటుంది. అందువల్ల పురుషుల్లా పెద్దగా మజిల్స్ రావని వైద్యులు స్పష్టం చేశారు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వల్ల శరీరం టోన్గా కనిపిస్తుంది. భంగిమ మెరుగుపడుతుంది. మహిళల్లో సమతుల్యతతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
30 ఏళ్ల తర్వాత సహజంగానే మహిళలు కండరాలను కోల్పోవడం ప్రారంభమవుతుంది. 40 తర్వాత ఎముకల బలం తగ్గుతుంది. మెనోపాజ్ తర్వాత కొవ్వు పెరుగుతుంది, మెటబాలిజం తగ్గుతుంది. ఇలా వయసు పైబడడం వచ్చే ఈ సమస్యలన్నింటికీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఒక మంచి పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. కార్డియోకు కూడా ప్రయోజనాలు ఉన్నప్పటికీ, స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌ను తప్పనిసరిగా ఫిట్నెస్ దినచర్యలో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తక్కువ వెయిట్స్తో ప్రారంభించి, క్రమంగా కొనసాగించాలని, సన్నగా కాకుండా బలంగా ఉండటం లక్ష్యంగా పెట్టుకోవాలని బలమైన శరీరం వృద్ధాప్యాన్ని మార్చుతుందని నిపుణులు సూచిస్తున్నారు.