Menstruation | పూర్వం స్త్రీలకు హార్మోన్ల సమస్యలు అంతగా ఉండేవి కావు. ఒక్కొక్కరు గంపెడు మంది పిల్లలను సహజసిద్ధంగా ప్రసవించేవారు. కానీ ఇప్పటి తరం వారు తీవ్రమైన హార్మోన్ల సమస్యలతో బాధపడుతున్నారు. నెలసరి సరిగ్గా రావడం లేదు. దీంతో సంతాన లోపం సమస్య మహిళల్లో పెరుగుతోంది. అలాగే చాలా లేటు వయస్సులో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. దీనికి తోడు పని ఒత్తిడి, ఆహారం వంటి అనేక కారణాల వల్ల మహిళలలో హార్మోన్ల సమస్య ఏర్పడి నెలసరి సరిగ్గా రావడం లేదు. దీనికి తోడు పీసీవోడీ వంటి సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇవన్నీ సంతానం కలిగేందుకు అవరోధాలుగా నిలుస్తున్నాయి. దీని వల్ల చాలా మంది మహిళలు తమకు సంతానం కలగడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే మహిళల్లో వచ్చే ఈ హార్మోన్ల సమస్యలకు అనేక కారణాలు ఉంటాయి.
ప్రస్తుతం చాలా మంది స్త్రీలకు థైరాయిడ్ సమస్య వస్తోంది. యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిలు థైరాయిడ్ బారిన పడుతున్నారు. ఇది అలాగే కొనసాగుతుండడం వల్ల వారి సంతాన జీవితంపై ప్రభావం చూపిస్తోంది. దీంతో నెలసరి సరిగ్గా రావడం లేదు. అలాగే చాలా మంది ఆహారం, ఇతర కారణాల వల్ల అధిక బరువుతో బాధఫడుతున్నారు. ఇది కూడా హార్మోన్ల సమస్యకు కారణమవుతోంది. పీసీవోఎస్ ఉన్న మహిళల సంఖ్య కూడా పెరుగుతోంది. చాలా మంది మహిళలు పీసీవోఎస్ కారణంగా సంతానాన్ని పొందలేకపోతున్నారు. అయితే ఈ సమస్యలు ఉన్న మహిళలు కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాలి. వారు తగు పరీక్షలు నిర్వహించి వ్యాధులను నిర్దారించి అందుకు అనుగుణంగా మందులను రాస్తారు.
వైద్యులు ఇచ్చిన మందులను క్రమం తప్పకుండా వాడడంతోపాటు ఆహారం విషయంలోనూ మహిళలు జాగ్రత్తలు పాటించాలి. కొవ్వు అధికంగా ఉండే ఆహారాలను, తియ్యని లేదా నూనె పదార్థాలను తినకూడదు. ఇవి బరువు పెరిగేలా చేస్తాయి. దీంతో మందులను వాడి కూడా ప్రయోజనం ఉండదు. హార్మోన్ల సమస్యలు తగ్గవు. కనుక ఆహారం విషయంలో కచ్చితంగా నియమాలను పాటించాలి. అలాగే నెలసరి సరిగ్గా వచ్చేందుకు గాను అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాలి. ముఖ్యంగా తాజా ఆకుకూరలను వారంలో కనీసం 3 సార్లు తినాలి. రోజూ ఏవైనా రెండు మూడు రకాల పండ్లను తింటుండాలి. తృణ ధాన్యాలు, చిరు ధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. చియా సీడ్స్, అవిసె గింజలు, గుమ్మడికాయ విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాలతోపాటు బాదం, జీడిపప్పు, వాల్ నట్స్, పిస్తా వంటి గింజలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవన్నీ మహిళల్లో నెలసరి సక్రమంగా వచ్చేలా చేస్తాయి. హార్మోన్ల సమస్యలను తగ్గిస్తాయి. దీంతో సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి.
పనిచేసే మహిళలు అయితే కచ్చితంగా శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. కచ్చితంగా రోజూ 30 నిమిషాల పాటు కనీసం వాకింగ్ అయినా చేయాలి. ఇంటి పట్టున ఉండే మహిళలు ఇంట్లో పని మనుషులను పెట్టుకోకుండా తమ పనులను తామే చేసుకుంటే మేలు. దీంతో చాలా వరకు శారీరక వ్యాయామం జరుగుతుంది. ఇది శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతుంది. బరువు తగ్గేలా చేస్తుంది. అలాగే థైరాయిడ్ ఉన్న మహిళలు కచ్చితంగా రోజూ డాక్టర్ సూచించినట్లుగా మందులను వాడాలి. థైరాయిడ్ మెడిసిన్‌ను వాడడం ఎట్టి పరిస్థితిలోనూ ఆపకూడదు. డాక్టర్ చెబితే తప్ప ఆ మందులను వాడడం మానేయకూడదు. ఇలా అన్ని రకాల సూచనలు పాటిస్తూ డైట్‌ను ఫాలో అయితే కచ్చితంగా మహిళల్లో ఉండే హార్మోన్ల సమస్యలు తగ్గుతాయి. నెలసరి సరిగ్గా వస్తుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి.