నిత్య వ్యాయామం వల్ల ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు తదితర రుగ్మతలకు దూరంగా ఉండవచ్చని ప్రత్యేకించి చెప్పాల్సిన పన్లేదు. అంతేకాదు, మిగిలినవారితో పోలిస్తే.. రోజూ కసరత్తు చేసేవారికి నొప్పిని తట్టుకునే శక్తి కూడా అధికంగా ఉంటుందని అధ్యయనాలు వివరిస్తున్నాయి. నార్వేకు చెందిన పరిశోధకులు దాదాపు పదివేలమందిని అతిదగ్గర నుంచి పరిశీలించిన తర్వాతే ఈ నిర్ధారణకు వచ్చారు.
పరిపూర్ణ ఆరోగ్యవంతులను తీసుకెళ్లి.. అత్యాధునికమైన ల్యాబొరేటరీలో కూర్చోబెట్టింది నిపుణుల బృందం. వారికి కృత్రిమంగా నొప్పిని కలిగించింది. వ్యాయామానికి దూరంగా ఉన్నవారు ఆ బాధను ఎక్కువసేపు తట్టుకోలేకపోయారు. నిత్య జీవితంలో కసరత్తు ఓ భాగమైనవారు మాత్రం ఓ స్థాయి వరకూ చిరునవ్వుతో భరించారు. అదీ తేడా!