హైదరాబాద్: గత పదిరోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో చలి విపరీతంగా పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. దీంతో చలిని తట్టుకోవడానికి జనాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కొంత మంది చలిని తట్టుకోవడానికి ఆల్కహాల్ తీసుకుంటుంటారు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందని నమ్ముతారు. కానీ వైద్యులు, పరిశోధకులు మందు తాగడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రతలు పెరుగుతాయని నమ్మడం కరెక్ట్ కాదని చెబుతున్నారు.
దాని వల్ల అనర్థాలున్నాయని హెచ్చరిస్తున్నారు. ఆల్కహాల్ తీసుకున్న తర్వాత రక్త ప్రసరణ మందగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆల్కహాల్ శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా తగ్గిస్తుందని ఫలితంగా అనారోగ్యం బారిన పడాల్సి వస్తుందని చెబుతున్నారు. అంతేకాదు కొన్నాళ్ల తర్వాత గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని అంటున్నారు.