Winter Foods | చలికాలంలో మనం సహజంగానే శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు అనేక రకాల మార్గాలను అనుసరిస్తుంటాం. ముఖ్యంగా ఈ సీజన్లో స్వెటర్లు, బ్లాంకెట్లకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచుకోకపోతే చలికి మనకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా శ్వాసకోశ వ్యవస్థపై చలి ప్రభావం చూపిస్తుంది. దీంతో దగ్గు, జలుబు, ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే చలికాలంలో వెచ్చని దుస్తులను ధరించడమే కాదు, ఆహారం విషయంలోనూ పలు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రకాల ఫుడ్స్‌ను తినడం వల్ల వెచ్చగా ఉండడమే కాదు, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఇక ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజూ ఒక టీస్పూన్ నెయ్యిని ఈ సీజన్లో కచ్చితంగా తీసుకోండి. నెయ్యిని అన్నం లేదా చపాతీలతో కలిపి తినవచ్చు. నెయ్యి సులభంగానే జీర్ణమవుతుంది. ఇది మన శరీరంలో వేడిని పుట్టిస్తుంది. దీంతో శరీరం వెచ్చగా ఉంటుంది. చలి నుంచి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా స్వచ్ఛమైన నెయ్యి మనకు సులభంగా జీర్ణం అవుతుంది. అలాగే మనకు శక్తినిస్తుంది. పోషకాలను కూడా అందిస్తుంది. కనుక చలికాలంలో నెయ్యిని రోజూ తప్పకుండా తినడం అలవాటు చేసుకోండి.
ఈ సీజన్లో చిలగడదుంపలు కూడా ఎక్కువగానే వస్తుంటాయి. ఇతర దుంపలకు ఈ దుంప పూర్తిగా భిన్నమైంది. ఈ దుంపలను తింటే షుగర్ లెవల్స్ పెరగవు, తగ్గుతాయి. కనుక మధుమేహం ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. ఇక చిలగడదుంపలను చలికాలంలో మనం ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లేదా సాయంత్రం స్నాక్స్ రూపంలో ఉడకబెట్టి తినవచ్చు. ఈ దుంపల్లో విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది. ఇది కంటి చూపును పెంచడంతోపాటు ఇమ్యూనిటీని సైతం పెరిగేలా చేస్తుంది. దీంతో ఇన్ఫెక్షన్లు, రోగాల నుంచి రక్షణ లభిస్తుంది. కాబట్టి ఈ సీజన్లో ఈ దుంపలను తినడం కూడా మరిచిపోకండి.
ఉసిరికాయలు మనకు చలికాలంలోనే లభిస్తాయి. ఉసిరికాయలకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. అనేక ఔషధాల తయారీకి వీటిని వాడుతారు. ఉసిరికాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటుంది. ఉసిరికాయలను రోజూ తినాలి. లేదా జ్యూస్ అయినా తాగాలి. మార్కెట్లో మనకు ఉసిరికాయ ట్యాబ్లెట్లు సైతం అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ సలహా మేరకు వీటిని వాడుకోవచ్చు. ఇలా ఉసిరిని ఏదో ఒక రూపంలో తీసుకుంటే తద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. దీంతో శ్వాసకోశ సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.
ఖర్జూరాలను ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో అనేక విటమిన్లు, మినరల్స్‌తోపాటు ఫైబర్ కూడా ఉంటుంది. అందువల్ల ఆర్థరైటిస్ ఉన్నవారు ఖర్జూరాలను తింటే నొప్పుల నుంచి బయట పడవచ్చు. ఇక బెల్లం చక్కెరకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ఇది కూడా శరీరంలో వేడిని పుట్టిస్తుంది. కనుక చలికాలంలో బెల్లంను కూడా రోజూ తినాలి. బెల్లంలో ఐరన్ అధికంగా ఉంటుంది. దీంతో రక్తం తయారవుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు. కాలుష్యంలో ఉండేవారు రోజూ రాత్రి చిన్న బెల్లం ముక్కను తింటే మంచిది. దీంతో ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి. చలికాలంలో ఖర్జూరాలు, బెల్లంను కూడా తప్పక తీసుకోవాలి.
ఇవే కాకుండా మిల్లెట్స్, నట్స్, ఆవాలు, నువ్వుల వంటి వాటిని ఈ సీజన్లో కచ్చితంగా తీసుకోవాలి. దీంతో శరీరం వేడిగా మారడమే కాదు పోషకాలు లభిస్తాయి. ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు.