మా అబ్బాయి వయసు రెండేండ్లు. పదిహేను నెలల వయసులో నడవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు పరిగెత్తుతున్నాడు. ఈ క్రమంలో మాటిమాటికీ కిందపడిపోతున్నాడు! పడినప్పుడు దెబ్బలు తగులుతున్నాయి. ఈ దెబ్బల కారణంగా భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వస్తాయా?
సాధారణంగా పిల్లలు సంవత్సరం నుంచి పద్దెనిమిది నెలల వయసు మధ్య నడవడం మొదలుపెడతారు. కానీ, కొంతమంది పిల్లలు ఏడాదికి ముందుగానే నడుస్తారు! ఇంకొంతమంది పిల్లలు పద్దెనిమిది నెలల తర్వాత నడుస్తారు. ఆలస్యంగా నడవడం మొదలుపెట్టారని ఆందోళన అనవసరం. పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రదేశాలను చూస్తూ ఉండిపోరు. పరిసరాల్లో ఉండే వస్తువులను తాకాలని, అందుకోవాలని ఆరాటపడుతుంటారు. అందుకోసం అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. ఆ సందర్భంలో పడిపోవడం సహజమే. చిన్నపిల్లలకు దెబ్బలు తగులుతాయని భయంతో తల్లిదండ్రులు వాళ్లను ఎటూ వెళ్లకుండా ఎత్తుకోవడం, తామే తిప్పడం చేస్తుంటారు.
ఇలా చేయకుండా.. పిల్లలు తిరిగేటప్పుడు, పరిగెత్తేటప్పుడు దెబ్బలు తగలకుండా, ప్రమాదం జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇల్లు, పరిసరాలు పిల్లలకు సేఫ్గా ఉండేలా మార్చుకోవాలి. పిల్లలు ఉన్న ఇంట్లో రసాయనాలు, వేడి పాత్రలు, వస్తువులు, పదునైన కత్తులు వాళ్లకు అందకుండా ఉంచాలి. చిన్నారులు బాల్కనీలోకి పోకుండా తలుపులు పెట్టాలి. ప్రమాదం జరుగుతుందేమోనని పిల్లల్ని కట్టడి చేయకుండా, కనిపెట్టుకుని ఉండాలి. వారికి అన్ని సదుపాయాలు కల్పించడం పెద్దల బాధ్యత. పిల్లలు పరిగెత్తేటప్పుడు తగిలిన దెబ్బ తీవ్రతను బట్టి దాని ప్రభావం ఉంటుంది.
చిన్న చిన్న దెబ్బలు సాధారణమే. వాటివల్ల భవిష్యత్లో ఏ సమస్యా ఉండదు. అన్నిటికీ కంగారుపడొద్దు. ఈ వయసులో పిల్లల యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ల ఎదుగుదలకు మనం సాయం చేయాలి. మాటిమాటికీ పడటం గురించి ఏదైనా సందేహం ఉంటే, పిల్లల వైద్యులకు చూపించాలి. బిడ్డ కండరాల్లో, నరాల్లో ఏదైనా లోపం ఉందో, లేదో వైద్యులు పరీక్షలు చేసి నిర్ధారిస్తారు. ఏదేదో ఊహించుకొని అనవసరంగా ఆందోళన చెందకండి.
– డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్