Nutrition Deficiency | శుభ్రమైన, సమతుల్య ఆహారం తీసుకుంటూ, రోజుకు 8 గంటల నిద్రపోతూ, రెగ్యులర్గా సప్లిమెంట్స్ తీసుకున్నా కూడా అలసట, నిద్రలేమి, శక్తిలేమి తగ్గకపోతే.. సమస్య ఆహారంలో కాదు, గట్ (జీర్ణ వ్యవస్థ)లో ఉండొచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. శరీరానికి అవసరమైన పోషకాలు సరైన విధంగా శోషించబడకపోవడం ప్రధాన కారణంగా ఉండవచ్చని వారు వివరిస్తున్నారు. ముఖ్యంగా గోళ్లు, జుట్టు, చర్మం ద్వారా శరీరం ఇచ్చే సంకేతాలను గమనించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. గోళ్లపై రేఖలు (ridges), మోచేతుల వద్ద ఎండిపోయిన చర్మం తగ్గకపోవడం, అధికంగా జుట్టు ఊడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే, శరీరం లోపల పోషకాల శోషణలో సమస్య ఉందని అర్థం. ఏం తింటారన్నది కాదు, శరీరం ఏం శోషించగలుగుతుందన్నదే ముఖ్యమని వారు స్పష్టం చేస్తున్నారు. అందుకే మంచి ఆహారం తీసుకున్నా కూడా రక్త పరీక్షల్లో ఐరన్, విటమిన్ B12, విటమిన్ D లు తక్కువగా కనిపించవచ్చని వారు చెబుతున్నారు.
ఈ సమస్యకు మూల కారణం గట్ లైనింగ్ దెబ్బతినడమేనని వారు వివరిస్తున్నారు. గట్లో విల్లి (villi) అనే చిన్న వేళ్లలాంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవే ఆహారంలో ఉన్న పోషకాలను రక్తంలోకి తీసుకెళ్తాయి. అయితే ఒత్తిడి (stress), ఫుడ్ సెన్సిటివిటీలు, ఎక్కువగా గ్లూటెన్, పాల ఉత్పత్తులు, చక్కెర తీసుకోవడం వలన గట్లో దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ (వాపు) ఏర్పడుతుంది. దీనివల్ల ఈ విల్లి నిర్మాణాలు దెబ్బతిని సన్నబడిపోతాయి, తమ సామర్థ్యాన్ని కోల్పోతాయి. విల్లి నిర్మాణం దెబ్బతిన్నప్పుడు గట్ శోషణ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోతుంది. అందువల్ల ఎంత మంచి ఆహారం తీసుకున్నా, ఎంత ఖరీదైన సప్లిమెంట్స్ వాడినా ప్రయోజనం ఉండదు. అవి శరీరం లోపలికి శోషించకుండా బయటకు వెళ్లిపోతాయి. అందుకే గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచకుండా సప్లిమెంట్స్ తీసుకోవడం పెద్దగా ప్రయోజనం ఇవ్వదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గోళ్లపై రేఖలు కనిపించడం జింక్ లేదా ఐరన్ లోపానికి సూచన అని, మోచేతుల వద్ద ఎండిపోయిన, రఫ్ చర్మం ఫ్యాటీ యాసిడ్స్ లేదా విటమిన్ A లోపం అని, అధిక జుట్టు ఊడిపోవడం ఫెరిటిన్, విటమిన్ B12 లేదా విటమిన్ D లోపం అని నిపుణులు చెబుతున్నారు. శరీరం లోపల ఏం జరుగుతుందో బయట లక్షణాల ద్వారా తెలియజేస్తుందని, గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచకుండా బయోటిన్ లేదా కొల్లాజెన్ వంటి సప్లిమెంట్స్ తీసుకున్నా సమస్య పూర్తిగా పరిష్కారం కాదని నిపుణులు సూచిస్తున్నారు. గట్ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలను తీసుకోవడం ద్వారా, గట్ లైనింగ్ ను బలోపేతం చేయడంద్వారా మాత్రమే ఈ సమస్యల నుండి బయటపడవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.