Mushrooms | ఒకప్పుడు కేవలం వర్షాకాలం సీజన్లో మాత్రమే పుట్టగొడుగులు లభించేవి. వర్షం పడినప్పుడు ఇవి మొలకెత్తేవి. చేలు, పొలాల్లో ఇప్పటికీ ఇవి ఎక్కువగా లభిస్తుంటాయి. అయితే ప్రస్తుతం ఏడాది పొడవునా మనకు పుట్టగొడుగులు అందుబాటులో ఉంటున్నాయి. కానీ ఇవి లభించేది ఈ సీజన్లోనే గనుక వీటిని ఇప్పుడు కచ్చితంగా తినాల్సి ఉంటుంది. పుట్టగొడుగులను తినడం వల్ల అనేక పోషకాలను పొందవచ్చని, ఆరోగ్యకరమైన ప్రయోజనాలు లభిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పుట్టగొడుగులను పోషకాలకు గనిగా చెబుతారు. మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు వీటిల్లో ఉంటాయి.
పుట్టగొడుగుల్లో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. బరువు తగ్గాలనే ప్రణాళికలో ఉన్నవారు పుట్టగొడుగులను ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. పుట్టగొడుగుల్లో విటమిన్ బి2 అధికంగా ఉంటుంది. ఇది మన శరీరానికి శక్తిని అందించడమే కాకుండా కణాల నిర్మాణానికి సహాయం చేస్తుంది. వీటిల్లో ఉండే విటమిన్ బి3 మెటబాలిజంను మెరుగు పరుస్తుంది. దీంతో క్యాలరీలు సులభంగా ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. పుట్టగొడుగుల్లో ఉండే పాంటోథెనిక్ యాసిడ్ (విటమిన్ బి5) హార్మోన్ల ఉత్పత్తికి దోహదం చేస్తుంది.
పుట్టగొడుగుల్లో విటమిన్ బి9 (ఫోలేట్) అధికంగా ఉంటుంది. ఇది డీఎన్ఏ ఆరోగ్యానికి, కణాల నిర్మాణానికి ఎంతగానో అవసరం అవుతుంది. ఇలా పలు రకాల బి విటమిన్లను మనం పుట్టగొడుగుల ద్వారా పొందవచ్చు. వీటిల్లో విటమిన్ డి కూడా అధిక మొత్తంలో ఉంటుంది. ఇది మనం తినే ఆహారాల్లో ఉండే క్యాల్షియంను శరీరం సరిగ్గా శోషించుకునేలా చేస్తుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. మూడ్ నియంత్రణలో ఉంటుంది. డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. పుట్టగొడుగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగానే ఉంటాయి. వీటిల్లో సెలీనియం, ఎర్గోథియోనైన్, గ్లూటా థియోన్, విటమిన్ సి ఉంటాయి. ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్ల మాదిరిగా పనిచేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.
పుట్టగొడుగులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఈ సీజన్లో వచ్చే రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సమస్యలు తగ్గిపోతాయి. శ్వాసకోశ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. వీటిని తింటే ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి కనుక రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. పుట్ట గొడుగుల్లో క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పనిచేసే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కనుక తరచూ వీటిని తింటే పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో తేలింది. ఇలా పుట్గగొడుగులను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.