Vitamin B1 | మన శరీరానికి కావల్సిన అన్ని పోషకాలు అందినప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. శరీరానికి కావల్సిన పోషకాలల్లో ఏ ఒక్కటి తక్కువైనా కూడా శరీరం అనారోగ్యానికి గురవుతుంది. కనుక మనం కాలానుగుణంగా లభించే పండ్లను, ఆకుకూరలను, కూరగాయలను, పప్పు దినుసులను, గింజలను తప్పకుండా ఆహారంలో భాగంగా చేసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తూ ఉంటారు. శరీరానికి కావల్సిన పోషకాలు అనగానే ముందుగా మనకు వచ్చేవి విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఎ, ప్రోటీన్, క్యాల్షియం వంటివి మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ మన శరీరానికి విటమిన్ బి1 కూడా చాలా అవసరం. దీనిని థయామిన్ అని కూడా పిలుస్తారు. నరాలు, కండరాల పనితీరును పెంచడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, జీవక్రియలను మెరుగుపరచడంలో, జ్ఞాపకశక్తిని పెంచడంలో ఇలా అనేక రకాలుగా విటమిన్ బి1 మనకు సహాయపడుతుంది. శరీరంలో విటమిన్ బి1 లోపించడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలకు గురి కావాల్సి వస్తుంది. కనుక మనం విటమిన్ బి1 ఉండే ఆహారాలను తప్పకుండా తీసుకోవాలి.
ఇది నీటిలో కరిగే విటమిన్. శరీరంలో కార్బొహైడ్రేట్ లను శక్తిగా మార్చడంలో ఈ విటమిన్ మనకు సహాయపడుతుంది. ఈ విటమిన్ లోపం వల్ల నరాల సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా బెరిబెరి అనే సమస్య తలెత్తుంది. ఈ సమస్య కారణంగా మనం తీసుకునే ఆహారాన్ని శరీరం శక్తిగా మార్చుకోలేదు. దీంతో గుండె, నరాల సంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా విటమిన్ బి1 లోపం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది. శరీర బరువు తగ్గుతారు. మానసిక ప్రశాంతతను కోల్పోతారు. మనసు ఎప్పుడూ గందరగోళంగా, అలజడిగా ఉంటుంది. అంతేకాకుండా తలతిరగడం, నీరసం, ఆకలి లేకపోవడం, కాళ్లు , చేతులు తిమ్మిర్లు రావడం వంటివి కూడా జరుగుతాయి. కనుక విటమిన్ బి1 ఉండే ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం.
పొద్దుతిరుగుడు గింజలల్లో తగిన మొత్తంలో విటమిన్ బి1 ఉంటుంది. 100గ్రాముల పొద్దు తిరుగుడు గింజలల్లో 0.106 మిల్లీగ్రాముల విటమిన్ బి1 ఉంటుంది. అంతేకాకుండా ఈ గింజలల్లో విటమిన్ బి1 తోపాటు బి2, బి3, బి6, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె వంటి ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఈ గింజలను తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ బి1 లోపం తలెత్తకుండా ఉంటుంది. దీంతో మనం విటమిన్ బి1 లోపం వల్ల తలెత్తే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. అలాగే పచ్చి బఠానీలలో కూడా తగిన పరిమాణంలో విటమిన్ బి1 ఉంటుంది. 100గ్రాముల పచ్చిబఠాణీల్లో 0.282 మిల్లీగ్రాముల విటమిన్ బి1 ఉంటుంది. వీటిలో క్యాల్షియం, ఐరన్, మెగ్నిషియం, భాస్వరం, పొటాషియం, సోడియం, సెలీనియం వంటి ఇతర పోషకాలు కూడా ఉంటాయి. అలాగే పచ్చిబఠాణీలు మనకు అందుబాటులో ధరలో కూడా లభిస్తాయి. కనుక వీటిని సులభంగా ఎవరైనా తినవవచ్చు. పచ్చిబఠాణీలను తినడం వల్ల విటమిన్ బి1 లోపం రాకుండా చూసుకోవచ్చు.
మాంసం, చేపలు, పాలు, తృణ ధాన్యాలు వంటి వాటిలో కూడా విటమిన్ బి1 ఉంటుంది. వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కూడా విటమిన్ బి1 లోపం రాకుండా చూసుకోవచ్చు. ఇక విటమిన్ బి1 సాధారణంగా 19 ఏళ్లు పైబడిన వారికి రోజుకి 1.2 మిల్లీగ్రాములు, గర్భిణీ స్త్రీలకు రోజుకి 1.1 మిల్లీగ్రాములు, పాలిచ్చే తల్లులకు రోజుకి 1.4 మిల్లీ గ్రాములు అవసరమవుతుంది. కనకు విటమిన్ బి1 కలిగిన ఆహారాలను కూడా తప్పకుండా తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.