Soaked Almonds | ప్రస్తుతం చాలా మంది తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. అందులో భాగంగానే రోజూ వ్యాయామం చేయడంతోపాటు అన్ని రకాల పోషకాలు కలిగిన ఆహారాలను తింటున్నారు. పోషకాలు కలిగిన ఆహారం విషయానికి వస్తే ఎక్కువ శాతం మంది తింటున్న వాటిలో బాదంపప్పు మొదటి స్థానంలో నిలుస్తుందని చెప్పవచ్చు. బాదంపప్పులో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బాదంపప్పును రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే శక్తి లభించడమే కాదు, వ్యాధులు దరి చేరకుండా చూసుకోవచ్చు. అయితే బాదం పప్పును ఎల్లప్పుడూ పొట్టు తీసే తినాలని, అది కూడా నానబెట్టి మాత్రమే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. బాదంపప్పును అసలు ఎందుకు నానబెట్టి తినాలి, పొట్టు ఎందుకు తీయాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బాదంపప్సు పొట్టులో పోషకాలు ఉండవు. పైగా ఫైటిక్ యాసిడ్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది మన శరీరంలో చేరితే మనం తిన్న ఆహారంలో ఉండే ఐరన్, క్యాల్షియం వంటి పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకోలేదు. అందువల్ల బాదంపప్పును పొట్టు తీసి తినాలి. అలాగే పొట్టులో ఉండే ఫైబర్ మూలంగా త్వరగా జీర్ణం కాదు. దీంతో బాదంపప్పులో ఉండే పోషకాలు శరీరానికి సరిగ్గా లభించవు. అలాగే కొందరికి బాదంపప్పును పొట్టుతో సహా తింటే వాంతికి వచ్చినట్లు అనిపిస్తుంది. అందులో ఉండే ఎంజైమ్‌ల కారణంగా అలర్జీలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక బాదంపప్పులను పొట్టు తీసి తినాల్సి ఉంటుంది. ఇక బాదంపప్పును నానబెట్టి పొట్టు తీసి తింటే తేలిగ్గా జీర్ణం అవడమే కాదు, ఆ పప్పులో ఉండే పోషకాలు కూడా మనకు సమృద్దిగా లభిస్తాయి. కనుక బాదంపప్పులను ఎప్పుడూ నేరుగా తినకూడదు. నానబెట్టిన తరువాత పొట్టు తీసి తింటే మంచిది.
బాదంపప్పులో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను పెంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బాదంపప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చూస్తాయి. బాదంపప్పులో క్యాలరీలు అధికంగా ఉంటాయి. కానీ వీటిని తింటే బరువు పెరగరు. పైగా బరువు తగ్గేందుకు ఇవి సహాయం చేస్తాయి. బాదంపప్పులో ఫైబర్, ప్రోటీన్లు ఉంటాయి. అందువల్ల ఈ పప్పును తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. కడుపు నిండిన భావనతో ఉంటారు. జంక్ ఫుడ్ జోలికి వెళ్లరు. ఆహారం కూడా తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. ఇలా బాదంపప్పుతో బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.
బాదంపప్పును రోజూ తినే వారిలో షుగర్ లెవల్స్ గణనీయంగా తగ్గుతాయని, డయాబెటిస్ అదుపులో ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో తేలింది. బాదంపప్పులో మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరిచే అనేక పోషకాలు ఉంటాయి. ఈ పప్పులో విటమిన్ ఇ, మెగ్నిషియం, ఎల్-కార్నైటైన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ఏకాగత్రను మెరుగు పరుస్తాయి. మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. బాదంపప్పులో అధికంగా ఉండే విటమిన్ ఇ చర్మాన్ని రక్షిస్తుంది. ముఖంపై ఉండే ముడతలను పోగొడుతుంది. చర్మానికి సహజసిద్ధమైన నిగారింపు, కాంతి వచ్చేలా చేస్తుంది. కాబట్టి బాదంపప్పును రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.