Virus | జంతువుల్లో ఉండే కొన్ని వైరస్లు ఎందుకు మనుషులకు సోకవు ? మరికొన్ని మాత్రం మనుషులకు వ్యాపించి తీవ్రమైన వ్యాధులకు ఎందుకు కారణమవుతాయనే ప్రశ్నలకు తాజా పరిశోధన కొత్త సమాధానాలను అందించింది. వైరస్ జన్యువులో జరిగే ఒక్క చిన్న మార్పు (మ్యూటేషన్) కూడా అది జంతువులకే పరిమితం అవుతుందా లేదా మనుషులకు వ్యాపించి ప్రమాదకరంగా మారుతుందా అనే విషయాన్ని నిర్ణయించగలుగుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. భవిష్యత్తులో మహమ్మారులను ముందుగానే గుర్తించి నివారించడంలో ఈ పరిశోధన ఉపయోగపడే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-శాన్ ఫ్రాన్సిస్కో (UCSF)తోపాటు ఇతర సంస్థలకు చెందిన పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం సెల్ హోస్ట్ అండ్ మైక్రోబ్ (Cell Host Microbe) జర్నల్‌లో ప్రచురితమైంది. ఇందులో కోవిడ్-19కు కారణమైన సార్స్-కోవ్-2 (SARS-CoV-2) వైరస్‌ను, గబ్బిలాల్లో కనిపించే దానికి అత్యంత సమీప సంబంధం ఉన్న కరోనా వైరస్ ర్యాట్జీ13 (RaTG13)తో పోల్చి విశ్లేషించారు.
జన్యుపరంగా ఈ రెండు వైరస్లు చాలా వరకు ఒకేలా ఉన్నప్పటికీ, అవి తమ తమ ఆతిథ్య జీవుల్లో (హోస్ట్‌లలో) పూర్తిగా భిన్నంగా ప్రవర్తిస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. మనుషుల కణాలు, గబ్బిలాల కణాల్లో వైరస్లు రోగనిరోధక వ్యవస్థతో ఎలా స్పందిస్తాయో పరిశీలించగా, ఒక్క జన్యు మార్పే వైరస్ ప్రవర్తనను పూర్తిగా మార్చగలుగుతుందని తేలింది. ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు కరోనా వైరస్‌లను మోసుకెళ్లే గ్రేటర్ హార్స్‌షూ బ్యాట్ జాతికి చెందిన గబ్బిలం ఊపిరితిత్తుల కణాలను ప్రయోగశాలలో తొలిసారిగా విజయవంతంగా పెంచి అధ్యయనం చేశారు. అనంతరం ఈ కణాల్లో సార్స్-కోవ్-2, ర్యాట్జీ13 వైరస్లు ఎలా ప్రవర్తిస్తున్నాయో విశ్లేషించారు. పరిశోధనలో వైరస్‌లోని OrfB9 అనే ప్రోటీన్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రోటీన్ వైరస్, ఆతిథ్య జీవి రోగనిరోధక వ్యవస్థ మధ్య జరిగే పరస్పర చర్యల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఆశ్చర్యకరంగా సార్స్-కోవ్-2, ర్యాట్జీ13 వైరస్‌లలోని OrfB9 ప్రోటీన్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఈ ప్రోటీన్‌లోని సుమారు 100 అమైనో ఆమ్లాల్లో కేవలం ఒక్క అమైనో ఆమ్లం మాత్రమే భిన్నంగా ఉన్నప్పటికీ, ఆ చిన్న తేడా వైరస్ ప్రవర్తనపై భారీ ప్రభావం చూపినట్లు తేలింది.
మనుషుల ఊపిరితిత్తుల కణాల్లో సార్స్-కోవ్-2లోని OrfB9 ప్రోటీన్ శరీరంలోని ముఖ్యమైన రోగనిరోధక రక్షణ వ్యవస్థను అణచివేయగలిగింది. సాధారణంగా ఈ వ్యవస్థ వైరస్ దాడిని గుర్తించి శరీరాన్ని అప్రమత్తం చేస్తుంది. అయితే ఈ రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేయడం వల్ల వైరస్ మనుషుల కణాల్లో వేగంగా విస్తరించే అవకాశం లభిస్తుందని పరిశోధకులు గుర్తించారు. దీనికి భిన్నంగా ర్యాట్జీ13 వైరస్‌లోని OrfB9 గబ్బిలాల ఊపిరితిత్తుల కణాల్లో రోగనిరోధక వ్యవస్థను అణచివేయకుండా, వైరస్‌ను నియంత్రించే రక్షణాత్మక ప్రోటీన్‌ను యాక్టివేట్ చేసింది. దీంతో వైరస్ గబ్బిలాల్లో తీవ్రమైన నష్టం కలిగించకుండా నియంత్రణలో ఉండగలిగిందని అధ్యయనం వెల్లడించింది. జంతువుల నుంచి మనుషులకు వైరస్ వ్యాపించే ప్రక్రియను శాస్త్రవేత్తలు స్పిల్ఓవర్ గా పేర్కొంటారు. కోవిడ్-19, సార్స్, మెర్స్ వంటి అనేక అంటువ్యాధులు మొదట జంతువుల్లో ఉద్భవించి తరువాత మనుషులకు వ్యాపించినవేనని ఇప్పటికే భావిస్తున్నారు. తాజా అధ్యయనం ప్రకారం వైరస్ జన్యువులో జరిగే అతి చిన్న మార్పు కూడా ఈ స్పిల్‌ఓవర్‌కు కారణమయ్యే అవకాశముందని తేలింది.
వన్యప్రాణుల్లో సంచరిస్తున్న వైరస్ల జన్యు లక్షణాలను ముందుగానే విశ్లేషించడం ద్వారా ఏ వైరస్లు భవిష్యత్తులో మనుషులకు ముప్పుగా మారే అవకాశం ఉందో గుర్తించవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ముఖ్యంగా వైరస్ ప్రోటీన్లు వివిధ జాతుల రోగనిరోధక వ్యవస్థలతో ఎలా పరస్పర చర్యలు జరుపుతున్నాయో అర్థం చేసుకోవడం ద్వారా భవిష్యత్ మహమ్మారులకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు. ఈ తరహా పరిశోధనలు భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా వ్యాధుల పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా మార్చడంతోపాటు, కొత్త వైరస్లు మనుషులకు వ్యాపించే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి ప్రజారోగ్య వ్యవస్థలు తగిన సన్నద్ధతతో ఉండేందుకు దోహదపడే అవకాశముందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.