Sleepiness | భోజనం చేసిన తర్వాత నిద్రగా అనిపించడం లేదా శరీరంలో అలసట రావడం చాలా మందికి సాధారణంగా కనిపించే సమస్య. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పటికీ కొందరికి భోజనం అనంతరం బద్ధకం, నిద్రమత్తు, శక్తి తగ్గిన భావన కలుగుతుంది. అయితే ఇది కేవలం ఆహారం వల్ల మాత్రమే కాకుండా, భోజనం తర్వాత శరీరంలో సహజంగా జరిగే మార్పుల కారణంగా కూడా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత శరీరం రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్‌లోకి వెళ్తుంది. అంటే ఆహారం జీర్ణం కావడానికి జీర్ణాశయం, పేగుల వైపు రక్తప్రసరణ ఎక్కువగా జరుగుతుంది. ఈ ప్రక్రియ వల్ల శరీరం కొంత ప్రశాంతంగా, రిలాక్స్ అయినట్లుగా అనిపిస్తుంది. దాంతో కొందరికి నిద్ర మత్తు కూడా వస్తుంది. దీన్ని చాలాసార్లు సహజమైన ప్రతిస్పందనగా భావిస్తారు.
అయితే మనం తీసుకునే ఆహారం కూడా ఈ అలసటపై ప్రభావం చూపుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పెద్ద మొత్తంలో భోజనం చేయడం లేదా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. తెల్ల బియ్యం, వైట్ బ్రెడ్, అధిక చక్కెరలు ఉన్న పదార్థాలు, ఎక్కువగా ప్రాసెస్ చేసిన స్నాక్స్ వంటి ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచుతాయి. అనంతరం అవి వేగంగా తగ్గిపోవడంతో శరీరంలో అలసట, నిద్రమత్తు పెరిగే అవకాశం ఉంటుంది.
కనుక వీటికి భిన్నంగా ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన సమతుల ఆహారం తీసుకుంటే జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండి శక్తి కూడా ఎక్కువసేపు నిల్వ ఉంటుంది. ఆహారం తీసుకున్న వెంటనే శరీరంలో జరిగే ఈ మార్పులు సహజమైనవే అయినప్పటికీ, సరైన ఆహారపు అలవాట్లు పాటించడం ద్వారా భోజనం తర్వాత వచ్చే అలసటను కొంతవరకు తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.