Sleep | నేటి బిజీ జీవితంలో చాలామంది సరిపడా నిద్రపోయినా కూడా రోజంతా అలసటగా అనిపిస్తోందని చెబుతూ ఉంటారు. ఈ సమస్యను చాలా మంది ఎదుర్కొనే ఉంటారు. రాత్రి 7-8 గంటలు నిద్రపోయినా ఉదయం లేవగానే శరీరంలో శక్తి లేకపోవడం, రోజువారీ పనులు చేయడానికే బద్ధకంగా అనిపించడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని స్లీప్ షాటిగ్యుగా పిలుస్తారు. ఇది క్రమంగా పనితీరు, మానసిక స్థితి, వ్యక్తిగత జీవితం మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. శరీరానికి ఆహారం, వ్యాయామం ఎంత ముఖ్యమో మంచి నిద్ర కూడా అంతే అవసరం. గాఢమైన, అంతరాయం లేని నిద్ర వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. మూడ్ సమతుల్యంగా ఉంటుంది. శరీరం రోజంతా జరిగిన అలసటను దిద్దుకుంటుంది. కానీ నిద్ర నాణ్యత సరిగా లేకపోతే ఎక్కువసేపు పడుకున్నా శరీరానికి సరైన విశ్రాంతి దక్కదు.
శరీరం అలసటగా ఉండడానికి స్లీప్ అప్నియా అనే సమస్య కూడా ఒక కారణం. ఇది నిరంతర అలసటకు ఒక ప్రధాన కారణంగా మారుతుంది. ఇందులో నిద్రలో ఉండగా గొంతు భాగంలోని శ్వాస మార్గం కొంతసేపు మూసుకుపోవడం వల్ల శ్వాస ఆగిపోతూ మళ్లీ మొదలవుతూ ఉంటుంది. ప్రతి సారి ఇలా జరిగినప్పుడు మెదడు చిన్నగా మేల్కొనే సంకేతం పంపుతుంది. ఈ అంతరాయాలు వ్యక్తికి తెలియకపోయినా నిద్రను విరామాలతో నింపేస్తాయి. ఫలితంగా గాఢనిద్ర దశకు శరీరం చేరుకోలేకపోతుంది. దీంతో చాలాసేపు నిద్రపోయినా అలసట తగ్గదు. అలాగే ఇన్సోమ్నియా లేదా నిద్రలేమి సమస్య ఉన్నవారిలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. నిద్రపోవడానికి ఎక్కువ సమయం పట్టడం, రాత్రి మధ్యలో పలుమార్లు మేల్కొనడం లేదా చాలా త్వరగా లేచి మళ్లీ నిద్ర పట్టకపోవడం జరుగుతుంది. మొత్తం నిద్ర సమయం సాధారణంగా కనిపించినా, అది విరామాలతో ఉండటంతో శరీరానికి పూర్తి విశ్రాంతి లభించదు. దీని వల్ల పగటిపూట చిరాకు, మానసికంగా చురుకుగా లేకపోవడం, అలసట వంటివి ఎక్కువగా ఉంటాయి.
డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక ఆరోగ్య సమస్యలు కూడా శరీర శక్తిని తగ్గిస్తాయి. కొందరు ఎక్కువసేపు నిద్రపోయినా అలసటగా అనిపిస్తే, మరికొందరికి ఆలోచనలు, టెన్షన్ కారణంగా సరైన నిద్ర పట్టదు. ఆందోళన ఎక్కువగా ఉన్నప్పుడు మెదడు ఎప్పుడూ అప్రమత్త స్థితిలోనే ఉండటంతో శరీరం పూర్తిగా రిలాక్స్ కాలేకపోతుంది. గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, ఊపిరితిత్తుల సమస్యలు, మూత్రపిండాల వ్యాధులు వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు కూడా శరీర శక్తిని తగ్గిస్తాయి. ఈ వ్యాధులతో శరీరం సాధారణ పనులు చేయడానికే ఎక్కువ శక్తి వినియోగించుకోవాల్సి వస్తుంది. అదనంగా నొప్పులు, శ్వాసలో ఇబ్బందులు లేదా రాత్రివేళ తరచూ బాత్రూంకి వెళ్లాల్సి రావడం వల్ల నిద్ర మధ్యలో భంగం కలుగుతుంది.
హైపర్సోమ్నియా అనే పరిస్థితిలో వ్యక్తి ఎక్కువసేపు నిద్రపోయినా పగటిపూట తీవ్రమైన నిద్రమత్తుగా అనిపిస్తుంది. నిద్రలేచిన తర్వాత కూడా మత్తుగా ఉండటం, రోజంతా బద్ధకంగా అనిపించడం ఈ సమస్య లక్షణాలు. మెదడు నిద్ర నుంచి మేల్కొనే స్థితికి సరిగా మారకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. జీవనశైలి అలవాట్లు కూడా నిద్ర నాణ్యతపై ప్రభావం చూపుతాయి. రాత్రివేళ ఎక్కువగా తినడం, మసాలా ఆహారం తీసుకోవడం, ఆల్కహాల్ సేవించడం, పడుకునే ముందు మొబైల్ లేదా ల్యాప్టాప్ వాడటం, అసమయాల్లో నిద్రపోవడం వంటి అలవాట్లు శరీర అంతర్గత గడియారాన్ని గందరగోళానికి గురిచేస్తాయి. అలాగే శారీరక వ్యాయామం లేకపోవడం, నీరు తక్కువగా తాగడం, పోషకాహారం లోపించడం కూడా రోజంతా అలసటగా అనిపించేలా చేస్తాయి. నిరంతరం అలసటగా అనిపిస్తే దాన్ని చిన్న సమస్యగా తీసుకోకుండా, సరైన నిద్ర అలవాట్లు పాటించడం, అవసరమైతే వైద్యులను సంప్రదించడం ద్వారా సమస్యను గుర్తించి పరిష్కరించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.