ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) భారత ప్రభుత్వానికి కండ్లకు సంబంధించిన వ్యాధి ట్రకోమాను నిర్మూలించిన దేశంగా గుర్తింపును ఇచ్చింది. కాగా డబ్ల్యూహెచ్‌వో 2021 2030 మధ్య కాలంలో అంతగా పట్టించుకోని ఉష్ణమండల వ్యాధుల (నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్) రోడ్‌మ్యాప్‌లో నిర్మూలించాల్సిన వ్యాధుల్లో ట్రకోమా కూడా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ట్రకోమా పుట్టుపూర్వోత్తరాలు..
కండ్లకు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే అంటువ్యాధి ట్రకోమా. ఇది క్లాస్ట్రీడియం ట్రకోమేటిస్ అనే బ్యాక్టీరియా వల్ల సోకుతుంది. కండ్లకు సోకే ఇన్ఫెక్షన్ కారణంగా అంధత్వానికి దారితీసే వ్యాధుల్లో ట్రకోమా ప్రధానమైంది. ముఖ్యంగా ఈ వ్యాధి అపరిశుభ్ర వాతావరణం, స్వచ్ఛమైన నీరు అందుబాటులో లేని పేదరికంలో మగ్గే ప్రాంతాల్లో ప్రబలంగా కనిపిస్తుంది.
ఇన్ఫెక్షన్కు గురైన వ్యక్తుల కండ్లు, ముక్కు నుంచి కారే ద్రవాలను నేరుగా తాకడం వల్ల ట్రకోమా ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తుంది. అంతేకాకుండా ఈ ద్రవాలను తాకిన ఈగల వల్ల కూడా ట్రకోమా సోకుతుంది. కండ్ల కలక (కంజంక్టివైటిస్ లేదా పింక్ ఐ)తో ట్రకోమా మొదలవుతుంది. చికిత్స తీసుకోకపోతే ఇన్ఫెక్షన్ లోపలి కంటిపాపపై పుండుకు కారణమవుతుంది. ఇది ట్రైకియాసిస్కు దారితీస్తుంది.
కంటి రెప్పలు లోపలికి ముడుచుకుపోయి కార్నియాతో ఒరుసుకుంటాయి. దీంతో నొప్పి కలుగుతుంది. కంటిచూపును దెబ్బతీసి చివరికి అంధత్వాన్ని కలిగిస్తాయి. ట్రకోమాను తొలిదశలోనే గుర్తిస్తే ఎజిత్రోమైసిన్ లాంటి యాంటి బయాటిక్స్‌తో నివారించవచ్చు. పరిశుభ్రమైన నీళ్లు తాగడం, శుభ్రత పాటించడంతో ట్రకోమా రాకుండా నివారించవచ్చు. కాగా, దక్షిణాసియాలో ట్రకోమాను నిర్మూలించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. నేపాల్, మయాన్మర్, పాకిస్తాన్ ఇప్పటికే ఈ లక్ష్యాన్ని సాధించాయి.