Whitening Teeth | నలుగురిలోకి వెళ్లినప్పుడు దంతాలు పసుపు రంగులో లేదా గార పట్టి ఉంటే చూసేందుకు అసహ్యంగా ఉంటుంది. ఆ బాధను అనుభవించే వారికే తెలుస్తుంది. దీంతో కొందరు అందరిలోనూ కలిసేందుకు వెనుకడుగు వేస్తుంటారు. దంతాలు సరిగ్గా లేకపోతే ఆత్మన్యూనత భావం కూడా వస్తుంది. అదో రకంగా ఫీల్ అవుతుంటారు. అయితే పలు రకాల సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తే మీ దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు. పసుపు రంగులో ఉండే మీ దంతాలు తెల్లగా మారుతాయి. అలాగే దంతాలపై ఉండే పాచి, గార కూడా పోతాయి. దంతాలు, చిగుళ్లపై ఉండే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అలాగే నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. మీ దంతాలు తెల్లగా మారాలంటే అందుకు ఎలాంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దంతాలను తెల్లగా మార్చేందుకు బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. బేకింగ్ సోడాను కాస్త తీసుకుని అందులో కొన్ని నీళ్లు కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని మీరు రోజూ వాడే టూత్పేస్ట్పై వేసి దాంతో దంతాలను తోముకోవాలి. ఇలా వారంలో కనీసం 2 నుంచి 3 సార్లు చేస్తుండాలి. దీంతో దంతాలపై ఉండే పాచి, గారతోపాటు పసుపు దనం పోతుంది. దంతాలు తెల్లగా మారి మెరుస్తాయి. బేకింగ్ సోడాతో కొబ్బరినూనెను కలిపి వాడుతున్నా ప్రయోజనం ఉంటుంది. నోట్లో ఉండే బ్యాక్టీరియాను నిర్మూలించి నోటి దుర్వాసనను తగ్గించేందుకు కూడా ఈ చిట్కా పనిచేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనెను తీసుకుని దాన్ని నోట్లో పోసుకుని 15 నుంచి 20 నిమిషాల పాటు బాగా పుక్కిలిస్తూ ఆయిల్ పుల్లింగ్ చేయాలి. నోట్లో నూనెను బాగా అన్ని మూలలకూ తిప్పుతూ పుక్కిలించాలి. ఇలా తరచూ చేస్తుంటే నోట్లో ఉండే బ్యాక్టీరియా నశించి నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలలో ఇరుక్కునే ఆహార వ్యర్థాలు బయటకు పోతాయి. దంతాలపై ఉండే పసుపు దనం పోయి తెల్లగా మారుతాయి.
పసుపును కొద్దిగా తీసుకుని నీళ్లు కలిపి పేస్ట్‌లా చేయాలి. దాన్ని టూత్ బ్రష్‌పై వేసి దాంతో దంతాలను తోముకోవాలి. నీళ్ల స్థానంలో కొబ్బరినూనెను కూడా ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమాన్ని వాడుతుంటే దంతాలపై ఉండే పాచి, గార పోతాయి. పసుపుదనం తగ్గి దంతాలు తెల్లగా మారుతాయి. అలాగే నోటి దుర్వాసన తగ్గుతుంది. పసుపులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు చిగుళ్ల వాపులను తగ్గిస్తాయి. దీంతో చిగుళ్ల నుంచి అయ్యే రక్త స్రావం తగ్గుతుంది. అలాగే దంతాలను తెల్లగా మార్చడంలో అరటి పండు తొక్క కూడా బాగానే పనిచేస్తుంది. అరటి పండు తొక్కను తీసుకుని దాని లోపలి వైపును దంతాలపై సున్నితంగా మర్దనా చేసినట్లు రుద్దాలి. ఇలా రోజూ చేస్తుంటే దంతాలపై ఉండే పసుపుదనం పోతుంది. దంతాలు తెల్లగా మారి మిలమిలా మెరుస్తాయి. అలాగే నోటి దుర్వాసన తగ్గుతుంది.
బేకింగ్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్ మిశ్రమాన్ని టూత్ బ్రష్‌పై వేసి దాంతో దంతాలను తోముకోవాలి తరువాత నోటిని నీళ్లతో శుభ్రం చేయాలి. ఇలా చేస్తున్నా కూడా సమస్య తగ్గుతుంది. అలాగే నిమ్మరసం, బేకింగ్ సోడా మిశ్రమాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమంతోనూ దంతాలను తోముకోవచ్చు. అన్ని రకాల దంత సమస్యలు తగ్గుతాయి. అయితే ఈ చిట్కాలను పాటించినా ఎలాంటి ఫలితం లేకపోతే కచ్చితంగా డెంటిస్ట్‌ను సంప్రదించాలి. వారు మీ సమస్యకు మూల కారణం కనిపెట్టి అందుకు తగిన విధంగా చికిత్సను అందిస్తారు. అప్పుడు దంతాలు, చిగుళ్లు, నోటి సమస్యల నుంచి బయట పడవచ్చు.