White tongue | మన నాలుకను అద్దంలో చూసుకుంటే ఎరుపు రంగులో ఆకర్శణీయంగా కనిపిస్తుంది. కొన్నికొన్ని సార్లు మన నాలుక రంగు మారిపోయింది కూడా మనం చూస్తుంటాం. అయితే, అంతగా పట్టించుకోం. మనం డాక్టర్ దగ్గరకు వెళ్లగానే తొలుత నాలుకను చాచమని అడిగి నాలుక రంగును ఆరాతీస్తారు. దాంతో మనం ఏ సమస్యతో బాధపడుతున్నామో అంచనాకు వస్తారు. అంతగా నాలుక రంగులతో ఆరోగ్య సమస్యలను ఇట్టే పట్టేయవచ్చునని చెప్తున్నారు వైద్య నిపుణులు.
నాలుక.. సాధారణంగా గులాబీ రంగులో ఉంటుంది. ఇది మనకు రుచుల గురించే కాకుండా వ్యాధుల లక్షణాలను కూడా చెప్తుంది. కొన్నిసార్లు నాలుక మారుతున్న రంగు కొన్ని తీవ్రమైన వ్యాధి లేదా క్యాన్సర్ల ప్రారంభ సంకేతాలుగా ఉంటాయి. నాలుక ముఖ్యంగా తీవ్రమైన ఎరుపు, పసుపు, నీలి, తెలుపు, నలుపు, ఊదా రంగుల్లో కనిపిస్తుంటుంది. ఈ ఒక్కో రంగు మనలో ఒక్కో వ్యాధికి సంకేతాలుగా నిలుస్తాయి. నాలుక తెల్లగా ఉంటే శరీరంలో నీటి కొరత ఉన్నట్లుగా భావించాలి. ఇది నోటి ఆరోగ్య సమస్యలు, సిఫిలిస్ వంటి వ్యాధుల ప్రారంభ సంకేతాలుగా అనుమానించాలి. నాలుక పైభాగం తెల్లటి పూతలా కనిపిస్తే పేలవమైన నోటి పరిశుభ్రతను సూచిస్తుంది. అదేవిధంగా తెలుపు రంగు ఫ్లూ ఇన్ఫెక్షన్కు సంకేతం కూడా కావచ్చునని అనుమానించాలి.
బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా నాలుకపై బ్యాక్టీరియా ప్రభావం పెరుగుతుంది. అలాగే తెల్లటి పొర నాలుకపై గడ్డకట్టడం ప్రారంభమవుతుంది. మరోవైపు క్యాన్సర్, అల్సర్ వంటి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తుల్లో కూడా నాలుక తెల్లగా మారే అవకాశాలుంటాయి. నోరు పొడిబారడం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల కూడా నాలుక తెల్ల రంగులోకి మారడం మొదలవుతుంది. నాలుకపై పూత కాటేజ్ చీజ్ పొరలా కనిపిస్తే, ల్యూకోప్లాకియాని కలిగి ఉండవచ్చునని భావించాలి. నాలుక ఉపరితల కణాలు అదనపు పెరుగుదల, ధూమపానం వంటివి తెలుపు నాలుకకు కారణమవుతుంటాయి. నీరు పుష్కలంగా త్రాగటం, మంచి నోటి పరిశుభ్రత నిర్వహించడం ద్వారా నాలుక తెలుపు రంగును అధిగమించవచ్చు.
ఇలా నివారించుకోవచ్చు..
తెలుపు రంగు నాలుకతో ఇబ్బంది పడుతుంటే ప్రతిరోజూ విటమిన్లు, పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఆహారంలో పచ్చి కూరగాయలు, పండ్లను చేర్చుకోవాలి. స్వీట్లు తినకుండా చూసుకోవాలి.
తెలుపు రంగు ఎక్కువ రోజుల పాటు నాలుకను వదలకపోతే వైద్యుడిని సంప్రదించి ఆయన పర్యవేక్షణలో అవసరమైన కొన్ని సప్లిమెంట్లను తీసుకోవాలి. ఒత్తిడికి దూరంగా ఉంటూ నోరు వీలైనంతగా హైడ్రేటెడ్‌గా ఉంచుకునేలా చూసుకోవాలి.
నాలుక తెల్లగా కనిపిస్తే ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్ ఉపయోగించాలి. ఫ్లోరైడ్ ఉన్న నీటిని మాత్రమే తాగాలి. రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోవాలి. ప్రతిరోజూ దంతాలను ఫ్లాసింగ్ చేసుకోవాలి. కనీసం సంవత్సరానికి ఒకసారి దంతవైద్యుడిని సంప్రదించడం అలవాటు చేసుకోవాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఇది అర్హత కలిగిన వైద్య అభిప్రాయానికి ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ వైద్య నిపుణుడిని లేదా ఇంటి వైద్యుడిని సంప్రదించండి. ఈ కథనంతో ‘నమస్తే తెలంగాణ’ యాజమాన్యం ఎలాంటి బాధ్యత వహించదు.