Hair Oil | శిరోజాల సంరక్షణకు ప్రస్తుతం అందరూ ప్రాధాన్యతను ఇస్తున్నారు. స్త్రీలే కాదు పురుషులు కూడా తమ కురులను అందంగా మార్చుకుంటున్నారు. అయితే అన్నీ బాగానే పాటిస్తుంటారు కానీ హెయిర్ ఆయిల్ విషయంలోనే సరైన జాగ్రత్తలు తీసుకోరు. దీంతో జుట్టు సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే ఈ ఆయిల్ వల్ల చర్మం కూడా జిడ్డుగా మారుతుంది. ఇక కొందరు ఎప్పుడు పడితే అప్పుడే హెయిర్ ఆయిల్‌ను అప్లై చేస్తుంటారు. కానీ హెయిర్ ఆయిల్ విషయంలోనూ జాగ్రత్తలను పాటించాలి. అప్పుడే శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. మన జుట్టుకు అన్ని ఆయిల్స్ సరిపోవు. ఎలాంటి హెయిర్ ఆయిల్ ఎవరికి మేలు చేస్తుంది.. అన్న వివరాలను తెలుసుకుని అప్పుడు ఆయిల్‌ను ఉపయోగించాలి. దీంతో మంచి ఫలితాలు రాబట్టవచ్చని బ్యూటిషియన్లు చెబుతున్నారు. ఇక ఎలాంటి ఆయిల్‌ను జుట్టుకు వాడితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా కొబ్బరినూనెను అధిక శాతం మంది జుట్టుకు వాడుతుంటారు. ఇది జుట్టు కుదుళ్ల లోపలికి కూడా వెళ్లగలదు. దీంతో శిరోజాలకు పోషణ లభిస్తుంది. కొబ్బరినూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. దీని వల్ల తలలో ఉండే ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి. ఇన్ఫెక్షన్ కారణంగా చుండ్రు సమస్యతో బాధపడేవారు కొబ్బరినూనెను వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఈ నూనెలో మన జుట్టుకు అవసరం అయ్యే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. అలాగే విటమిన్లు ఇ, కెలతోపాటు ఐరన్ కూడా లభిస్తుంది. ఇవన్నీ జుట్టుకు పోషణను అందిస్తాయి. కొబ్బరినూనెను జుట్టుకు వాడుతుంటే శిరోజాలు సుతి మెత్తగా మారుతాయి. శిరోజాల ఎదుగుదలకు కొబ్బరినూనె ఎంతో సహాయం చేస్తుంది.
మార్కెట్లో మనకు జొజొబా ఆయిల్ కూడా లభిస్తుంది. జొజొబా అనే మొక్కకు చెందిన గింజల నుంచి ఈ నూనెను తీస్తారు. ఈ మొక్కలు అమెరికాలోని ఎడారుల్లో పెరుగుతాయి. ఈ విత్తనాలను డీర్ నట్స్అని కూడా పిలుస్తారు. అమెరికన్లు తమ జుట్టుకు ఎక్కువగా జొజొబా ఆయిల్‌ను ఉపయోగిస్తుంటారు. జుట్టు బాగా పొడిగా మారిన వారు, తరచూ తలంతా పొడిగా మారుతున్న వారు ఈ నూనెను వాడాలి. జిడ్డు చర్మం అయ్యే వారు ఈ నూనెను వాడకూడదు. ఇక శిరోజాల సంరక్షణకు ఆలివ్ ఆయిల్ కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది జుట్టును మంచి కండిషనింగ్‌లో ఉంచుతుంది. గ్రీకులు ఆలివ్ ఆయిల్‌ను అధికంగా ఉపయోగిస్తారు. జుట్టు బాగా పలుచగా ఉన్నవారు, జుట్టు బాగా రాలిపోతున్న వారు ఆలివ్ ఆయిల్‌ను వాడితే మేలు జరుగుతుంది. ఇది శిరోజాల పెరుగుదలకు కావల్సిన పోషణను అందిస్తుంది.
మన పెద్దలు ఎంతో పూర్వం కాలం నుంచి ఆముదాన్ని జుట్టుకు ఉపయోగిస్తున్నారు. దీని వాసన కారణంగా చాలా మంది దీన్ని జుట్టుకు ఉపయోగించరు. కానీ దీన్ని తలకు మర్దనా చేసి 2 గంటల పాటు ఉండి తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే శిరోజాలు నల్లగా మారుతాయి. జుట్టు ఒత్తుగా పెరిగి దృఢంగా ఉంటుంది. ఆముదంతో ఇలా మసాజ్ చేస్తుంటే తలపై ఉండే ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి. ఆముదం జుట్టుకు పెట్టడం ఇష్టం లేని వారు ఇలా మసాజ్ చేస్తే చాలు. ఎంతో ప్రయోజనం పొందవచ్చు. అలాగే బాదం నూనె కూడా జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ఇది జిడ్డు లేని నూనె. జిడ్డు చర్మం ఉన్నవారు ఈ నూనెను తలకు వాడాలి. ఇది జుట్టుకు అవసరం అయిన పోషకాలను అందిస్తుంది. ఈ ఆయిల్ల ఓలిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి శిరోజాలను సంరక్షిస్తాయి. జుట్టును ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తాయి. ఇలా జుట్టు రకం, చర్మాన్ని బట్టి ఎవరికి తగిన హెయిర్ ఆయిల్‌ను వారు వాడితే అన్ని రకాలుగా ప్రయోజనాలను పొందవచ్చు.