Herbal Teas | చాలా మంది రోజూ టీ, కాఫీలను తాగుతుంటారు. వాతావరణం చల్లగా ఉంటే వీటిని మరికాస్త ఎక్కువగానే తాగుతారు. అయితే రోజుకు 2 కప్పులకు మించి టీ లేదా కాఫీ తాగితే ఆరోగ్యానికి హానికరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. కానీ టీ, కాఫీలను తాగే వారికి ఈ వాక్యం రుచించదు. వేడిగా గొంతులో పడకపోతే వారికి మనశ్శాంతి ఉండదు. అయితే వాటికి బదులుగా హెర్బల్ టీలను తాగవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇవి టీ లేదా కాఫీ తాగిన ఫీలింగ్‌ను ఇవ్వడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయని వారు చెబుతున్నారు. హెర్బల్ టీ లను రోజూ కనీసం 2 లేదా 3 కప్పుల మోతాదులో తాగితే అనేక లాభాలు ఉంటాయని వారు అంటున్నారు. ఇక హెర్బల్ టీ లలో చాలా రకాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కమోమిల్ అనే పుష్పాలను ఎండబెట్టి విక్రయిస్తారు. వీటిని నీటిలో మరిగించి తయారు చేసేదే కమోమిల్ టీ. ఇది హెర్బల్ టీలలో ఒకటి. ఈ టీని రాత్రి పూట సేవించాల్సి ఉంటుంది. భోజనం చేసిన తరువాత కమోమిల్ టీ తాగాలి. ఇది ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది. మనస్సు ప్రశాంతంగా మారేలా చూస్తుంది. దీంతో రిలాక్స్ అవుతారు. రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. ఈ టీని సేవించడం వల్ల పొట్టలో ఏర్పడే అసౌకర్యం తొలగిపోతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పుదీనా ఆకులతో తయారు చేసే టీని కూడా తాగవచ్చు. ఇది కూడా మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పుదీనా ఆకుల టీని సేవిస్తుంటే తలనొప్పి, వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం తగ్గుతాయి. ముక్కు దిబ్బడ నంచి ఉపశమనం లభిస్తుంది.
మన అందరి ఇళ్లలోనూ ఉండే అల్లంతోనూ హెర్బల్ టీ తయారు చేసి తాగవచ్చు. చిన్న అల్లం ముక్కను నీటిలో వేసి మరిగించి అనంతరం వచ్చే నీళ్లను వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఇందులో కాస్త నిమ్మరసం లేదా తేనె కలిపి తాగవచ్చు. అల్లం టీని సేవిస్తే వికారం, వాంతికి వచ్చినట్లు అనిపించడం తగ్గుతాయి. యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి కనుక కండరాల నొప్పులు, ఆర్థరైటిస్, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అల్లం టీని సేవిస్తుంటే అజీర్తి తగ్గుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. దగ్గు, జలుబు తగ్గుతాయి. లెమన్ బామ్ అనే మొక్క నుంచి సేకరించిన పదార్థాలతో తయారు చేసే లెమన్ బామ్ టీని తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అయి నిద్ర చక్కగా పడుతుంది. మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు.
మందార పువ్వులతో టీ తయారు చేసి తాగడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కనుక రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు, జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. ఈ పువ్వుల టీని సేవిస్తుంటే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా రక్షిస్తుంది. తులసి ఆకులతోనూ టీ తయారు చేసి తాగవచ్చు. దీన్ని కూడా హెర్బల్ టీగానే చెబుతారు. తులసి ఆకుల టీని సేవిస్తుంటే ఒత్తిడి నుంచి బయట పడవచ్చు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. ఇఆ పలు రకాల హెర్బల్ టీలను సేవించడం వల్ల భిన్న రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.