Hair Oil | జుట్టు పెరుగుదలకు మనం ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటాం. వాటిలో జుట్టుకు నూనెను పట్టించడం కూడా ఒకటి. నూనె రాయడం వల్ల జుట్టు బలంగా, వేగంగా పెరుగుతుంది. జుట్టు పొడిబారకుండా, దెబ్బతినకుండా ఉంటుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. చుండ్రుతో పాటు ఇతర ఇన్పెక్షన్ లు రాకుండా ఉంటాయి. జుట్టు పెరుగుదలకు నూనె అవసరమైనప్పటికీ మనలో చాలా మందికి ఎటువంటి నూనెను వాడాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. కనుక ఇప్పుడు మనం జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే కొన్ని రకాల నూనెల గురించి అలాగే వీటిని వాడడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
ఆముదం నూనెలో రిసినోనిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. ఇది కుదుళ్లకు రక్తప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆముదం నూనెను రాసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు నల్లగా, దృఢంగా పెరుగుతుంది. అలాగే జోజోబా ఆయిల్ ను వాడడం వల్ల జుట్టు ఎల్లప్పుడూ తేమగా ఉంటుంది. తలచర్మం పొడిబారే సమస్య ఉన్న వారు జోజోబా ఆయిల్ ను వాడడం వల్లమంచి ఫలితం ఉంటుంది. రోజ్ మేరీ ఆయిల్ ను వాడడం వల్ల కుదుళ్లకు రక్తప్రసరణ పెరుగుతుంది. దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది. అంతేకాకుండా రాలిన జుట్టు త్వరగా వచ్చేలా ప్రేరేపించడంలో కూడా ఈ నూనె తోడ్పడుతుంది.
టీ ట్రీ ఆయిల్ ను వాడడం వల్ల తల చర్మం ఆరోగ్యం మెరుగుపడుతుంది. జుట్టు కుదుళ్లు శుభ్రపడతాయి. టీ ట్రీ ఆయిల్ లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇన్పెక్షన్ లను, చుండ్రు సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే జుట్టు పెరుగుదలకు కొబ్బరి నూనెను మనం ఎంతో కాలంగా ఉపయోగిస్తూనే ఉన్నాం. ఈ నూనెను వాడడం వల్ల జుట్టుకు పోషణ లభిస్తుంది. జుట్టు బలంగా, వేగంగా పెరుగుతుంది. పెప్పర్మింట్ ఆయిల్ ను వాడడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. కుదుళ్లు బలంగా తయారవుతాయి. జుట్టు వేగంగా పెరగడంలో కూడా ఇది మనకు సహాయపడుతుంది.
ఆలివ్ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ ఎక్కువగా ఉంటాయి. ఈ నూనెను వాడడం వల్ల జుట్టుకు కాంతి చేకూరుతుంది. జుట్టు పొడిబారడం, జుట్టు చివర్లు చిట్లడం వంటి సమస్యలు తగ్గుతాయి. బాదం ఆయిల్ ను వాడడం వల్ల ఎండ నుండి, కాలుష్యం నుండి జుట్టు దెబ్బతినకుండా ఉంటుంది. జుట్టు పొడిబారడం తగ్గుతుంది. జుట్టు రాలడం, జుట్టు తెగిపోవడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే గుంటగలగర ఆకుల నూనెకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నూనెను వాడడం వల్ల జుట్టు పెరగడమే కాకుండా జుట్టు తెల్లబడకుండా ఉంటుంది. ఇలా ఆయా నూనెలు పలు భిన్న రకాల జుట్టు సమస్యలను తగ్గించడంలో సహాయం చేస్తాయి. అయితే వీటిల్లో ఏ నూనె వాడాలనేది వారికున్న జుట్టు సమస్యలు, వారికున్న సౌకర్యం బట్టి ఆధార పడి ఉంటుంది.