Food Science | చాలామందిలో తరచూ తీపి తినాలన్న కోరికలు (స్వీట్ క్రేవింగ్స్) కలుగుతూ ఉంటాయి. అలా తినడం అనారోగ్యం అని తెలిసినప్పటికీ వాటిని నియంత్రించుకోలేరు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది. స్వీట్ క్రేవింగ్స్ కలిగినప్పుడు ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండేలా ఏం తినొచ్చు.
మన శరీరంలో ఏమైనా పోషకాహార లోపాలు ఉన్నప్పుడు శరీరం వాటికి సంబంధించిన పదార్థాలను కోరుకుంటుంది. శరీరానికి నీరు కావాలంటే మనకు దాహం వేస్తుంది కదా! ఈ క్రేవింగ్స్ కూడా అలాంటివే. మన ఒంట్లో కాల్షియం, మెగ్నీషియం, బి గ్రూప్ విటమిన్లు, క్రోమియం లాంటి ఖనిజాలు తక్కువగా ఉంటే… మనకు తరచూ తీపి తినాలన్న కోరిక కలుగుతూ ఉంటుంది.
డయాబెటిస్ వాళ్లకు పంచదార తినాలనిపిస్తుంది. అంటే తీపి తినకుండా వాళ్లను దూరం పెడుతున్నారు కాబట్టి, మనసు లాగడం కాదు. రక్తంలో చక్కెర స్థాయులు వాళ్లకి సరిగ్గా ఉండవు. అలాంటప్పుడు బ్లడ్ గ్లూకోజ్ స్థాయులను సరైన విధంగా ఉంచుకోవడానికి శరీరం తీపిని కోరుకుంటుంది.
అలాగే రాత్రిపూట కూడా కొందరికి ఇలాంటి కోరికలు వస్తుంటాయి. ఒత్తిడి కారణంగా విడుదలయ్యే కార్టిసోల్ హార్మోన్ పెరిగితే, తక్షణ శక్తి కోసం శరీరం తీపి కోరుకుంటుంది. అంటే మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు పోరాడు లేదా పారిపో (ఫైట్ ఆర్ ఫ్లైట్) అన్న స్థితికి శరీరం సిద్ధం అవుతుంది. అలాంటప్పుడు ఎక్కువ చక్కెరలు కోరుతుంది.
కొంతమందికి తిన్న తర్వాత స్వీట్ తినే అలవాటు ఉంటుంది. అది మానసికమైన విషయం. వాళ్లకు అది లేకపోతే తినడం పూర్తయినట్టు కాదు. వీళ్ల మెటబాలిజమ్ భిన్నంగా ఉంటుంది. స్వీట్ తిన్నప్పుడు వెంటనే పెరిగే శక్తి స్థాయులు ఆహారం జీర్ణమవడానికి తోడ్పడతాయి. వాళ్లను అలా తిననివ్వడమే మంచిది.
పీరియడ్స్ సమయంలో కూడా కొందరికి స్వీట్ క్రేవింగ్స్ వస్తాయి. ఈ సమయంలో శరీరంలో ప్రొజెస్టిరాన్ హార్మోన్ స్థాయులు తగ్గి, ఈస్ట్రోజెన్ హార్మోన్ పెరుగుతుంది. దీంతో నెలసరి వచ్చే ముందు, వచ్చాక తొలి రోజుల్లో ఈ ఈస్ట్రోజెన్ కారణంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోతాయి. నెలసరిలో తీపి తినాలన్న కోరికకు కారణం ఇదే.
ఆరోగ్యం దెబ్బతినకుండా తీపి తినాలన్న కోరికను కాస్త చల్లబరచాలంటే… ముందుగా పండ్లను ఎంచుకోవాలి. పండ్లు సహజంగా తియ్యగా ఉంటాయి. అలాగే విటమిన్స్, మినరల్స్ కూడా దొరుకుతాయి. అందులోనూ స్ట్రాబెర్రీ లాంటి తియ్యగా పుల్లగా ఉండేవైతే కాస్త నోటికి రుచిస్తాయి. అలాగే చాక్లెట్ తినాలంటే… 75 పర్సెంట్ కొకోవా ఉన్న డార్క్ చాక్లెట్ తీసుకోవాలి. ఇందులో ఉండే పాలీఫినాల్స్ క్రేవింగ్స్‌ను తగ్గిస్తాయి.
బెల్లంతో చేసిన పల్లీ చిక్కీ, నువ్వుల లడ్డు, ఖర్జూరాలు తినొచ్చు. బెల్లం సున్నుండలు, కిస్మిస్, పీనట్ బటర్లాంటివీ మంచివే. వీటిలో చాలావరకు షుగర్ ఉన్నవాళ్లూ పరిమిత మోతాదులో తీసుకోవచ్చు. ఇక పోషక లోపాలున్న వారికోసం… పాలలో కాల్షియం, అరటిపండులో మెగ్నీషియం, బఠాణీలు, బ్రౌన్ రైస్, సింగిల్ పాలిష్ రైస్, తృణధాన్యాలు, చిరుధాన్యాల్లో బి గ్రూప్ విటమిన్లు, గింజల్లో క్రోమియం దొరుకుతాయి. చక్కటి సమతులాహారం తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ, సకాలంలో నిద్ర పోతే… ఏ రుగ్మతలూ దరిచేరవు.
– మయూరి ఆవుల, న్యూట్రిషనిస్ట్ Mayuri.trudiet@gmail.com