Vegan Diet | అధిక బరువు తగ్గేందుకు లేదా ఆరోగ్యంగా ఉండేందుకు, ఇతర కారణాల వల్ల చాలా మంది ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటిస్తున్నారు. అందులో భాగంగానే పలు రకాల డైట్లను కూడా అనుసరిస్తున్నారు. అయితే ఆదిమ మానవుడి కాలం నుంచి మనిషి మాంసాహారే అయినప్పటికీ ప్రస్తుతం చాలా మంది శాకాహారులుగా మారిపోతున్నారు. అందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ఈ క్రమంలోనే వీగన్ డైట్ ప్రస్తుతం బాగా పాపులర్ అవుతోంది. ఈ డైట్‌ను చాలా మంది పాటిస్తున్నారు. సెలబ్రిటీలు కూడా చాలా మంది వీగన్ డైట్‌ను అనుసరిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే వీగన్ డైట్ అంటే ఏమిటి..? ఇందులో భాగంగా ఎలాంటి ఆహారాలను తీసుకోవాలి.. వేటిని తీసుకోకూడదు.. అని చాలా మందికి సందేహాలు వస్తుంటాయి. అయితే ఇందుకు డైటిషియన్లు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
వీగన్ డైట్ అంటే కేవలం శాకాహారం మాత్రమే తినాలి. వృక్ష సంబంధమైన పదార్థాలను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. జంతు సంబంధ పదార్థాలను తినకూడదు. పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు, పచ్చి బఠానీలు, బీన్స్, చిక్కుడు జాతి గింజలు, నట్స్, సీడ్స్, బ్రెడ్, రైస్, పాస్తా, సోయా మిల్క్, కొబ్బరిపాలు, బాదం పాలు, వెజిటబుల్ ఆయిల్స్ ను మాత్రమే వీగన్ డైట్లో భాగంగా తీసుకోవాల్సి ఉంటుంది. బీఫ్, పోర్క్, మటన్, చికెన్, చేపలు, ఇతర మాంసాహారాలు, కోడిగుడ్లు, చీజ్, వెన్న, పాలు, పాల మీద మీగడ, ఇతర పాల ఉత్పత్తులను తీసుకోరాదు. అయితే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, పనీర్ వంటివి మాంసాహారం కాదు కదా, వీటిని తినవచ్చు కదా.. అని చాలా మందికి సందేహం ఉంటుంది. అయితే ఇవి మాంసాహారం కాదు, కానీ ఇవి జంతు సంబంధ పదార్థాలు. జంతువుల నుంచి వస్తాయి. వీగన్ డైట్లో భాగంగా కేవలం వృక్ష సంబంధ పదార్థాలనే తీసుకోవాల్సి ఉంటుంది. జంతు సంబంధ పదార్థాలను తీసుకోకూడదు. కనుక వీగన్ డైట్‌ను పాటిస్తే కచ్చితంగా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, పనీర్ వంటి వాటికి దూరంగా ఉండాల్సిందే.
వీగన్ డైట్‌ను పాటించడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని సైంటిస్టులు తమ అధ్యయనాల్లో తేల్చారు. శాకాహార డైట్‌ను పాటిస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుందని అంటున్నారు. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. వీగన్ డైట్ డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. ఈ డైట్ వల్ల శరీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. వీగన్ డైట్ వల్ల అనేక వృక్ష సంబంధ పదార్థాలను తినవచ్చు. దీంతో అనేక సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి లభిస్తాయి. ఇవి క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. కనుక ఈ డైట్‌ను పాటిస్తే క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు.
వీగన్ డైట్‌ను పాటించే వారి బరువు ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంటుంది. శరీరంలోని కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ముఖ్యంగా పొట్ట దగ్గర ఉండే కొవ్వు కరుగుతుంది. సన్నగా నాజూగ్గా ఉంటారు. వీగన్ డైట్‌ను పాటించడం వల్ల మనిషి ఆయుర్దాయం కూడా పెరుగుతుందని, ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా జీవించవచ్చని సైంటిస్టుల అధ్యయనాల్లో తేలింది. ఇలా వీగన్ డైట్‌ను పాటిస్తే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అయితే అందరికీ అన్ని రకాల డైట్లు సరిపోకపోవచ్చు. కొన్ని రకాల డైట్లు కొందరికి అనారోగ్య సమస్యలను కలిగించే అవకాశాలు ఉంటాయి. కనుక మీ శరీరానికి తగినట్లు ఏ డైట్‌ను పాటించాలో తెలుసుకోవాలంటే కచ్చితంగా డైటిషియన్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. అప్పుడే సరైన డైట్‌ను పాటించి ఆశించిన స్థాయిలో ఫలితాన్ని పొందవచ్చు.