Tinnitus | చెవిలో ఉండే మైనం (ఇయర్‌వాక్స్) సహజంగా ఉత్పత్తి అవుతుంది. ఇది చెవి కెనాల్‌ను శుభ్రంగా ఉంచే, బ్యాక్టీరియాల నుంచి రక్షించే పదార్థం. ఇది చెవిని తడిగా ఉంచి రక్షణ కల్పిస్తుంది. సాధారణంగా డ్రై వాక్స్, వెట్ వాక్స్ అని రెండు రకాలుగా ఉంటుంది. అయితే ఇది అధికంగా పేరుకుపోతే ENT వైద్యుల సహాయం అవసరం అవుతుంది. ఎక్కువగా గులిమి పేరుకుపోతే వినికిడి తగ్గడం, చెవిలో బ్లాక్ అయిన భావన, నొప్పి, మోగుతున్న శబ్దం (రింగింగ్), తల తిరగడం వంటి సమస్యలు కలుగుతాయి. పగటి సమయంలో ట్రాఫిక్, మాట్లాడే శబ్దాలు, సంగీతం వంటి బాహ్య శబ్దాలు మనకు వినిపించే అసహజ శబ్దాలను (టిన్నిటస్) కప్పిపుచ్చుతాయి. కానీ రాత్రి సమయంలో నిశ్శబ్దం పెరిగే కొద్దీ ఈ శబ్దాలు మరింత స్పష్టంగా వినిపిస్తాయి. దీనిని ఆడిటరీ గెయిన్ అని అంటారు. అంటే మెదడు వినికిడి లోపాన్ని భర్తీ చేయడానికి తన సున్నితత్వాన్ని పెంచుతుందన్నమాట. దీనివల్ల చెవిలో వినిపించే శబ్దం మరింత తీవ్రంగా అనిపిస్తుంది.
రాత్రి సమయంలో నిశ్శబ్ద వాతావరణంలో టిన్నిటస్ తీవ్రత పెరుగుతుంది. దీని వల్ల నిద్ర చక్రం దెబ్బతింటుంది. ముఖ్యంగా లోతైన నాన్-రెమ్ నిద్ర దశలు తగ్గిపోతాయి. ఫలితంగా ఉదయం అలసట, రక్తపోటు, ఆందోళన పెరగడం వంటి సమస్యలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇది ఇన్సోమ్నియా (నిద్రలేమి)కి కూడా దారితీస్తుంది. టిన్నిటస్ కేవలం చెవికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, ఇది మెదడు కార్యకలాపాలతో కూడా సంబంధం కలిగి ఉంటుంది. ఆడిటరీ, లింబిక్ వ్యవస్థల్లో అసాధారణ కార్యకలాపాలు మెదడును పూర్తిగా విశ్రాంతి పొందనీయవు. రాత్రి ప్రారంభంలో కొంత తగ్గినా, తర్వాతి గంటల్లో ముఖ్యంగా తేలికపాటి నిద్రలో మళ్లీ శబ్దం పెరుగుతుంది. రోజుకు సుమారు 8.5 గంటల నిద్ర అందేలా చూడడం టిన్నిటస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. తక్కువ లేదా ఎక్కువ నిద్ర ఈ సమస్యను మరింత పెంచుతుంది. ఈ సమస్య ఉన్నవారు ఉదయాన్నే మత్తుగా ఉండడం, దృష్టి లోపించడం, నిద్రలేమి లక్షణాలు అనుభవించడం సాధారణంగా కనిపిస్తుంది.
ఇక టిన్నిటస్ సమస్యను తగ్గించేందుకు సౌండ్ థెరపీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వైట్ నాయిస్ మెషీన్లు, ఫ్యాన్ శబ్దం లేదా వర్షం, సముద్ర అలల వంటి శబ్దాలు వినడం వల్ల చెవిలోని రింగింగ్ తగ్గుతుంది. ఇవి పగటి సమయంలో ఉన్న శబ్ద వాతావరణాన్ని అనుకరిస్తాయి. నిద్రకు ముందు సరైన అలవాట్లు కూడా కీలకం. నిద్రకు రెండు గంటల ముందు స్క్రీన్లకు దూరంగా ఉండాలి. బ్లూ లైట్ నిద్రను భంగం చేస్తుంది. మృదువైన లైటింగ్, హెర్బల్ టీ (కెఫీన్ లేకుండా), 4-7-8 శ్వాస వ్యాయామం (4 సెకన్లు లోపలికి శ్వాస, 7 సెకన్లు ఆపడం, 8 సెకన్లు బయటకు వదలడం) వంటి పద్ధతులు నాడీవ్యవస్థను ప్రశాంతం చేస్తాయి. తలను సుమారు 30 డిగ్రీల ఎత్తులో ఉంచి పడుకోవడం కూడా ఉపశమనం ఇస్తుంది. అలాగే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT) ద్వారా టిన్నిటస్పై స్పందనను మార్చుకోవచ్చు. గైడెడ్ సెషన్లు లేదా యాప్స్ ద్వారా ఈ శబ్దాన్ని నియంత్రించుకోవడం సాధ్యమవుతుంది.
వీటితో పాటు జీవనశైలిలో కూడా కొన్ని మార్పులు చేసుకోవడం మంచిది. ఉప్పు, మద్యం వినియోగాన్ని తగ్గించడం మంచిది, ఎందుకంటే ఇవి టిన్నిటస్ తీవ్రతను పెంచుతాయి. భారీ వ్యాయామాన్ని పగటి సమయంలో చేయడం ఉత్తమం. శబ్ధం అధికంగా ఉండే ప్రదేశాల్లో చెవులను రక్షించేందుకు ఇయర్‌ప్లగ్స్ ఉపయోగించాలి. వినికిడి లోపం అనుమానం ఉంటే ఆడియోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలి. హియరింగ్ ఎయిడ్స్ వాడడం ద్వారా టిన్నిటస్ శబ్దం సుమారు 50 శాతం వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. చికిత్స లేకుండా టిన్నిటస్ కారణంగా వచ్చే నిద్రలేమి దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. స్ట్రోక్ ప్రమాదం, మానసిక సమస్యలు, దీర్ఘకాల అలసట, డిమెన్షియా వంటి సమస్యలతో కూడా సంబంధం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే సరైన చికిత్స, జీవనశైలి మార్పులు, నిపుణుల మార్గదర్శకత్వంతో ఈ సమస్యను నియంత్రించుకోవచ్చు. ప్రశాంతమైన శబ్దాలతో నిద్ర వాతావరణాన్ని సృష్టించడం ద్వారా మెరుగైన నిద్రను తిరిగి పొందవచ్చని వైద్యులు తెలియజేస్తున్నారు.