Milk | పాలలో మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని పోషకాలు ఉంటాయి. అందుకనే పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా పిలుస్తారు. కనుకనే పాలను రోజూ తాగాలని పోషకాహార నిపుణులు, వైద్యులు చెబుతుంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి మానవులు తమ ఆహారాల్లో పాలను భాగంగా చేసుకున్నారు. అందుకనే గేదెలు, ఆవులను పెంచుతున్నారు. పాలలో ఉండే అనేక రకాల విటమిన్లు, మినరల్స్ మనల్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి. పాలలో క్యాల్షియం, విటమిన్ డి అధికంగా ఉంటాయి. ఈ రెండింటి కాంబినేషన్ ఉండే ఆహారాల్లో పాలు ప్రథమ స్థానంలో నిలుస్తాయని చెప్పవచ్చు. ఎందుకంటే విటమిన్ డి తగినంత లభిస్తేనే దాని ద్వారా ఆహారంలో ఉండే క్యాల్షియంను శరీరం శోషించుకుంటుంది. కనుక ఈ రెండు ఉండే పాలను తాగితే ఎంతో మేలు జరుగుతుంది. దీని వల్ల ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి.
పాలను తాగడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. దంతాల నొప్పులు తగ్గిపోతాయి. వృద్ధాప్యంలో వచ్చే ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సంబంధ వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. వృద్ధాప్యంలోనూ ఎముకలు బలంగా ఉంటాయి. పాలను తాగడం వల్ల ప్రోటీన్లు అధికంగా లభిస్తాయి. ఇవి కండరాలకు మరమ్మత్తులు చేస్తాయి. కండరాల నిర్మాణానికి సహాయం చేస్తాయి. పాలలో ఉండే వే, కేసీన్ అనే ప్రోటీన్లు అథ్లెట్లు, శారీరక శ్రమ చేసేవారు, వ్యాయామం చేసేవారికి ఎంతో మేలు చేస్తాయి. దీని వల్ల కండరాలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. చక్కని దేహాకృతి సొంతమవుతుంది. పాలలో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాలు నిర్మాణం అయ్యేలా చేస్తుంది. దీంతో శరీరంలో రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. పాలలో ఉండే పొటాషియం బీపీని నియంత్రిస్తుంది. శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉండేలా చేస్తుంది. దీంతో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు.
పాలలో ఉండే ఫాస్ఫరస్ శరీరానికి శక్తి లభించేలా చేస్తుంది. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. పాలలో ఉండే అయోడిన్ థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగు పరుస్తుంది. థైరాయిడ్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. ఇక పాలను ఏ సమయంలో తాగాలి అన్న విషయానికి వస్తే.. పాలలో ట్రిప్టోఫాన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది నిద్రను ప్రేరేపిస్తుంది. కనుక పాలను రాత్రి పూట తాగితే మంచిది. లేదంటే ఉదయం లేదా మధ్యాహ్నం వేళ్లలో తాగితే ఆ సమయంలో నిద్ర వచ్చి మీ పనులకు ఆటంకం కలిగే అవకాశాలు ఉంటాయి. ఆయుర్వేద చెబుతున్న ప్రకారం కూడా పాలను రాత్రి పూట తాగితేనే మంచిది. దీంతో ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి తగ్గుతుంది.
పాలను సాధారణంగా అందరూ తాగవచ్చు. కానీ కొందరికి పాలు తాగితే పడవు. అలర్జీ ఉంటుంది. అందుకు కారణం పాలలో ఉండే లాక్టోజ్ అనే ఓ సమ్మేళనమే. ఇది చక్కెర జాతికి చెందుతుంది. లాక్టోజ్‌ను జీర్ణం చేయాలంటే శరీరంలో లాక్టేజ్ అనే ఎంజైమ్ ఉండాలి. కానీ కొందరికి శరీరంలో లాక్జేజ్ చాలా తక్కువగా ఉంటుంది. లేదా సరిగ్గా ఉత్పత్తి కాదు. అలాంటి వారు పాలను తాగితే లాక్టోజ్ జీర్ణం కాదు. దీంతో అలర్జీలు సంభవిస్తాయి. దీన్నే లాక్టోజ్ ఇన్టాలరెన్స్ అని కూడా అంటారు. ఇలాంటి సమస్య ఉన్నవారు పాలను తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక అలర్జీ ఉన్నవారు పాలను తాగకూడదు. పాలలో ఉండే వే, కేసీఆన్ అనే ప్రోటీన్లు కూడా కొందరికి పడవు. అలాంటి వారు కూడా పాలను తాగకూడదు. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం మొటిమలు అధికంగా ఉండేవారు, ఐబీఎస్ అనే వ్యాధి ఉన్నవారు పాలకు దూరంగా ఉంటేనే మంచిదని సైంటిస్టులు చెబుతున్నారు.