Coffee | కాఫీ తాగడం ఆరోగ్యానికి హానికరమనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అయితే తాజా పరిశోధనలు, నిపుణుల సూచనల ప్రకారం కాఫీ గట్ (జీర్ణవ్యవస్థ), లివర్ ఆరోగ్యానికి కూడా మేలు చేయగలదని చెబుతున్నాయి. సుగంధభరితమైన రుచి కలిగిన ఈ పానీయం కెఫీన్ అనే సహజ ఉద్దీపన పదార్థం వల్ల తక్షణ శక్తిని అందిస్తుంది. అంతేకాకుండా పాలీఫినాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల శారీరక, మానసిక పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే కాఫీ తాగేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను గమనించడం అవసరం. కాఫీకి సంబంధించిన సరైన రకం, తాగే సమయం, పరిమాణం, అలవాట్లను దృష్టిలో ఉంచుకోవడం కూడా చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా అత్యంత ఆరోగ్యకరమైన కాఫీ రకం ఫిల్టర్ చేసిన బ్లాక్ కాఫీ అని, ఉదయం నిద్రలేచిన 60 నుండి 90 నిమిషాల తర్వాత కాఫీ తాగడం ఉత్తమ సమయమని, సాధారణంగా రోజుకు 1 నుంచి 3 కప్పులు మించకుండా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కాఫీలో చక్కెర కలపకుండా తాగడం, అలాగే ఖాళీ కడుపుతో లేదా రాత్రి ఆలస్యంగా కాఫీ తీసుకోవడం నివారించడం ఆరోగ్యానికి అనుకూలం. ఇక అమ్లత్వం (అసిడిటీ) సమస్యలు ఉన్నవారికి తక్కువ ఆమ్లత కలిగిన కాఫీ, కోల్డ్ బ్రూ కాఫీ లేదా డీకాఫినేటెడ్ కాఫీ మంచిది. ఈ సూచనలు పాటిస్తే కాఫీ తాగడం మరింత ఆరోగ్యకరంగా మారుతుంది. అదేవిధంగా లివర్ ఆరోగ్యానికి కాఫీ ఎంతో ఉపయోగకరమని కూడా వారు పేర్కొంటున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల ఇది లివర్‌ను రక్షించడంలో సహాయపడుతుంది.
అలాగే కాఫీ మెదడు, గట్, లివర్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని, పాలీఫినాల్స్ మంచి బ్యాక్టీరియాను పెంచుతాయని, దృష్టి కేంద్రీకరణను మెరుగుపరుస్తాయని, అలాగే అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. మొత్తం మరణాల ప్రమాదాన్ని కూడా తగ్గించడంలో కాఫీ పాత్ర ఉండొచ్చని సూచించారు. అయితే చాలా మంది కాఫీ తాగేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చక్కెర ఎక్కువగా కలపడం, ఆర్గానిక్ కాఫీని ఎంచుకోకపోవడం, సరైన రోస్ట్ చేసిన కాఫీ గింజలను ఉపయోగించకపోవడం వంటి తప్పులు ఆరోగ్య ప్రయోజనాలను తగ్గిస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు.