Pre Diabetes | రక్తంలో చక్కెర స్థాయిలు నిర్దిష్టమైన మోతాదు కన్నా ఎల్లప్పుడూ ఎక్కువగా ఉంటే అలాంటి స్థితిని డయాబెటిస్ అంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే డయాబెటిస్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి టైప్ 1 డయాబెటిస్ కాగా రెండోది టైప్ 2 డయాబెటిస్. క్లోమ గ్రంథి పనిచేయకపోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు ఎల్లప్పుడూ అధికంగా ఉంటాయి. దీన్ని టైప్ 1 డయాబెటిస్ అంటారు. అలాగే క్లోమగ్రంథి ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసినా శరీరం దాన్ని సరిగ్గా శోషించుకోలేదు. దీని వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఈ స్థితిని టైప్ 2 డయాబెటిస్ అంటారు. అయితే చాలా మంది ప్రీ డయాబెటిస్ అనే పదాన్ని కూడా తరచూ వింటుంటారు. అయితే వాస్తవానికి ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి..? దీన్ని ఎలా గుర్తించాలి..? దీంతో ఏం జరుగుతుంది..? అన్న విషయాలు చాలా మందికి తెలియవు. ఈ క్రమంలోనే దీనిపై వైద్య నిపుణులు సమగ్రమైన సమాచారం అందిస్తున్నారు.
ప్రీ డయాబెటిస్ అంటే డయాబెటిస్ రావడానికి ముందు స్టేజి అన్నమాట. ప్రీ డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు మరీ అధికంగా ఉండవు. నిర్దిష్ట మోతాదు కన్నా కాస్త ఎక్కువగా ఉంటాయి. ఈ దశను పట్టించుకోకపోతే డయాబెటిస్ స్టేజిలోకి వెళ్తారు. ఇక అప్పుడు జీవితాంతం మందులను వాడాల్సి ఉంటుంది. కనుకనే ప్రీ డయాబెటిస్‌లో ఉన్నప్పుడే తగిన జాగ్రత్తలను తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. సాధారణంగా ఆరోగ్యవంతులైన వ్యక్తుల రక్తంలో చక్కెర స్థాయిలు ఉదయం ఆహారం తినకముందు 80 నుంచి 110 మధ్య ఉంటాయి. కానీ ప్రీ డయాబెటిస్ ఉన్నవారిలో ఈ స్థాయిలు కాస్త ఎక్కువగా ఉంటాయి. అంటే 110 నుంచి 120 లేదా 130 మధ్య చక్కెర స్థాయిలు ఉంటాయన్నమాట. దీన్ని ప్రీ డయాబెటిస్‌గా వ్యవహరిస్తారు. ఇక తిన్న తరువాత కూడా 140 నుంచి 150 వరకు ఉండాల్సిన చక్కెర స్థాయిలు 160 నుంచి 170 వరకు ఉంటాయి. దీన్ని కూడా ప్రీ డయాబెటిస్ అంటారు.
ప్రీ డయాబెటిస్ ఉన్నవారికి సాధారణంగా వైద్యులు మందులను ఇవ్వరు. కొన్ని రోజుల పాటు డైట్ పాటించాలని, వ్యాయామం చేయాలని చెబుతారు. సాధారణంగా ఈ స్టేజిలో ఉన్నవారు సరైన డైట్‌ను పాటిస్తూ వ్యాయామం చేస్తుంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో డయాబెటిస్ స్టేజికి రాకుండా ముందుగానే అడ్డుకోవచ్చు. మందులను వాడకుండా నివారించవచ్చు. కానీ ప్రస్తుతం చాలా మందికి ప్రీ డయాబెటిస్ స్టేజిలో ఉన్నట్లు కూడా తెలియడం లేదు. కనుకనే 35 ఏళ్ల వయస్సు దాటిన ప్రతి ఒక్కరు కచ్చితంగా సంవత్సరానికి 2 లేదా 3 సార్లు షుగర్ టెస్టులు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. దీని వల్ల ప్రీ డయాబెటిస్ స్టేజిని సులభంగా గుర్తించవచ్చు. అందుకు అనుగుణంగా జాగ్రత్తలను తీసుకుంటే డయాబెటిస్ స్టేజి రాకుండా అడ్డుకోవచ్చు. దీంతో షుగర్ లేని జీవితాన్ని గడపవచ్చు.
అయితే ప్రీ డయాబెటిస్ దశలో ఉన్నవారికి కొందరికి పలు షుగర్ లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. అతిగా దాహం వేయడం, తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం, రాత్రి పూట మూత్ర విసర్జనకు నిద్ర లేవాల్సి రావడం వంటి కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించినా కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే షుగర్ టెస్టు చేయించుకోవాలి. దీంతో ప్రీ డయాబెటిస్ స్టేజిలో ఉన్నదీ లేనిదీ సులభంగా తెలిసిపోతుంది. అందుకు అనుగుణంగా జాగ్రత్తలను పాటిస్తే డయాబెటిస్ రాకుండా అడ్డుకోవచ్చు. ఇక ఈ స్టేజిలో ఉన్నవారు రోజూ ఉదయం పరగడుపునే ఉసిరికాయ జ్యూస్‌ను తాగుతుంటే ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. అలాగే రాత్రి పూట కొవ్వు లేని పాలలో కొద్దిగా పసుపు కలుపుకుని కూడా తాగవచమ్చు. భోజనానికి ముందు ఒక టీస్పూన్ మెంతులను ఉదయం, సాయంత్రం తినాలి. లేదా రాత్రి పూట మెంతులను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపునే తినాలి. ఈ విధంగా ప్రీ డయాబెటిస్ దశలో ఉన్నవారు పలు సూచనలు పాటిస్తే డయాబెటిస్ రాకుండా అడ్డుకోవచ్చు. షుగర్ లేని జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు.