మా బాబుకు ఏడు సంవత్సరాలు. హుషారుగానే ఉంటాడు. కాళ్ల మీద మచ్చలు వస్తే హాస్పిటల్‌కి వెళ్లాం. మా బాబుకు ‘ఇమ్యూన్ థ్రాంబోసైటోపీనిక్ పర్ప్యుర’ (ఐటీపీ) ఉందని నిర్ధారించారు. తనకు జ్వరం వంటి సమస్యలేవీ లేవు. బాగానే ఆడుకుంటున్నాడు. అన్ని పనులూ చేస్తున్నాడు. ఈ మచ్చలు బ్లీడింగ్ అని డాక్టర్ చెప్పారు. అదే తగ్గిపోతుందని భరోసా ఇచ్చారు. రక్తంలో ప్లేట్లెట్స్ సంఖ్య తక్కువగా ఉంటే డెంగ్యూ వంటి ఇన్ఫెక్షన్లు వస్తే ప్రమాదం కదా… ఏం చేయాలి?
డాక్టర్‌కు చూపించారు. పరీక్షలు చేయించారు. వ్యాధి నిర్ధారించారు. మీరు చెప్పే లక్షణాల ప్రకారం.. ఆ సమస్య ఐటీపీ అవ్వడానికే ఆస్కారం ఉంది. మీరు కొన్ని వారాలుగా ఉన్న సమస్య అన్నారు. డెంగ్యూ లాంటి ఇన్ఫెక్షన్లో కూడా రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గుతాయి. జ్వరంతో నీరసపడతారు. క్రమంగా ప్లేట్లెట్స్ తగ్గుతాయి. తర్వాత క్రమంగా పెరుగుతాయి. డెంగ్యూలో వేరే రక్త కణాలు కూడా తగ్గుతాయి. అటువంటి లక్షణాలు ఏవీ ఉన్నట్టు మీరు రాయలేదు. కొన్ని వారాలు ఉంది కాబట్టి కంప్లీట్ బ్లడ్ కౌంట్ చూసి.. అందులో ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి? ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాల సంఖ్య ఎలా ఉందో లెక్కిస్తారు. ఇప్పటికే డాక్టర్‌కు చూపించారు. కాబట్టి ఆ అవసరం లేదు.
దాదాపు తొంభై శాతం మంది పిల్లల్లో ఐటీపీ దానంతట అదే తగ్గిపోతుంది. ఒక పది శాతం మందిలో ఎక్కువ రోజులపాటు… అంటే దాదాపు ఆరు నెలలు దాటి ఉంటుంది. దీనిని ‘క్రానిక్ ఐటీపీ’ అంటారు. చాలామంది పిల్లలకు వైద్యం అవసరం ఉండదు. ప్లేట్లెట్స్ కణాలకు వ్యతిరేకంగా కొన్ని ప్రొటీన్లు మన శరీరంలో తయారవుతాయి. ఆ ప్రొటీన్లు ఏదైనా ఇన్ఫెక్షన్ బారినపడినప్పుడు రక్తంలోని ప్లేట్లెట్స్ని తింటాయి. ఐటీపీ బాధితుల్లో ఉన్న కొద్దిపాటి ప్లేట్లెట్స్ బాగానే పనిచేస్తాయి. ఈ సమస్య ఉన్నప్పుడు తక్కువ పరిమాణంలో రక్తస్రావం (పర్ప్యుర) అవుతుంది. అంతేతప్ప ఇంకేమీ కాదు. కొన్నిసార్లు చిగుళ్ల నుంచి రక్తస్రావం కావొచ్చు. విరేచనంలో కూడా రక్తం పడొచ్చు.
అరుదుగా కొందరిలో అధిక రక్తస్రావం అవుతుంది. ఇది కొంత ప్రమాదకరం. ముక్కులోంచి కూడా బ్లీడింగ్ వస్తుంది. ఇవన్నీ ఐటీపీ సమస్య హెచ్చరికలు. పిల్లలకు ఈ సమస్య ఉంటే బడిలో టీచర్లకు ముందే చెప్పాలి. అకస్మాత్తుగా రక్తస్రావం అయితే చూసుకుంటారు. నొప్పులు నివారించే మందులు వాడకూడదు. అనారోగ్య సమస్యతో డాక్టర్ దగ్గరకు పోయినప్పుడు ఐటీపీ ఉందని ముందుగా చెప్పాలి. ఐటీపీ సమస్య ఆరు నెలలకు పైగా ఉంటే ఎముక మజ్జ (బోన్ మారో) పరీక్ష చేయించాలి. డాక్టర్ చెప్పిన విధంగా చేస్తూ, వైద్యుల సూచనలు పాటిస్తూ ఉండాలి.
– డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్