Flu | సీజన్లు మారినప్పుడు లేదా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి వ్యాప్తి చెందడం కారణంగా చాలా మందికి సహజంగానే దగ్గు, జలుబు వస్తుంటాయి. అలాగే వీటితోపాటు కొందరికి ఫ్లూ కూడా వస్తుంటుంది. దీన్నే ఇన్ఫ్లుయెంజా అని కూడా పిలుస్తారు. ఇది వైరస్ల వ్యాప్తి వల్ల సంభవించే ఒక వ్యాధి. ఎక్కువగా ముక్కు, గొంతు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. ఆయా భాగాలకు వ్యాప్తి చెందుతుంది. దగ్గు, జలుబు రోజుల తరబడి ఉండడం ఫ్లూ ముఖ్యమైన లక్షణాలు. ఫ్లూ అనేది అంటు వ్యాధి. ఒకరి నుంచి మరొకరికి చాలా సులభంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి పెద్దల కన్నా చిన్నారులకు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కనుక తరచూ ఫ్లూ వస్తుంది. అలాగే పెద్దలకు కూడా అప్పుడప్పుడు ఫ్లూ వస్తుంటుంది. ఫ్లూ వస్తే కొందరికి దగ్గు, జలుబుతోపాటు పలు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి.
ఫ్లూ వచ్చిన వారిలో కొందరికి జ్వరం ఉంటుంది. కొందరికి జ్వరం తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుంది. చలిగా ఉన్నట్లు వణుకుతారు. తీవ్రమైన ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు కూడా ఉంటాయి. అలసట, నీరసం ఉంటాయి. గొంతులో మంట, దురద, నొప్పి, ముక్కు కారడం వంటి సమస్యలు కూడా వస్తాయి. తలనొప్పిగా ఉంటుంది. కొందరికి వికారంగా కూడా అనిపిస్తుంది. వాంతికి వచ్చినట్లు ఉంటుంది. ఇవన్నీ ఫ్లూ ఉందని తెలిపే లక్షణాలు. అయితే ఫ్లూ ఉన్నవారు వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. వారు సూచించిన విధంగా క్రమం తప్పకుండా మందులను వాడాలి. అలాగే పలు ఆహారాలను తీసుకుంటూ ఇంటి చిట్కాలను పాటిస్తుంటే ఫ్లూ నుంచి త్వరగా బయట పడవచ్చు. దీని నుంచి త్వరగా కోలుకుని మళ్లీ ఉత్సాహంగా మారుతారు.
ఫ్లూ ఉన్నవారికి ఉప్పు నీరు ఎంతో మేలు చేస్తుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి ఆ నీటిని గొంతులో పోసుకుని పుక్కిలించాలి. రోజుకు ఇలా 3 సార్లు చేస్తుంటే ఉపశమనం లభిస్తుంది. ఫ్లూ సమస్యకు కారణం అయిన వైరస్ నశిస్తుంది. దీని వల్ల గొంతు సమస్యలు, ఛాతి పట్టేయడం తగ్గుతాయి. కఫం కరిగిపోతుంది. ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది. దాల్చిన చెక్క, పుదీనా, నిమ్మ, యూకలిప్టస్ కు చెందిన ఎసెన్షియల్ ఆయిల్స్‌ను వాడుతున్నా ఉపశమనం లభిస్తుంది. ఈ ఆయిల్స్‌లో దేన్నయినా కాస్త తీసుకుని గొంతుపై మర్దనా చేయాలి. ఈ విధంగా చేస్తుంటే శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఫ్లూ తగ్గిపోతుంది. అలాగే జింక్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకుంటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. చేపలు, మాంసం, పప్పు దినుసులు, బీన్స్, సీడ్స్, కోడిగుడ్లను అధికంగా తినాలి. వీటిల్లో ఉండే జింక్ కారణంగా రోగ నిరోధక వ్యవస్థ శక్తివంతంగా మారుతుంది. తెల్ల రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. దీని వల్ల ఫ్లూ సమస్యకు కారణం అయ్యే వైరస్ నశిస్తుంది. దీంత ఫ్లూ నుంచి త్వరగా కోలుకుంటారు.
ఫ్లూ ఉన్నవారు రోజుకు 3 సార్లు తేనెను తీసుకుంటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. తేనెలో సహజసిద్ధమైన యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్‌లను నాశనం చేస్తాయి. కనుక ఫ్లూ ఉన్నవారికి తేనె బాగా పనిచేస్తుంది. ఇందుకు గాను ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా తేనె కలిపి తీసుకోవాలి. ఇలా రోజుకు 3 సార్లు తీసుకుంటే ఉపయోగం ఉంటుంది. అలాగే ఫ్లూ సమస్యకు వెల్లుల్లి కూడా బాగానే పనిచేస్తుంది. పూటకు ఒక వెల్లుల్లి రెబ్బ చొప్పున తింటుంటే ఫలితం ఉంటుంది. వెల్లుల్లిలో ఆల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. కనుక వెల్లుల్లిని తింటే బ్యాక్టీరియా, వైరస్లు నశిస్తాయి. దీంతో ఫ్లూ నుంచి బయట పడవచ్చు. ఇలా ఫ్లూ ఉన్నవారు పలు చిట్కాలను పాటిస్తూ ఆయా ఆహారాలను తీసుకుంటుంటే ఎంతగానో ఉపయోగం ఉంటుంది. దాని నుంచి త్వరగా కోలుకుని ఆరోగ్యంగా ఉంటారు.