COPD | సీవోపీడీ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఈ వ్యాధి వస్తే ఏం చేయాలి..?
నిరంతర దగ్గు, మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆయాసం, శారీరక సామర్థ్యం తగ్గడం వంటి లక్షణాలను చాలామంది కాలుష్యం, వయసు పెరగడం లేదా శారీరక దృఢత్వం లేకపోవడం వల్ల వస్తున్నాయని భావిస్తుంటారు. అయితే ఇవి కొన్నిసార్లు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీవోపీడీ) అనే ఊపిరితిత్తుల వ్యాధికి సంకేతాలు అయ్యే అవకాశం ఉంటుంది.
COPD | నిరంతర దగ్గు, మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆయాసం, శారీరక సామర్థ్యం తగ్గడం వంటి లక్షణాలను చాలామంది కాలుష్యం, వయసు పెరగడం లేదా శారీరక దృఢత్వం లేకపోవడం వల్ల వస్తున్నాయని భావిస్తుంటారు. అయితే ఇవి కొన్నిసార్లు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీవోపీడీ) అనే ఊపిరితిత్తుల వ్యాధికి సంకేతాలు అయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ వ్యాధికి ధూమపానమే ప్రధాన కారణమని భావిస్తారు. కానీ ఎప్పుడూ పొగతాగని వారిలోనూ ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. వాయు కాలుష్యం, ఇంట్లో వంట పొగ, పరిశ్రమల నుంచి వెలువడే రసాయనాలు, దుమ్ము వంటి వాటికి దీర్ఘకాలం గురికావడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. సీవోపీడీ అనేది దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి. దీనివల్ల శ్వాసనాళాల్లో గాలి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. దీర్ఘకాలిక బ్రాంకైటిస్, ఎంఫిసీమా లేదా ఈ రెండు సమస్యలు కలిసి ఉంటాయి.
కారణాలు ఏమిటి..?
వాయు కాలుష్యంలోని సూక్ష్మ ధూళి కణాలకు నిరంతరం గురికావడం వల్ల శ్వాసనాళాల్లో వాపు ఏర్పడి, కాలక్రమేణా ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ట్రాఫిక్ నుంచి వెలువడే పొగ, నిర్మాణ రంగంలోని దుమ్ము, ఇంట్లో వంట సమయంలో వచ్చే పొగ కూడా దీనికి కారణం అవుతాయి. ముఖ్యంగా కట్టెలు, బొగ్గు వంటి ఘన ఇంధనాలతో సరైన గాలి ప్రసరణ లేని ప్రదేశాల్లో వంట చేయడం వల్ల హానికరమైన పొగ ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. నిర్మాణ, గనులు, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల్లో పనిచేసేవారు దుమ్ము, రసాయన వాయువులకు గురయ్యే ప్రమాదం ఎక్కువ. చిన్నతనంలో పదేపదే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు రావడం, ఊపిరితిత్తుల ఎదుగుదల సరిగా లేకపోవడం కూడా భవిష్యత్తులో ఈ వ్యాధి ముప్పును పెంచుతాయి. జన్యుపరమైన ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్ లోపం కూడా సీవోపీడీకి ఒక కారణం అవుతుంది.
లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఈ వ్యాధి నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి చాలామంది ప్రారంభ లక్షణాలను గుర్తించలేరు. మెట్లు ఎక్కినప్పుడు ఆయాసం రావడం, నిరంతర దగ్గు, పిల్లికూతలు, శారీరక సామర్థ్యం తగ్గడం వంటి లక్షణాలను వయసు పెరగడం లేదా బరువు పెరగడం వల్ల వస్తున్నాయని నిర్లక్ష్యం చేస్తుంటారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రాకుండా ఉండేందుకు రోజువారీ పనులను కూడా తగ్గించుకుంటారు. దీనివల్ల కండరాల బలం, వ్యాయామ సామర్థ్యం మరింత తగ్గుతాయి. ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యల లక్షణాలతో సీవోపీడీ లక్షణాలు పోలి ఉండడం వల్ల వ్యాధిని గుర్తించడం కష్టమవుతుంది. ఈ సమస్యను నిర్ధారించేందుకు స్పైరోమెట్రీ అనే శ్వాస పరీక్ష ఉపయోగపడుతుంది. ఈ పరీక్ష ద్వారా ఎంత గాలిని బయటకు వదలగలుగుతున్నారు, ఎంత వేగంగా వదులుతున్నారు అనే విషయాలను తెలుసుకోవచ్చు. వైద్యులు పరీక్ష ఫలితాలను లక్షణాలు, కాలుష్యానికి గురైన చరిత్రతో కలిపి పరిశీలించి వ్యాధిని నిర్ధారిస్తారు.
ఏం చేయాలి..?
సీవోపీడీని ముందుగానే గుర్తిస్తే చికిత్స ప్రారంభించి శ్వాస సంబంధిత ఇబ్బందులను తగ్గించుకోవడంతోపాటు వ్యాధి తీవ్రత పెరగకుండా జాగ్రత్తపడవచ్చు. లక్షణాలు, గతంలో వచ్చిన సమస్యలను బట్టి శ్వాసనాళాలను విస్తరించే ఇన్హేలర్ మందులు, పర్యవేక్షణలో చేసే వ్యాయామాలు, ఊపిరితిత్తుల పునరావాస కార్యక్రమాలు సూచిస్తారు. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శుభ్రమైన వంట ఇంధనాలను ఉపయోగించడం, వంటగదిలో గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవడం, పొగతాగడం, ఇతరులు వదిలే పొగకు దూరంగా ఉండడం అవసరం. దుమ్ము, రసాయనాలతో పనిచేసేవారు తగిన రక్షణ పరికరాలు ఉపయోగించాలి. ఇంట్లో గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు తగిన ఫిల్టర్లు ఉన్న ఎయిర్ ప్యూరిఫైయర్లు ఉపయోగించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, వైద్యుల సూచన మేరకు ఫ్లూ, న్యూమోకాకల్ టీకాలు వేయించుకోవడం కూడా మంచిది. పొగతాగే అలవాటు లేదని సీవోపీడీ రాదని భావించకుండా, నిరంతర దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
COPD | సీవోపీడీ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఈ వ్యాధి వస్తే ఏం చేయాలి..?
Congress | మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ మధ్య ముదురుతున్న వివాదం
Bandi Bhagirath | పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్‌కు సమన్లు జారీ
Dasoju Shravan Kumar | భారత రాజ్యాంగం ప్రశ్నించే హక్కునిస్తుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
Love, Scam Aur Dhokha | మహా మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ జీవితంపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

