Cervical Cancer | రొమ్ము క్యాన్సర్ తర్వాత మహిళలు అధికంగా ఎదుర్కొంటున్న సమస్య గర్భాశయ క్యాన్సర్. ఇది ఎక్కువగా హ్యూమన్ పాపిలోమా వైరస్ ( HPV)తో సంబంధం కలిగి ఉంటుంది. ఎక్కువ కాలం ఈ వైరస్‌ను గుర్తించి నివారించకపోతే ఇది గర్భాశయ క్యాన్సర్‌కు దారి తీస్తుంది. అదే సరైన సమయంలో దీన్ని గుర్తిస్తే గర్భాశయ క్యాన్సర్‌ను సులభంగా నివారించవచ్చు. అయితే ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు వినియోగించాల్సిన వ్యాక్సిన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్లోని ఆంకాలజీ విభాగానికి చెందిన డైరెక్టర్ అండ్ చీఫ్ డాక్టర్ పాలంకి సత్య దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. ఈ గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు ఏంటి? ఎందుకు వస్తుంది? ఎలా నివారించాలనే అంశాలను వివరించారు.
గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్) వద్ద వచ్చే క్యాన్సర్‌ను సర్వైకల్ క్యాన్సర్ అంటారు. సర్విక్స్ అనేది గర్భాశయానికి కింది భాగంలో ఉండే సన్నటి ప్రదేశం. ఇది గర్భాశయానికి ముఖ ద్వారంలా పనిచేస్తుంది. ఇది గర్భాశయాన్ని యోనితో కలిపి ఉంచుతుంది. మిగతా అన్ని క్యాన్సర్లతో పోలిస్తే గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ను సులభంగా నివారించవచ్చు. దీనికోసం స్క్రీనింగ్ చేయించడం దీనికి ఉత్తమ పరిష్కారం. చికిత్స కూడా చాలా సులభం. దీన్ని ఎంత ముందుగా గుర్తిస్తే అంత తేలిగ్గా చికిత్స చేయించవచ్చు.
సర్వైకల్ క్యాన్సర్ ముఖ్యమైన కారణాల్లో హ్యూమన్ పాపిలోమా వైరస్ ( HPV ) ప్రధానమైనది. సగం జనాభా జీవితంలో ఏదో ఓ సందర్భంలో హెచ్‌పీవీ వైరస్ బారిన పడుతుంటారు. కానీ ఇది అందరిలోనూ గర్భాశయ క్యాన్సర్ దారి తీయదు. కొంతమందిలోనే ఇది క్యాన్సర్‌కు కారణమవుతుంది. అవేంటంటే..
* ఈ వైరస్ కలయిక ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. అయితే తక్కువ వయసులో శృంగారంలో పాల్గొనడం మొదలుపెట్టిన మహిళల్లో మొదలుకుని, ఎక్కువమంది భాగస్వాములతో శృంగారంలో పాల్గొనే సందర్భాల్లో హెచ్‌పీవీ వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
* పీరియడ్స్ మధ్య తేలికపాటి రక్తస్రావం లేదా చుక్కలు కనిపించడం
* సాధారణ రుతు రక్తస్రావం కంటే ఎక్కువ లేదా ఎక్కువ సమయం రక్తస్రావం ఉండటం
* మెనోపాజ్ తర్వాత రక్తస్రావం
* పొత్తి కడుపులో నిరంతరంగా నొప్పి
హెచ్‌పీవీ వైరస్ తో పాటు పొగ తాగడం, ఎయిడ్స్, ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం గర్భనిరోధక మాత్రలు వాడటం వంటివి కూడా సర్వైకల్ క్యాన్సర్ కు దారితీస్తాయి.
సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్‌స్మియర్ అనే పరీక్ష చేస్తారు. 21 ఏళ్లు నిండిన మహిళలతో పాటు, శృంగారంలో పాల్గొనడం ప్రారంభించి మూడేళ్లు దాటిన ప్రతి మహిళా క్రమం తప్పకుండా పాప్‌స్మియర్ పరీక్షలు చేయించుకోవాలి.
మన శరీరంలోకి ప్రవేశించిన వైరస్ లేదా బ్యాక్టీరియాను తట్టుకోవడానికి యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతుంటాయి. కానీ హెచ్‌పీవీ వైరస్ విషయంలో మన శరీరం ఎలాంటి యాంటీబాడీస్‌ను తయారు చేయదు. కాబట్టి ఒక్కసారి ఇన్ఫెక్షన్ వస్తే అది జీవితాంతం ఉండిపోతుంది. అలా ఎక్కువ రోజులు దాన్ని గుర్తించకపోతే సర్వైకల్ క్యాన్సర్‌కు దారి తీస్తుంది. కాబట్టి హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఈ వైరస్ నుంచి రక్షణ పొందవచ్చు.
యోని క్యాన్సర్, గర్భాశయం ముఖ ద్వారం వచ్చే క్యాన్సర్లను హెచ్‌పీవీ వ్యాక్సిన్ నివారిస్తుంది. అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సిఫారసు ప్రకారం 11 ఏళ్లు నిండిన ప్రతి ఆడపిల్లకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇప్పించాలి. ఈ వ్యాక్సిన్ 6 నెలల వ్యవధిలో మూడు సార్లు ఇప్పించాలి. దీనివల్ల సర్వైకల్ క్యాన్సర్ ను నివారించవచ్చు.