Snake Venom | పాములు అంటే అందరికీ భయంగానే ఉంటుంది. కొందరు పాము పేరు చెబితేనే ఆమడ దూరం పారిపోతారు. ఇంకా కొందరికి అయితే పాము పేరు చెబితే శరీరంపై ఏదో పాకిన ఫీలింగ్ కలుగుతుంది. విపరీతంగా భయపడిపోతారు. అయితే పాముల్లో అన్ని పాములు విషాన్ని కలిగి ఉండవు. కొన్ని పాములకే విషం ఉంటుంది. విషం ఉండే పాముల్లోనూ కొన్ని ప్రాణాంతకం అయ్యే విషాన్ని కలిగి ఉంటాయి. ఈ క్రమంలోనే పాము విషానికి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. పాము విషం అనేది నిజానికి దాని ఉమ్మి అని చెప్పవచ్చు. పాముల్లో ఉండే ఉమ్మి గ్రంథులు ఉత్పత్తి చేసే ఉమ్మి కొన్ని రసాయనిక ప్రక్రియలకు గురై విషంగా మారుతుంది.
పాము విషంలో కొన్ని వేల రకాలకు చెందిన ప్రోటీన్లు, ఎంజైమ్లు, పెప్టైడ్స్, అణువులు ఉంటాయి. పాము విషం అనేది దాని జాతిని బట్టి కూడా మారుతుంది. అలాగే అందులో ఏర్పడే సమ్మేళనాలు కూడా మారుతాయి. పాము విషం అనేక రకాలుగా ఉంటుంది. కానీ ఏ రకంలో ఉన్న పాము విషం అయినా సరే రెండు రకాలుగా మన శరీరంపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని పాములకు చెందిన విషం మన నాడీ మండల వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. దీన్నే న్యూరో టాక్సిక్ విషం అంటారు. ఇలాంటి పాములు కాటు వేస్తే శరీరంలో ఆ భాగం మొత్తానికి పక్షవాతం వచ్చినట్లు అవుతుంది. అది మెదడుకు చేరితే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ రకమైన విషం శ్వాసకోశ వ్యవస్థపై కూడా ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా తాచు పాము, క్రెయిట్స్ అని పిలవబడే జాతికి చెందిన పాముల్లో ఈ తరహా విషం ఉంటుంది.
కొన్ని రకాల పాములకు చెందిన విషం మన రక్త సంబంధ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. దీంతో అలాంటి పాములు కాటు వేస్తే రక్త నాళాల్లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడుతాయి. రక్త నాళాల కణజాలం డ్యామేజ్ అవుతుంది. దీంతో అంతర్గతంగా తీవ్ర రక్త స్రావం అవుతుంది. నోట్లో నుంచి రక్తం కూడా బయటకు వస్తుంది. దీని వల్ల హార్ట్ ఎటాక్ సంభవించి ప్రాణాలను కోల్పోతారు. వైపర్స్, రాటిల్ స్నేక్స్ అని పిలవబడే పాము జాతులు ఈ రకమైన విషాన్ని కలిగి ఉంటాయి. ఇవే కాకుండా పాము విషంలో ఇంకా కొన్ని రకాలు కూడా ఉంటాయి. పాము కాటు వేయగానే శరీరంలోని కణాలపై ప్రభావం పడి మరణం సంభవిస్తే అలాంటి పాము విషాన్ని సైటో టాక్సిన్ అంటారు. శరీరంలోని ఏదైనా కండరానికి చెందిన కణజాలాన్ని లక్ష్యంగా చేసుకుని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తే అలాంటి పాము విషాన్ని మయో టాక్సిన్ అంటారు. కార్డియో టాక్సిన్ అనే రకానికి చెందిన విషాన్ని కలిగిన పాములు కూడా అరుదుగా ఉంటాయి. ఈ విషం నేరుగా గుండెపై ప్రభావం చూపిస్తుంది. దీంతో పాము కాటు వేసిన కొన్ని సెకన్లలోనే మరణం సంభవిస్తుంది.
పాము విషంలో అత్యంత దృఢమైన ఎంజైమ్లు ఉంటాయి. ఇవి ఎంత పటిష్టమైనవి అంటే.. పాము ఏదైనా జీవిని మింగగానే నమిలే పని ఉండదు. నేరుగా ఈ విషంలోని ఎంజైమ్లే ఆ జీవిని జీర్ణం చేయడం మొదలుపెడతాయి. కనుకనే పాములకు దంతాలు ఉండవు. కేవలం కాటు వేసేందుకు పనిచేసే కోరలు మాత్రమే ఉంటాయి. పాము విషంలోని ఎంజైమ్లు ఎలాంటి జీవిని అయినా సులభంగా జీర్ణం చేయగలవు. కొన్ని సందర్భాల్లో పాములు కాటు వేసినప్పటికీ విషం బయటకు రాదు. దాని గ్రంథుల్లో సరైన మోతాదులో విషం లేకపోతే ఇలా జరుగుతుంది. ఇక పాము విషాన్ని హైబీపీని తగ్గించే మందులు, బ్లడ్ క్లాట్స్, హార్ట్ స్ట్రోక్స్ నివారించే ముందులు, నొప్పి నివారణ మందుల తయారీలో ఉపయోగిస్తారు. అయితే పాము విషాన్ని మింగితే ఏమవుతుంది.. అన్న సందేహం కూడా చాలా మందికి ఉంటుంది. పాము విషాన్ని మింగడం కన్నా కాటు వేసినప్పుడే దాని విషం మనకు మరింత ప్రమాదమవుతుంది. విషం నేరుగా రక్త నాళాల ద్వారా లోపలికి చేరితే ప్రమాదం. మింగితే ప్రమాదం కాదు. కానీ విషం విషమే. లోపలికి మింగినంత మాత్రాన పాము విషం మనకు ఎలాంటి హాని చేయదు అని భావించకూడదు.