Hiccups | మనకు వెక్కిళ్లు అనేవి సహజంగానే అప్పుడప్పుడు వస్తుంటాయి. సాధారణంగా భోజనం చేసే సమయంలో వెక్కిళ్లు రావడాన్ని మనం గమనించవచ్చు. కొందరు వేగంగా భోజనం చేసినప్నుడు లేదా భోజనం చేస్తూ ఎక్కువగా మాట్లాడుతున్నా, నీళ్లను టైముకు తాగకపోయినా కూడా వెక్కిళ్లు వస్తుంటాయి. ఇవి వచ్చేందుకు ప్రత్యేకంగా కారణాలు అంటూ ఏమీ ఉండవు. కానీ కొన్ని సార్లు వెక్కిళ్లు వస్తే వాటంతట అవే పోతాయి. కొన్ని సార్లు మాత్రం 48 గంటలకు పైగానే ఉంటాయి. శీతల పానీయాలను తాగేవారికి, మద్యం ఎక్కువగా సేవించే వారికి, ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉన్నవారికి, ఉష్ణోగ్రత సడెన్‌గా మారినప్పుడు, గాలిని బాగా పీల్చుకున్నప్పుడు, కారం, మసాలాలు ఉన్న ఆహారాలను అధికంగా తింటే వెక్కిళ్లు వస్తుంటాయి.
వెక్కిళ్లు వచ్చినప్పుడు సాధారణంగా చాలా మంది నీళ్లను తాగుతారు. కొన్ని సార్లు 48 గంటలు గడిచినా వెక్కిళ్లు తగ్గవు. అలాంటి సందర్భాల్లో కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాలి. లేదంటే నాడీ మండల వ్యవస్థపై ప్రభావం పడుతుంది. నాడులు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొందరికి గొంతులోకి వెంట్రుకలు లేదా ఇతర వస్తువులు వెళ్లినప్పుడు వెక్కిళ్లు వస్తాయి. ట్యూమర్లు, కొవ్వు కణతులు ఉన్నా, తీవ్రమైన గ్యాస్ సమస్య ఉన్నా, గొంతులో గర గర, నొప్పి, మంట ఉన్నా వెక్కిళ్లు వస్తుంటాయి. డయాబెటిస్ ఉన్నవారిలో, ఎలక్ట్రోలైట్స్ అసమతుల్యత ఏర్పడినప్పుడు, కిడ్నీ వ్యాధులు ఉన్నవారిలోనూ వెక్కిళ్లు సాధారణంగా తరచూ వస్తూనే ఉంటాయి.
వెక్కిళ్లు వచ్చినప్పుడు కొందరు వెంట వెంటనే నీళ్లను తాగుతారు. ఇలా తాగితే వెక్కిళ్లు తగ్గవు సరికదా ఇంకా ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. వెక్కిళ్లు వచ్చినప్పుడు నీళ్లను చిన్న సిప్లా తాగి లోపలి నుంచి వచ్చే గ్యాస్‌ను వెంటనే నోటి ద్వారా త్రేన్పు రూపంలో బయటకు తీయాలి. దీంతో వెక్కిళ్లు వెంటనే తగ్గిపోతాయి. అంతేకానీ నీళ్లను వెంట వెంటనే తాగకూడదు. అలాగే ఒక పేపర్ బ్యాగ్‌ను తీసుకుని మీ నోటి చుట్టూ దాన్ని బిగించి అందులోకి గాలిని వదులుతూ పీలుస్తూ ఉండాలి. ఇలా చేస్తున్నా కూడా వెక్కిళ్లను తగ్గించుకోవచ్చు. వెక్కిళ్లు వచ్చినవారు వెంట వెంటనే శ్వాస తీసుకోకూడదు. నెమ్మదిగా గాలి పీల్చి వదులుతూ ఉండాలి. 1 నుంచి 5 వరకు లెక్క పెడుతూ గాలి పీల్చాలి. మళ్లీ అలాగే లెక్క పెడుతూ గాలిని వదలాలి. ఇలా చేస్తున్నా కూడా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
నేలపై కూర్చుని మీ మోకాళ్లను ఛాతి వరకు తేవాలి. అందుకు అవసరం అయితే కాస్త ముందుకు వంగాలి. ఇలా చేస్తున్నా కూడా వెక్కిళ్లను తగ్గించుకోవచ్చు. అలాగే చల్లని నీళ్లను తాగితే వేగస్ నాడి యాక్టివేట్ అవుతుంది. ఇది వెక్కిళ్లు తగ్గేలా చేస్తుంది. గొంతులో ఐస్ నీళ్లను పోసి పుక్కిలిస్తున్నా కూడా ఈ సమస్య తగ్గుతుంది. వెక్కిళ్లు బాగా వస్తున్నప్పుడు చక్కెర కూడా పనిచేస్తుంది. నోట్లో కాస్త చక్కెర వేసుకుని తింటున్నా కూడా వెక్కిళ్లను తగ్గించుకోవచ్చు. నిమ్మరసాన్ని చప్పరిస్తుంటే గొంతులో ఉండే నాడులు ఉత్తేజితం అవుతాయి. ఇవి వెక్కిళ్లను తగ్గించేందుకు సహాయం చేస్తాయి. పావు టీస్పూన్ వెనిగర్‌ను తీసుకుని చప్పరిస్తున్నా కూడా వెక్కిళ్లను తగ్గించుకోవచ్చు. వెక్కిళ్లు మనకు వచ్చే అతి సాధారణ సమస్యే అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇవి ప్రాణాంతకం అవుతాయి. కనుక 48 గంటలకు మించి ఇవి ఉంటే మాత్రం కచ్చితంగా డాక్టర్‌ను కలవాల్సి ఉంటుంది.