Bitter Gourd | కాకరకాయలు చేదుగా ఉంటాయి కనుక చాలా మంది వీటిని తినేందుకు అంతగా ఇష్టపడరు. కానీ ఇవి అందించే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం అద్భుతమనే చెప్పాలి. కాకరకాయలను ఆయుర్వేదంలో అనేక ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. కాకరకాయలను తరచూ తింటున్నా లేదా వాటి రసం తాగుతున్నా అనేక లాభాలు కలుగుతాయి. పలు వ్యాధులను నయం చేసుకునేందుకు కూడా కాకర కాయలను తినాలని ఆయుర్వేద వైద్యులు సూచిస్తుంటారు. కేవలం మన దేశంలోనే కాక ఆఫ్రికా, కరేబియన్ దేశాలకు చెందిన ప్రజలు కూడా కాకర కాయలను తింటుంటారు. కాకరకాయలను తరచూ తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. వీటిల్లో అనేక విటమిన్లు, మినరల్స్, బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
కాకరకాయలను తినడం వల్ల శరీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉపయోగించుకుంటుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. కాకరకాయల్లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అధికంగా బరువు ఉన్నవారు తరచూ కాకరకాయలను తింటుంటే ఫలితం ఉంటుంది. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు సైతం అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీని వల్ల శరీరంలోని వాపులు తగ్గుతాయి. ముఖ్యంగా గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
కాకరకాయల్లో అధికంగా ఉండే ఫైబర్ కారణంగా జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మలబద్దకం తగ్గుతుంది. జీర్ణాశయ ఎంజైమ్‌ల ఉత్పత్తి మెరుగు పడుతుంది. దీంతో జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది. లివర్ ఆరోగ్యానికి కాకరకాయ ఎంతో మేలు చేస్తుంది. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్ ను డ్యామేజ్ అవకుండా రక్షిస్తాయి. లివర్‌లో ఉన్న వ్యర్థాలను బయటకు పంపుతాయి. దీంతో లివర్ శుభ్రంగా మారి ఆరోగ్యంగా ఉంటుంది. ఫ్యాటీ లివర్ ఉన్నవారికి కాకరకాయలు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. దీని వల్ల శరీరం ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది.
కాకరకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ మైక్రోబియల్ గుణాలను కలిగి ఉంటాయి. కనుక కాకరకాయలను తింటున్నా లేదా వాటి జ్యూస్‌ను రోజూ తాగుతున్నా రక్తశుద్ధి జరుగుతుంది. దీంతో చర్మం ఆరోగ్యంగా మారి సురక్షితంగా ఉంటుంది. ముఖ్యంగా మొటిమలు, గజ్జి, తామర వంటి చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఇక కాకరకాయ ఆరోగ్యకరమే అయినప్పటికీ కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తినకూడదు. లో షుగర్ సమస్యతో బాధపడుతున్నవారు, వికారం, వాంతులు వంటి సమస్యలు ఉన్నవారు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, శస్త్ర చికిత్స చేయించుకోబోతున్న వారు, చేయించుకున్నవారు కాకరకాయలను తినకూడదు. ఇలా పలు జాగ్రత్తలను పాటిస్తూ వీటిని తింటే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.