Milk Rice | భారతీయులు అనేక రకాల వంటకాలను వివిధ రకాల పేర్లతో పిలుస్తుంటారు. ఒకే వంటకాన్ని కొందరు ఒక పేరుతో పిలిస్తే మరికొందరు ఇంకో పేరుతో పిలుస్తారు. వాటిని వండే విధానం కూడా దాదాపుగా ఒకేలా ఉంటుంది. ఉదాహరణకు వస్తే బిర్యానీని అన్ని రాష్ట్రాల వారు వండుతారు. కానీ ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీ చాలా పేరుగాంచింది. అయితే తెలుగు రాష్ట్రాల ప్రజలు వండుకునే వంటకం కూడా ఒకటి ఉంది. అదే పాలన్నం. దీన్నే క్షీరాన్నం లేదా పాలబువ్వ అని కూడా పిలుస్తారు. కొందరు అన్నంలో పాలను కలిపి కాస్త చక్కెర వేసి కలిపి తింటారు. కొందరు దీన్ని పోపు వేసి తింటారు. ఇంకొందరు డ్రై ఫ్రూట్స్ వంటివి కలిపి తింటారు. అయితే ఎలా తిన్నా ఈ అన్నంతో లాభాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
పాలన్నంను కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా భారతీయులు, పలు ఇతర దేశాలకు చెందిన వారు కూడా తింటుంటారు. కాకపోతే వండే విధానం వేరుగా ఉంటుంది. పాలన్నంలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. పాలన్నంలో కార్బొహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. నీరసం, అలసట ఉన్నవారు, జ్వరం నుంచి కోలుకుంటున్న వారు పాలన్నంను తింటే చురుగ్గా మారుతారు. ఉత్సాహంగా పనిచేస్తారు. అన్నంలో క్యాల్షియం, విటమిన్ డి, విటమిన్ బి12, ప్రోటీన్లు తదితర పోషకాలు అధికంగా ఉంటాయి. సాధారణ అన్నంలో పోషకాలు స్వల్పంగా ఉంటాయి. కానీ పాలతో కలిపి అన్నాన్ని తింటే అనేక పోషకాలను పొందవచ్చు. ముఖ్యంగా అనేక బి విటమిన్లు లభిస్తాయి. ఈ అన్నాన్ని తింటే ఐరన్, ఫైబర్ వంటి పోషకాలను కూడా పొందవచ్చు.
పాలన్నాన్ని తింటే తేలిగ్గా జీర్ణమవుతాయి. జీర్ణ సమస్యలు ఉన్నవారు పథ్యం చేస్తుంటే ఈ అన్నాన్ని తింటే మేలు జరుగుతుంది. ఆ సమస్యల నుంచి త్వరగా కోలుకుంటారు. పొట్టలో ఉండే అసౌకర్యం తొలగిపోతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఈ అన్నంలో క్యాల్షియం, విటమిన్ డి అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతాయి. వృద్ధాప్యంలో ఆస్టియో పోరోసిస్ వంటి ఎముకల సంబంధిత సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. పాలన్నాన్ని రాత్రి పూట తింటే మైండ్ రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గి నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి తగ్గుతుంది.
పాలన్నాన్ని సాధారణంగా ఎవరైనా తినవచ్చు. కానీ పాలు అంటే అలర్జీ ఉన్నవారు, పాలు సరిగ్గా జీర్ణం కాని వారు అలా అన్నాన్ని తినకపోవడమే మంచిది. డయాబెటిస్ ఉన్నవారు పాలన్నాన్ని తింటే అందులో చక్కెర కలపకూడదు. లేదా బ్రౌన్ రైస్‌తో తినాలి. అధికంగా బరువు ఉన్నవారు కొవ్వు తీసిన పాలతో పాలన్నాన్ని తయారు చేసి తింటే మంచిది. దీని వల్ల బరువు పెరగకుండా ఉంటారు. ఇక పాలన్నాన్ని రోజులో ఏ సమయంలో అయినా సరే తినవచ్చు. దీనికి ప్రత్యేకంగా సమయం అంటూ ఉండదు. కానీ నిద్రలేమి ఉన్నవారు రాత్రి పూట తింటే మంచిది. ఉదయం నీరసంగా ఉందని భావించే వారు దీన్ని బ్రేక్ ఫాస్ట్‌గా తినవచ్చు. దీంతో శరీరానికి తక్షణ శక్తి లభించి ఉత్సాహంగా మారుతారు. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. ఇలా పాలన్నాన్ని తింటే అనేక లాభాలను పొందవచ్చు.