Dry Coconut | ఎండు కొబ్బరిని మనం తరచూ వంటల్లో వేస్తుంటాం. దీంతో కూరలు చక్కని రుచి, రంగును కలిగి ఉంటాయి. ఎండు కొబ్బరిని స్వీట్ల తయారీలోనూ ఉపయోగిస్తుంటారు. ఎండు కొబ్బరితో తయారు చేసే స్వీట్లు ఎంతో రుచిగా ఉంటాయి. ఎండు కొబ్బరిలో అనేక ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి మనకు అనేక లాభాలను అందిస్తాయి. ఈ కొబ్బరిలో ఫైబర్, మినరల్స్ కూడా ఉంటాయి. దీని వల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది. ఎండు కొబ్బరిలో మీడియం చెయిన్ ట్రై గ్లిజరైడ్స్ (MCTs) ఉంటాయి. ఇవి మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. రోజూ ఎండు కొబ్బరిని నేరుగా కూడా తినవచ్చు. దీంతో అనేక లాభాలను పొందవచ్చు. ఎండు కొబ్బరిని తినడం వల్ల అందులో ఉండే లారిక్ యాసిడ్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఎండు కొబ్బరిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల దీన్ని తింటే రోజూ మనకు కావల్సిన ఫైబర్ సులభంగా లభిస్తుంది. దీని వల్ల మలబద్దకం తగ్గుతుంది. ఎండు కొబ్బరి ప్రీ బయోటిక్ ఆహారంగా పనిచేస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది. దీని వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఎండుకొబ్బరిలో ఉండే ఎంసీటీలు లివర్‌లో శక్తిగా మార్చబడతాయి. కనుక దీన్ని తింటే శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. శరీర మెటబాలిజం పెరుగుతుంది. శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసేవారు, అథ్లెట్లకు మేలు జరుగుతుంది. ఎంత పనిచేసినా అలసట, నీరసం రావు. శరీరంలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. ఎండు కొబ్బరిలో అనేక రకాల మినరల్స్ ఉంటాయి. ఇందులో ఉండే మాంగనీస్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మెటబాలిజం పెరిగేలా చేస్తుంది.
ఎండు కొబ్బరిలో అధికంగా ఉండే కాపర్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎర్ర రక్త కణాలు నిర్మాణం అయ్యేలా చేస్తుంది. మనం తిన్న ఆహారాల్లో ఉండే ఐరన్‌ను శరీరం శోషించుకునేలా చేస్తుంది. దీంతో రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. ఎండు కొబ్బరిలో ఉండే ఐరన్ మనల్ని ఉల్లాసంగా మార్చి ఉత్తేజంగా ఉండేలా చేస్తుంది. నీరసం, అలసటను తగ్గిస్తుంది. ఎండు కొబ్బరిలో సమృద్ధిగా ఉండే ఫైబర్ వల్ల మనం తిన్న ఆహారంలో ఉండే పిండి పదార్థాలు రక్తంలో నెమ్మదిగా గ్లూకోజ్‌గా మారుతాయి. దీని వల్ల షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఇలా ఎండు కొబ్బరిని తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.
ఎండు కొబ్బరి ఆరోగ్యకరమే అయినప్పటికీ దీన్ని రోజూ మోతాదులోనే తినాల్సి ఉంటుంది. రోజుకు 2 టేబుల్ స్పూన్ల వరకు అంటే 15 నుంచి 30 గ్రాముల మేర తినవచ్చు. దీన్ని బెల్లంతో కలిపి తింటే ఇంకా మంచిది. దీని వల్ల పోషకాలను అధికంగా పొందవచ్చు. తురిమిన ఎండుకొబ్బరిలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. కనుక ఎండు కొబ్బరిని తినదలిస్తే నేరుగా తింటేనే మంచిది. ఎండు కొబ్బరిలో శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతున్న ప్రకారం మనకు రోజుకు లభించే క్యాలరీల్లో 5 శాతం వరకు క్యాలరీలు మాత్రమే శాచురేటెడ్ కొవ్వుల ద్వారా లభించాలి. కనుక కొలెస్ట్రాల్ లేదా గుండె జబ్బులు ఉన్నవారు డాక్టర్ సూచన మేరకు మాత్రమే ఎండు కొబ్బరిని తినాల్సి ఉంటుంది. ఎండు కొబ్బరిని ఎట్టి పరిస్థితిలోనూ చక్కెరతో కలిపి తినకూడదు.