Piles | పైల్స్.. వీటినే హెమరాయిడ్స్ అని కూడా అంటారు. ఇవి రెండు రకాలుగా ఏర్పడుతాయి. బయటకు తెరుచుకుని వచ్చే పైల్స్ ఒక రకం కాగా లోపలి నుంచి ఏర్పడే పైల్స్. ఏవి ఏర్పడినా పైల్స్ సమస్య వస్తే మాత్రం చాలా ఇబ్బందిగా, అసౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా కూర్చునేందుకు చాలా అవస్థ పడతారు. అలాగే విరేచనం సమయంలోనూ నరకం కనిపిస్తుంది. పైల్స్ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. మలబద్దకం, టాయిలెట్లో ఎక్కువ సేపు కూర్చుని ఉండడం (ఫోన్ పట్టుకుని), ఫైబర్ లేని ఆహారాలను అధికంగా తినడం, స్థూలకాయం, గర్భంతో ఉన్న మహిళల్లో, ఎక్కువ సేపు కూర్చుని ఉండే పని చేయడం, వయస్పు మీద పడడం, అధికంగా బరువులు ఎత్తే పనులు చేయడం, అసహజ రీతిలో శృంగారం రేయడం, జన్యు సంబంధ సమస్యలు, టాయిలెట్ సరిగ్గా వెళ్లకపోవడం లేదా ఎక్కువ సేపు ఆపుకోవడం.. ఇవన్నీ పైల్స్ వచ్చేందుకు కారణం అవుతాయి.
పైల్స్ ఏ వయస్సులో ఉన్న వారికైనా వస్తాయి. పైల్స్ వస్తే డాక్టర్లు ఇచ్చే మందులను క్రమం తప్పకుండా వాడాలి. అలాగే కొన్ని రకాల ఇంటి చిట్కాలను పాటిస్తున్నా కూడా పైల్స్ నుంచి సత్వరమే ఉపశమనం లభిస్తుంది. పసుపులో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి పైల్స్‌ను తగ్గించడంలో సహాయం చేస్తాయి. రాత్రి పూట పాలలో పసుపు కలిపి తాగవచ్చు లేదా గోరు వెచ్చని నీటిలోనూ పసుపు కలిపి తీసుకోవచ్చు. ఆహారంలో నెయ్యిని చేర్చుకోవడం వల్ల పైల్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్దకాన్ని తగ్గించే శక్తి నెయ్యికి ఉంటుంది. నెయ్యిని రోజూ ఒక టీస్పూన్ మోతాదులో వాడుతుంటే అన్ని రకాల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. టీ ట్రీ ఆయిల్లో యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. టీ ట్రీ ఆయిల్‌ను కొద్దిగా తీసుకుని అందులో కాస్త కొబ్బరినూనె వేసి కలిపి రాత్రి పూట పైల్స్ ఉన్న చోట రాస్తుండాలి. ఇలా రోజూ చేస్తుంటే ఎంతగానో ఉపశమనం లభిస్తుంది.
రోజూ ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కాస్త తేనె కలిపి రాత్రి పూట నిద్రకు ముందు సేవించాలి. లేదా రాత్రి పూట ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనెలను ఏదైనా ఒకటి తీసుకుని ఒక టీస్పూన్ మోతాదులో సేవించాలి. ఇలా రోజూ చేస్తుంటే పైల్స్ బాధ నుంచి బయట పడవచ్చు. పైల్స్‌ను తగ్గించేందుకు కలబంద కూడా ఎంతగానో పనిచేస్తుంది. కలబంద రసాన్ని రోజూ ఉదయం పరగడుపున 30 ఎంఎల్ మోతాదులో సేవిస్తుంటే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తింటుండాలి. తాజా పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, పప్పు దినుసులను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవన్నీ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. పైల్స్ తగ్గేందుకు దోహదం చేస్తాయి.
నీళ్లను అధికంగా తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. రోజుకు కనీసం 2 లీటర్ల నీళ్లను అయినా తాగాలి. దీంతో మలబద్దకం తగ్గుతంది. పేగుల్లో మలం కదలికలు సరిగ్గా ఉంటాయి. విరేచనం సాఫీగా అవుతుంది. గంటల తరబడి కూర్చుని పనిచేసేవారు మధ్య మధ్యలో కాసేపు పనికి విరామం ఇచ్చి నిలబడాలి. లేదా కాస్త వాకింగ్ అయినా చేయాలి. టాయిలెట్లోకి ఎట్టి పరిస్థితిలోనూ ఫోన్‌ను తీసుకెళ్లకూడదు. దీని వల్ల గంటల తరబడి అందులో ఉంటారు. ఇది పైల్స్ వచ్చేందుకు ముఖ్య కారణం అవుతుంది. అధికంగా బరువు ఉన్నవారు బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. దీంతో కూడా పైల్స్ నుంచి బయట పడవచ్చు. ఇలా పలు చిట్కాలను పాటిస్తూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరిస్తుంటే పైల్స్ సమస్య నుంచి త్వరగా విముక్తులు అవుతారు.