Pro Biotic Foods | మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవ్వాలన్నా, జీర్ణ సమస్యలు లేకుండా ఉండాలన్నా జీర్ణ వ్యవస్థ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా లేకపోతే కేవలం జీర్ణ సమస్యలు మాత్రమే కాకుండా పలు ఇతర వ్యాధులు కూడా వస్తాయి. మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవకపోతే అజీర్తి వస్తుంది. అంతేకాకుండా ఆహారం కొవ్వుగా మారి పేరుకుపోతుంది. దీంతో అధిక బరువు పెరుగుతారు. ఇలా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం ఇతర వ్యాధుల వ్యాప్తికి కూడా అనుసంధానమై ఉంటుంది. కనుక జీర్ణ వ్యవస్థను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అయితే అందుకు మంచి బ్యాక్టీరియా ఎంతో మేలు చేస్తుంది. మన జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా రెండూ ఉంటాయి. కానీ మనం తినే పలు ఆహారాల వల్ల వీటి స్థాయిలు మారుతాయి. ఈ క్రమంలోనే చెడు బ్యాక్టీరియా తగ్గాలన్నా, మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందాలన్నా పలు ఆహారాలను మనం రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.
పాలు లేదా పాల ఉత్పత్తులను ప్రో బయోటిక్ ఫుడ్స్‌గా చెబుతారు. వీటిని రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చేయవచ్చు. రోజూ భోజనం చివర్లో పెరుగు తింటుండాలి. లేదా మజ్జిగను సైతం తాగవచ్చు. అలాగే రోజూ రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలను తాగాలి. ఉదయం పరగడుపునే ఒక టీస్పూన్ నెయ్యిని తినాలి. ఈ విధంగా ఆయా ఆహారాలను తీసుకుంటుంటే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీంతో జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే పులిసిన ఆహారాలను తీసుకుంటున్నా ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా ఇడ్లీలు, దోశలకు పెట్టే పిండి పులిసేలా చూడాలి. అలాంటి పిండితో తయారు చేసిన ఆహారాలను తింటున్నా కూడా మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చేయవచ్చు. అలాగే సోయా ఉత్పత్తులు, ఊరగాయలు, కొంబుచా టీ వంటి ఆహారాలను రోజూ తీసుకుంటున్నా కూడా మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది.
మంచి బ్యాక్టీరియాను వృద్ధి చెందించే ఆహారాలను ప్రొ బయోటిక్ ఫుడ్స్‌గా పిలుస్తారు. ఇవి కేవలం జీర్ణ వ్యవస్థకు మాత్రమే కాకుండా ఇతర అవయవాలకు కూడా లాభాలను అందిస్తాయి. ప్రొ బయోటిక్ ఆహారాలను తింటుంటే అధిక బరువును చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. అలాగే రోగ నిరోధక శక్తి సైతం పెరుగుతుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థలో ఉండే అల్సర్లు నయం అవుతాయి. కడుపులో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. పేగులకు ఉండే ఇన్ఫెక్షన్లను సైతం తగ్గించుకోవచ్చు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ ఆహారాలను రోజూ తీసుకుంటుంటే ఎంతగానో మేలు జరుగుతుంది.
ప్రొ బయోటిక్ ఆహారాలను తీసుకోవడం వల్ల హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న వారిలో మంటను తగ్గించుకోవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఈ విషయాలను సైంటిస్టులు ఒక అధ్యయనంలో వెల్లడించారు. ప్రొ బయోటిక్ ఆహారాలను తీసుకోవడం వల్ల అంటు వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. రోగాల నుంచి త్వరగా కోలుకుంటారు. ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గుతాయి. మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. ముఖ్యంగా విటమిన్ ఇ, ఐరన్, సెలీనియం వంటి పోషకాలను శరీరం సరిగ్గా గ్రహిస్తుంది. దీంతో రక్తహీనత తగ్గుతుంది. ఇలా ప్రొ బయోటిక్ ఆహారాలు మనకు ఎంతో మేలు చేస్తాయి. కనుక వీటిని రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.