Happy Hormones | మన శరీరంలో అనేక రకాల హార్మోన్లు తరచూ ఉత్పత్తి అవుతుంటాయి. పలు రకాల గంథ్రులు లేదా అవయవాలు ఈ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంటాయి. హార్మోన్ల వల్ల మన శరీరంలో జీవక్రియలు సరిగ్గా నిర్వహించబడతాయి. మనకు ఆకలి అవడం, ఒత్తిడి, ఆందోళనగా అనిపించడం, సంతోషంగా ఉండడం, నిద్ర రావడం వంటి అనేక రకాల జీవక్రియలు, భావోద్వేగాలకు హార్మోన్లు కీలకంగా పనిచేస్తాయి. మన శరీరం సక్రమంగా పనిచేయాలన్నా అందుకు హార్మోన్లు అవసరం అవుతాయి. కొన్ని రకాల హార్మోన్లు మన మూడ్‌ను మారుస్తాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గేలా చేస్తాయి. ఇవి మనకు సంతోషాన్ని కలిగిస్తాయి. మనల్ని పాజిటివ్‌గా ఆలోచించేలా చేస్తాయి. వీటినే హ్యాప్పీ హార్మోన్లు అంటారు. అయితే ఈ హార్మోన్లు తగినంత స్థాయిలో ఉత్పత్తి అయితేనే మనం ఎల్లప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా ఉంటాం. హ్యాప్పీ హార్మోన్లు తగినంత ఉత్పత్తి అవకపోతే అప్పుడు మనం ఒత్తిడి, ఆందోళనను ఎదుర్కొంటాం.
హ్యాప్పీ హార్మోన్లు సరిగ్గా ఉత్పత్తి అయ్యేందుకు గాను అనేక అంశాలు దోహదం చేస్తాయి. సరైన ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం, వేళకు నిద్రించడం, మీకున్న హాబీలను రోజూ అనుసరించడం, ప్రకృతిలో కాసేపు గడపడం వంటివన్నీ హ్యాప్పీ హార్మోన్లు ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. ఇక హ్యాప్పీ హార్మోన్లలో డోపమైన్ కూడా ఒకటి. దీన్నే ఫీల్ గుడ్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఇది నేరుగా మెదడుతో అనుసంధానమై పనిచేస్తుంది. డోపమైన్ స్థాయిలు అధికంగా ఉంటేనే మనం సంతోషంగా ఉంటాం. కనుక ఈ హార్మోన్ మన శరీరంలో ఎల్లప్పుడూ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇందుకు గాను రోజూ శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. అలాగే కచ్చితంగా తగినంత నిద్ర కూడా రోజూ ఉండాలి. రోజూ శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి. దీని వల్ల శరీరంలో డోపమైన్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో ఒత్తిడి, ఆందోళన తగ్గి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. సంతోషంగా ఉంటారు.
ఇక హ్యాప్పీ హార్మోన్లలో సెరొటోనిన్ కూడా ఒకటి. దీన్ని సహజసిద్ధమైన యాంటీ డిప్రెసెంట్‌గా పిలుస్తారు. అంటే డిప్రెషన్ బారిన పడిన వారు ఈ హార్మోన్ పెరిగేలా చూసుకుంటే చాలు, దాంతో డిప్రెషన్ తగ్గిపోతుంది. సెరొటోనిన్ జీర్ణ వ్యవస్థకు అనుసంధానమై పనిచేస్తుంది. మనం తినే ఆహారాల ద్వారా సెరొటోనిన్ ఉత్పత్తి అయ్యేలా చేసుకోవచ్చు. కనుక డిప్రెషన్ తగ్గాలంటే సెరొటోనిన్‌ను పెంచే ఆహారాలను తినాల్సి ఉంటుంది. వ్యాయామం చేయడం వల్ల కూడా సెరొటోనిన్ ఉత్పత్తి అవుతుంది. పాలు, నెయ్యి, నట్స్, పప్పు దినుసులు వంటి ఆహారాలను తీసుకుంటుంటే ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు లభిస్తాయి. ఇవి సెరొటోనిన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. దీని వల్ల మూడ్ మారుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు.
అలాగే ఆక్సిటోసిన్ అనే హార్మోన్‌ను కూడా హ్యాప్పీ హార్మోన్ అని పిలుస్తారు. దీన్ని లవ్ హార్మోన్ అని కూడా అంటారు. ఇది మనుషుల మధ్య చక్కని సంబంధాలను పెంచేందుకు సహాయం చేస్తుంది. ఇది భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. తల్లిదండ్రులు, పిల్లలకు, భార్యాభర్తలకు, ప్రేమికులకు మధ్య అనురాగం, ఆప్యాయత ఏర్పడేలా చేస్తుంది. ఆక్సిటోసిన్ ఎక్కువగా ఉంటే కుటుంబంలో అందరితోనూ సంతోషంగా ఉంటారు. ఎలాంటి గొడవలకు వెళ్లరు. సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆక్సిటోసిన్ పెరగాలంటే రోజూ వ్యాయామం చేయాలి. కుటుంబ సభ్యులు లేదా ఆత్మీయులు, బంధువులు, స్నేహితులతో రోజూ కాసేపు గడపాలి. దీని వల్ల ఈ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. మనుషుల మధ్య బంధాలు మెరుగు పడతాయి. అదేవిధంగా ఎండార్ఫిన్స్ అనే హార్మోన్లను కూడా హ్యాప్పీ హార్మోన్లని అంటారు. మన శరీరం తీవ్రమైన ఒత్తిడి, నొప్పులను ఎదుర్కొంటుంటే అవి తగ్గేందుకు గాను ఎండార్ఫిన్స్ అవసరం అవుతాయి. ఎండార్ఫిన్స్ సరిగ్గా ఉత్పత్తి అయితనే మనకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఎండార్ఫిన్స్ అధికంగా ఉండే వారిలో ఆత్మ విశ్వాసం కూడా ఎక్కువగానే ఉంటుంది. రోజూ బాగా నవ్వడం, ఇష్టమైన ఆహారం తినడం, ధ్యానం చేయడం, మసాజ్ చేసుకోవడం వంటివి చేయడం ద్వారా శరీరంలో ఎండార్ఫిన్లను ఉత్పత్తి అయ్యేలా చేయవచ్చు. ఇలా ఆయా హాప్పీ హార్మోన్లను ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేసుకుంటే సంతోషంగా, ఆరోగ్యంగా ఉండవచ్చు.