Electrolytes | మనం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు కలిగిన ఆహారాలను రోజూ తీసుకోవాలన్న విషయం అందరికీ తెలిసిందే. పోషకాలు అంటే విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు, కొవ్వులు, పిండి పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర సమ్మేళనాలు ఈ కోవకు చెందుతాయి. అయితే వీటిల్లో మినరల్స్‌నే ఎలక్ట్రోలైట్స్ అని కూడా పిలుస్తారు. ఇవి మన శరీరంలో అనేక జీవక్రియలను సరిగ్గా నిర్వహించేందుకు సహాయం చేస్తాయి. ఎలక్ట్రోలైట్స్ మనకు ఆహారాలు, ద్రవాల ద్వారా లభిస్తాయి. ఇవి మనం విసర్జించే చెమట, మూత్రం ద్వారా బయటకు పోతుంటాయి. కనుక ఎప్పటికప్పుడు మన శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంగా ఉండాలి. అప్పుడే మన శరీరం అన్ని క్రియలను సక్రమంగా నిర్వహిస్తుంది.
ఎలక్ట్రోలైట్స్ మన శరీరంలో అనేక విధులను నిర్వర్తిస్తాయి. ద్రవాలను సమతుల్యంలో ఉంచేందుకు సహాయం చేస్తాయి. శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా రక్షిస్తాయి. దీని వల్ల కణాలకు ఎప్పటికప్పుడు శక్తి లభిస్తుంది. నాడీ మండల వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. మెదడు యాక్టివ్‌గా ఉంటుంది. కండరాలు సక్రమంగా పనిచేస్తాయి. గుండె సరైన రీతిలో కొట్టుకుంటుంది. ఎలక్ట్రోలైట్స్ వల్ల శరీరంలో పీహెచ్ స్థాయిలు సక్రమంగా ఉంటాయి. అలాగే బీపీ నియంత్రణలో ఉంటుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కణాలకు పోషకాలను అందించేందుకు కూడా ఎలక్ట్రోలైట్స్ సహాయం చేస్తాయి. శరీరంలో ఎప్పటికప్పుడు ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను బయటకు పంపించడంలో ఎలక్ట్రోలైట్స్ కీలకపాత్ర పోషిస్తాయి. దీంతో శరీరం అంతర్గతంగా శుభ్రంగా ఉంటుంది. దెబ్బ తిన్న కణజాలాలకు మరమ్మత్తులను నిర్వహించడంలోనూ ఎలక్ట్రోలైట్స్ కీలకంగా పనిచేస్తాయి. ఇలా ఎలక్ట్రోలైట్స్ మన శరీరంలో అనేక విధులను నిర్వర్తిస్తాయి.
సోడియం, పొటాషియం, క్లోరైడ్, క్యాల్షియం, మెగ్నిషియం, బైకార్బొనేట్ వంటి మినరల్స్, సమ్మేళనాలను ఎలక్ట్రోలైట్స్ గా పిలుస్తారు. ఇవి మనకు ఘనాహారాలు, ద్రవాహారాల ద్వారా లభిస్తాయి. సాధారణంగా శారీరక శ్రమ లేదా వ్యాయామం ఎక్కువగా చేసేవారు, క్రీడాకారులకు చెమట అధికంగా వస్తుంటుంది. వారి శరీరం ఎలక్ట్రోలైట్స్ ను త్వరగా కోల్పోతుంది. కనుక వారు నీళ్లతోపాటు ఎలక్ట్రోలైట్స్ ఉండే పానీయాలను ఎక్కువగా తాగుతుంటారు. క్రీడాకారులు వివిధ రకాల రంగుల్లో ఉండే పానీయాలను తాగడం మీరు చూసే ఉంటారు. అవి చక్కెర, ఎలక్ట్రోలైట్స్ నిండి ఉండే పానీయాలు. వాటిని తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభించి మళ్లీ క్రీడల్లో చురుగ్గా పాల్గొంటారు. అలాగే శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ ను తిరిగి పొందుతుంది. దీని వల్ల నీరసం, అలసట రాకుండా ఉంటాయి. ఇలా ఎలక్ట్రోలైట్స్ పనిచేస్తాయి.
అయితే ఎలక్ట్రోలైట్స్ వాటర్‌ను మనం ఇంట్లోనూ తయారు చేసుకోవచ్చు. అందుకు గాను 250 ఎంఎల్ మోతాదులో నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. అందులో పావు టీస్పూన్ ఉప్పు, పావు కప్పు నిమ్మరసం, ఒకటిన్నర కప్పుల కొబ్బరి నీళ్లు, 2 కప్పుల చల్లని నీరు కలపాలి. అన్నింటినీ బాగా కలిపి అనంతరం ఆ నీళ్లను థర్మల్ ప్రూఫ్ బాటిల్లో పోసి నిల్వ చేసుకోవాలి. దీంతో బయటకు వెళ్లినప్పుడు ఆ బాటిల్‌ను వెంట తీసుకెళ్లాలి. మీకు బాగా దాహంగా ఉన్నా లేదా శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసినా ఆ నీళ్లను తాగవచ్చు. దీంతో శరీరానికి ఎప్పుడూ ఎలక్ట్రోలైట్స్‌ను అందించేందుకు వీలుంటుంది. అలాగే తరచూ డీహైడ్రేషన్ బారిన పడేవారు కూడా ఈ నీళ్లను తయారు చేసుకుని ఎప్పుడంటే అప్పుడు తాగవచ్చు. ఈ విధంగా ఎలక్ట్రోలైట్స్ ను మనం సులభంగా పొందవచ్చు. అయితే ఇలా తయారు చేయడం వీలు కానప్పుడు తక్షణమే శక్తిని, ఎలక్ట్రోలైట్స్ ను పొందాలంటే ఏదైనా పండ్ల రసం సేవించవచ్చు. లేదా కొబ్బరినీళ్లను తాగవచ్చు. దీంతో శరీరానికి తక్షణమే శక్తి, ఎలక్ట్రోలైట్స్ లభిస్తాయి. దీని వల్ల ఉత్సాహంగా ఉంటారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చు.